OTT Top Malayalam Movies: ఓటీటీల్లోకి ఈ మధ్యే వచ్చిన టాప్ 10 మలయాళం మూవీస్ ఇవే.. అన్నీ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్ మూవీసే
OTT Top Malayalam Movies: ఓటీటీల్లోకి ఈ మధ్యకాలంలో కొన్ని బ్లాక్‌బస్టర్, సూపర్ హిట్ మలయాళం సినిమాలు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, సోనీలివ్, ప్రైమ్ వీడియో, జీ5, మనోరమ మ్యాక్స్ లాంటి ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ 10 మూవీస్ ఏవో ఇక్కడ చూడండి.
OTT Top Malayalam Movies: ఓటీటీలు వచ్చిన తర్వాత మలయాళం సినిమాలకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో ప్రతి వారం ఓటీటీల్లోకి వచ్చే మాలీవుడ్ మూవీస్ ను ఎగబడి చూసేస్తున్నారు. వీటిలో కొన్ని తెలుగులోనూ డబ్ చేస్తుండగా.. మరికొన్నింటిని సబ్ టైటిల్స్ తోనూ చూస్తున్నారు. ఇలా ఈ మధ్యే ఓటీటీల్లోకి వచ్చిన టాప్ 10 మలయాళం మూవీస్ ఏంటో చూద్దాం. వీటిలో ఎక్కువగా కామెడీ, క్రైమ్ థ్రిల్లర్ మూవీసే ఉన్నాయి.
ఓటీటీల్లోని టాప్ 10 మలయాళం మూవీస్
నూనక్కుళి - జీ5 ఓటీటీ
నూనక్కుళి ఓ కామెడీ థ్రిల్లర్ మూవీ. దృశ్యం మూవీని డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేశాడు. మంచి కామెడీని పంచుతూనే ఊహించని ట్విస్టులతో చివరి వరకూ సరదాగా సాగిపోయే మంచి టైంపాస్ మూవీ. బేసిల్ జోసెఫ్ నటించిన ఈ నూనక్కుళి మూవీ జీ5 ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులో ఉంది.
తలవన్ - సోనీలివ్
తలవన్ మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ. ప్రస్తుతం సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ హత్య ఇద్దరు పోలీసు ఆఫీసర్ల కెరీర్ ను ఎలాంటి ప్రమాదంలోకి నెట్టేసింది? దాని నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారన్నది ఈ మూవీలో చూడొచ్చు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలను మంచి ట్విస్టులతో అందించే అక్కడి ఫిల్మ్ మేకర్స్ తీసిన మరో సూపర్ మూవీ ఈ తలవన్.
వాజా - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
వాజా ఓ మలయాళం కామెడీ డ్రామా. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో సోమవారం (సెప్టెంబర్ 23) నుంచి తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇది జీవితంలో ఏ లక్ష్యం లేకుండా తిరుగుతూ లూజర్లుగా మిగిలిపోయిన ఐదుగురు స్నేహితుల చుట్టూ తిరిగే కథ. మలయాళంలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
స్వకార్యం సంభవబహుళం - మనోరమ మ్యాక్స్
మంచి ట్విస్టులతో కూడిన ఫ్యామిలీ డ్రామాను చూడాలనుకుంటే ఈ స్వకార్యం సంభవబహుళం మూవీని చూడొచ్చు. మనోరమ మ్యాక్స్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. నజీర్ బహరుద్దీన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఓ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతూ ఊహించని ట్విస్టులతో చివరి వరకూ మంచి థ్రిల్ పంచుతుంది.
జలధార పంప్‌సెట్ సిన్స్ 1962 - జియో సినిమా
మరో మలయాళ కామెడీ డ్రామా జలధార పంప్ సెట్ సిన్స్ 1962. తన ఇంట్లో పంప్ సెట్ దొంగతనానికి గురైందంటూ కోర్టుకెక్కే ఓ భర్తను కోల్పోయిన మహిళ చుట్టూ తిరిగే కథ ఇది. కామెడీని పంచుతూనే ప్రస్తుత సమాజంలోని సమస్యలను కళ్లకు కట్టే మూవీ. ఈ మూవీని ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు.
సీఐడీ రామచంద్రన్ రిటైర్డ్ ఎస్ఐ - మనోరమ మ్యాక్స్
ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ. తమకు సంబంధం లేని కేసులో ఇరుక్కొని బాధపడుతున్న వారి తరఫున ఓ రిటైర్డ్ ఎస్ఐ సాగించే పోరాటం ఈ సినిమా. మలయాళం సినిమా నుంచి ఇప్పటికే ఎన్నో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ రాగా.. అందులో ఇది కూడా ఒకటి.
అడియోస్ అమిగో - నెట్‌ఫ్లిక్స్
అడియోస్ అమిగో ఓ మలయాళ కామెడీ మూవీ. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆసిఫ్ అలీ, సూరజ్ వెంజరమ్మూద్ నటించారు. అనుకోకుండా ఓ బస్ స్టాండ్ లో కలిసి, స్నేహితులుగా మారిపోయే ఇద్దరు వ్యక్తుల చుట్టూ తిరుగుతూ సరదాగా సాగిపోయే కథ ఇది.
విశేషం - అమెజాన్ ప్రైమ్ వీడియో
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది విశేషం మూవీ. ఇది కామెడీ ఫ్యామిలీ డ్రామా. ఓ పోలీస్ ఆఫీసర్ ను పెళ్లి చేసుకున్న ఓ మధ్య వయస్కుడు ఎదుర్కొనే సవాళ్ల చుట్టూ తిరుగుతుంది.
పవీ కేర్‌టేకర్ - మనోరమ మ్యాక్స్
పవీ కేర్‌టేకర్ మూవీ మనోరమ్ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దిలీప్ నటించిన ఈ కామెడీ మూవీ కూడా ఈ ఏడాది ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హిట్ సినిమాల్లో ఒకటి.
ఆనందపరం డైరీస్ - మనోరమ మ్యాక్స్
తెలుగు నటి మీనా నటించిన ఆనందపురం డైరీస్ ఓ క్యాంపస్ థ్రిల్లర్ మూవీ. ఓ కాలేజీలో జరిగే హత్య చుట్టూ తిరిగే ఈ సినిమా ప్రస్తుతం మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.