Tillu Square Oh My Lily song: టిల్లు స్క్వేర్ నుంచి హార్ట్ బ్రేక్ సాంగ్ రిలీజ్.. మెలోడియస్‌గా.. ఎమోషనల్‍గా..
Tillu Square Movie - Oh My Lily song: టిల్లు స్క్వేర్ చిత్రం నుంచి ‘ఓ మై లిల్లీ’ పాట రిలీజ్ అయింది. హార్ట్ బ్రేక్ సాంగ్‍గా ఇది ఉంది. మోలోడియస్ ట్యూన్‍తో ఆకట్టుకుంటోంది.
Tillu Square Third Song: స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న టిల్లు స్క్వేర్ మూవీకి క్రేజ్ విపరీతంగా ఉంది. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ తర్వాత ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. డిజే టిల్లు చిత్రంతో 2022లో భారీ హిట్ కొట్టారు సిద్ధు. ఆ సినిమాతో టిల్లు క్యారెక్టర్ ఐకానిక్‍గా నిలిచిపోయింది. ఆ మూవీకి సీక్వెల్‍గా మాలిక్ రామ్ దర్శకత్వంలో ‘టిల్లు స్క్వైర్’ చిత్రం వస్తోంది. చాలా వాయిదాల తర్వాత ఎట్టకేలకు మార్చి 29న రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. ఈ తరుణంలో టిల్లు స్క్వేర్ నుంచి నేడు (మార్చి 18) మరో పాట రిలీజ్ అయింది.
ప్రాణాన్ని నలిపేసి వెళ్లిపోకమ్మా..
టిల్లు స్క్వేర్ చిత్రం నుంచి ‘ఓ మై లిల్లీ’ పూర్తి పాట లిరికల్ వీడియోను నేడు మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ‘ఓ మై లిల్లీ.. ఓ మై లిల్లీ.. ప్రాణాన్ని నలిపేసి వెళ్లిపోకమ్మా’ అంటూ ఈ పాట షురూ అయింది. సినిమాలో లిల్లీ (అనుపమ పరమేశ్వరన్)తో బ్రేకప్ అయినప్పుడు వచ్చే హార్ట్ బ్రేక్ సాంగ్‍గా ఇది ఉండనున్నట్టు అర్థమవుతోంది.
లిరిక్స్ ఇచ్చిన సిద్ధు
టిల్లు స్క్వేర్ నుంచి ఓ మై లిల్లీ పాటకు మంచి మెలోడియస్ ట్యూన్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణి. ఎమోషనల్‍గానూ ఈ సాంగ్ అనిపిస్తోంది. ఈ పాటను శ్రీరామ్ చంద్ర పాడారు. హీరో సిద్దు జొన్నలగడ్డ, రవి ఆంటోనీ ఈ పాటకు లిరిక్స్ అందించారు. టిల్లు స్క్వేర్ మూవీకి స్వయంగా కథ అందించిన సిద్ధు.. ఇప్పుడు పాట రచనలోనూ ఓ చేయి వేశారు.
ఓ మై లిల్లీ పాట రిలీజ్ కోసం నేడు ఈవెంట్ నిర్వహించింది మూవీ టీమ్. హైదరాబాద్‍లోని ఏఎంబీ థియేటర్లో ఈ ఈవెంట్ జరిగింది. సిద్దు జొన్నలగడ్డ, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, నిర్మాత నాగవంశీ సహా మరికొందరు మూవీ టీమ్ సభ్యులు ఈ ఈవెంట్‍లో పాల్గొన్నారు.
టిల్లు స్క్వేర్ మూవీ నుంచి ఇప్పటి వరకు రెండు పాటలు చాలా పాపులర్ అయ్యాయి. ‘టికెట్టే కొనకుండా’, ‘రాధికా.. రాధికా’ సాంగ్స్ హిట్ అయ్యాయి. ఈ రెండు పాటలకు రామ్ మిర్యాల మ్యూజిక్ ఇచ్చారు. గత నెల వచ్చిన ట్రైలర్‌కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సిద్ధు డైలాగ్‍లు మరోసారి పేలాయి. సిద్ధు, అనుపమ మధ్య రొమాన్స్ హైలైట్‍గా నిలిచింది.
టిల్లు స్క్వేర్ చిత్రంలో సిద్దు, అనుపమ హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా.. మురళీధర్ గౌడ్, సీవీఎల్ నరసింహా రావు, మురళీ శర్మ, ప్రణీత్ రెడ్డి కీలకపాత్రలు చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. దీంతో ప్రమోషన్లను ఇప్పటి నుంచి జోరుగా చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేసింది. మార్చి 29న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది.
సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై నాగవంశీ, సాయి సౌజన్య.. టిల్లు స్క్వేర్ మూవీని నిర్మించారు. సాయి ప్రకాశ్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు.