NNS June 18th Episode: తెలిసిన అమ్ము ఆచూకీ- మిస్సమ్మ తప్పు లేదనుకున్న అమర్- మనోహరి వెంట భాగీ- కొండపై నుంచి దూకిన అమ్ము!
Nindu Noorella Saavasam June 18th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూన్ 18వ తేది ఎపిసోడ్‌లో అమ్ము ఎక్కడుందో అరుంధతికి గుప్తా చెబుతాడు. అమ్ము ద్వారా ఆరు ఆత్మను ఘోరా బంధించాలనుకుంటాడు. మరోవైపు మనోహరిని మిస్సమ్మ ఫాలో అవుతుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 18th June Episode) నేనొక ఆత్మనే కావచ్చు. నాకు ప్రాణం లేకపోవచ్చు. కానీ, నా కన్నప్రేమ నా కూతురిని కాపాడుకుంటుంది. దయచేసి ఆ ఘోరా నా కూతురిని ఎక్కడ దాచాడో చెప్పండి. నిజాన్ని దాయడం కూడా తప్పే.. మీరు ఆ తప్పు చేయకండి. ఆ ఘోరా నా పాపని ఎక్కడ దాచాడో చెప్పండి అని గుప్తను వేడుకుంటుంది అరుంధతి.
సీసీటీవీ ఫుటేజ్ చూసి
ప్రతిసారీ నువ్వు ఇలా నన్ను ఇరకాటంలో పెట్టి సమస్యలు సృష్టిస్తున్నావు బాలిక.. ఆ ఘోరా నీ పిల్లపిచ్చుకను తీసుకెళ్లి ఊరుబయట కొండపై కూర్చున్నాడు అని చెబుతాడు గుప్త. అరుంధతి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అమర్, రాథోడ్ కలిసి అమ్ము కోసం వెతుకుతూ ఉంటారు. పోలీసులు వచ్చి అమ్ము ఎక్కడ తప్పిపోయిందో ఆ లొకేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలను చెక్ చేస్తారు. సీసీటీవీ ఫుటేజీలో అమ్ముని ఘోరా తీసుకుపోయిందంతా రికార్డవుతుంది.
అది చూసిన రాథోడ్, అమర్‌తో పాటు పోలీసులు కూడా షాకవుతారు. అదేంటి సార్.. అమ్ముని ఎవరో కిడ్నాప్ చేశాడనుకుంటే అమ్మునే వెళ్తోంది అంటాడు. ఘోరాను గుర్తుపట్టిన అమర్ అమ్ముని కావాలనే తీసుకెళ్లాడని అర్థం చేసుకుంటాడు. అరుంధతిని చంపేశారు, మిస్సమ్మను చంపాలని చూస్తున్నారు. అమ్ముని కిడ్నాప్ చేశారు.. అసలెవరు నా కుటుంబం మీద పగబట్టారు అని ఆలోచిస్తాడు అమర్.
కొట్టి తప్పు చేశాను
సార్.. జరిగినదాంట్లో మిస్సమ్మ తప్పేం లేదు. మీరే తొందరపడి మిస్సమ్మను అపార్థం చేసుకున్నారు అంటాడు రాథోడ్. మిస్సమ్మపై చెయ్యిచేసుకుని తప్పుచేశానని అనుకుంటాడు అమర్. వెంటనే పోలీసులను చుట్టుపక్కల వెతకమని చెబుతాడు. అమర్, రాథోడ్ కలిసి పక్కనే ఉన్న కొండపై వెతకడానికి వెళ్తారు.
అమ్ముని కొండపైకి తీసుకెళ్లిన ఘోరా తన వశీకరణ శక్తితో అరుంధతి ఆత్మను రప్పించేందుకు ప్రయత్నిస్తాడు. తన గెలుపు ఖాయమంటూ సంబరపడిపోతాడు. ఈ ప్రపంచమంతా ఇక తన వశమవుతారంటూ విజయ గర్వంతో నవ్వుతాడు ఘోరా. ఆత్మను బంధించి అతీత శక్తులు పొంది ఈ విశ్వాన్ని పాలించబోతున్నానంటూ నవ్వుతాడు. అరుంధతి పరిగెత్తుకుంటూ కొండ దగ్గరకు వస్తుంది. వెంట గుప్త కూడా వస్తాడు.
ఘోరా చెప్పినట్లు చేయమ్మా
దూరంగా అమ్ము కొండపై నుంచి కిందకు దూకబోవడం చూసి అరుస్తుంది అరుంధతి. ఘోరా చెప్పమన్నట్లు ఏడుస్తూ నన్ను కాపాడమ్మా.. ఈ ఘోరా చెప్పినట్లు చెయ్యమ్మా అని అరుస్తూ అమ్ము కొండ అంచున నిల్చుంటుంది. అమ్ముకి ఏం కాకుండా కాపాడమని దేవుడిని వేడుకుంటుంది మిస్సమ్మ. పిల్లల్ని తాను జాగ్రత్తగా చూసుకున్నానని సంజాయిషీ ఇస్తున్న మిస్సమ్మను వారించి తనను పూర్తిగా నమ్ముతున్నామని అంటారు నిర్మల, శివరామ్.
అమర్ అమ్ముని జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తాడు, నువ్వేం భయపడకు అని ధైర్యం చెబుతాడు శివరామ్. కూతురు కనపడట్లేదనే కోపంలో అమర్ నిన్ను కొట్టాడు. కానీ, నీ మీద కోపంతో కాదని నచ్చజెప్పుతారు. ఆయన ప్రేమతోపాటు కోపం కూడా తెలుసని, ఆయనకి పిల్లల మీదున్న ప్రేమనే తనమీద చెయ్యి చేసుకునేలా చేసిందని అంటుంది మిస్సమ్మ.
మనోహరిని ఫాలో అయిన మిస్సమ్మ
మనోహరి ఘోరాకు ఫోన్ చేసి మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంది. హాల్లో కూర్చుని ఏడుస్తున్న మిస్సమ్మను చూసి కంగారు పడుతుంది మనోహరి. హాల్లో మిస్సమ్మ లేదని నిర్ధారించుకుని కారులో హడావుడిగా బయటకు వెళ్తుంది. మనోహరిని ఫాలో అవుతుంది మిస్సమ్మ. కొండ అంచున నిల్చున్న అమ్ముని చూసి కంగారు పడుతుంది అరుంధతి. వెనక్కి వెళ్లమని అరుస్తుంది.
ఎవరు కాపాడుతారు?
అమ్ము దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించిన అరుంధతిని ఆపుతాడు గుప్త. ఆ ఘోరా అమ్ముని వశపర్చుకున్నాడని చెబుతాడు. ఘోరా బారినుంచి అమ్ముని ఎవరు కాపాడతారు? ఘోరా అరుంధతి ఆత్మను బంధిస్తాడా? అనే విషయాలు తెలియాలంటే జూన్ 19న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!