NNS June 15th Episode: అమ్మును వశీకరణతో కిడ్నాప్ చేసిన ఘోరా.. అరుంధతి ఆత్మ కోసం ప్లాన్.. మిస్మమ్మను కొట్టిన అమర్
Nindu Noorella Saavasam June 15th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జూన్ 15వ తేది ఎపిసోడ్‌లో అమ్మును వశీకరణ మంత్రంతో కిడ్నాప్ చేస్తాడు ఘోరా. అమ్మును అడ్డుపెట్టుకుని అరుంధతి ఆత్మను దక్కించుకోవాలనుకుంటాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 15th June Episode) మిస్సమ్మతో కలిసి పిల్లలు షాపింగ్‌కి బయల్దేరతారు. అమ్ము ప్రమాదంలో పడబోతోందని గుప్త చెప్పడంతో కారు వెనకాల అరుంధతి పరిగెడుతుంది. అమ్ముని కిడ్నాప్ చేయమని ఘోరాకు చెబుతుంది మనోహరి.
అమర్‌కు ప్రాణం
నీ పని నువ్వు పూర్తి చేశావు నా పని నేను పూర్తి చేస్తానంటాడు ఘోరా. అమర్‌కి ఏమాత్రం అనుమానం రాకుండా అమ్ముని కిడ్నాప్ చేయాలి. అమర్‌కి పిల్లలంటే ప్రాణం.. మనమే అమ్ముని కిడ్నాప్ చేశామని తెలిస్తే ఏం చేస్తాడో ఊహించడానికే భయంగా ఉంది అంటుంది మనోహరి. నువ్వేం భయపడకు మనోహరి.. ఏ పనైనా మూడో కంటికి తెలియకుండా చేయడం నాకు అలవాటు. నాకు కావాల్సిన దానికోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమే అంటాడు ఘోరా.
నీ మొహం ఇంట్లో అందరూ చూశారు.. ఇప్పుడు నువ్వు వాళ్లముందుకు ఎలా వెళ్తావు.. అమ్ముని ఎలా కిడ్నాప్ చేస్తావు అని అడుగుతుంది మనోహరి. నేను కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదు.. ఆ అమ్మాయే నా మాట విని నా వెంట వస్తుంది అంటాడు ఘోరా. అమ్ము నీ వెంట రావడం ఏంటి? అని ఆశ్చర్యపోతుంది మనోహరి. చెబితే అర్థంకాదు చూపిస్తా అని మనోహరిని తాను చెప్పింది వినేట్టు మార్చి అర్థమయ్యేలా వివరిస్తాడు.
వశీకరణ మహత్యం
ఏం జరిగిందని కంగారు పడుతున్న మనోహరితో అదే వశీకరణ మహత్యం అని చెబుతాడు. అలా అయితే అమ్ముని తేలిగ్గా కిడ్నాప్ చేయొచ్చని సంబరపడిపోతుంది మనోహరి. ఒక్క దెబ్బకి రెండు పనులు అవుతాయంటాడు ఘోరా. రెండు పనులేంటి అని అడుగుతున్న మనోహరి మాటకి ఆ పిల్ల ప్రాణం తీసైనా అరుంధతి ఆత్మను ఇక్కడకు రప్పిస్తా అని మనసులో అనుకుంటాడు ఘోరా. సరే.. ఏదైనా జాగ్రత్తగా చెయమని చెప్పి అక్కడనుంచి వెళ్తుంది మనోహరి.
అంజు.. నిన్ను చూడగానే మీ ప్రిన్సిపాల్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌కి ఎందుకో ఆమెకి నువ్వంటే ఇంకా భయం పోనట్లుంది. నీ దెబ్బకి ఆమె స్కూల్ మానేస్తుందేమో అంటుంది మిస్సమ్మ. పిల్లలంతా నవ్వుతారు. ఆమెని నోరు మూసుకుని కూర్చోమని చెప్పు అంటుంది అంజు. మిగతా వాళ్లు కూడా తనతో మాట్లాడేటట్టు చూడమని అమ్ముని బతిమాలుతుంది మిస్సమ్మ. అమ్ము మిస్సమ్మ చేసిన పనుల్ని గుర్తు చేసి అందరికీ కోపం పోగొట్టే ప్రయత్నం చేస్తుంది.
ఐస్ క్రీమ్ కోసం
నీకు మిస్సమ్మ అనే పేరు సూటవలేదు.. మహానటి అని పెడితే బాగా సూటయ్యేది అంటుంది అంజు. ఐస్‌క్రీమ్ కనపడగానే ఆకాష్ కారు ఆపమని చెప్పి దిగిపోతారు. పిల్లలు.. చెప్పకుండానే వెళ్తున్నారు మీకు ఏదైనా అయితే మీ నాన్న ఒక్క దెబ్బతో నన్ను చంపుతారు అంటుంది మిస్సమ్మ. మీరు పర్మిషన్ ఇస్తే వెళ్లి ఐస్‌క్రీమ్ తిని వస్తాం అని మిస్సమ్మను అడుగుతుంది అంజు. సరే అనగానే పిల్లలు ఐస్‌క్రీమ్ బండి దగ్గరకు పరిగెత్తి కొనుక్కుంటారు.
అంజు మాటలకు బాధపడకు మిస్సమ్మ అంటున్న అమ్ముతో పర్లేదు అంటుంది మిస్సమ్మ. నువ్వు పక్కనుంటే అమ్మతో ఉన్నట్లే ఉంటుంది అంటుంది అమ్ము. నువ్వు అర్థం చేసుకున్నట్లే అంజు వాళ్లు కూడా అర్థం చేసుకుంటే బాగుండు అంటుంది మిస్సమ్మ. ఘోరా మారు వేషంలో పిల్లల దగ్గరకు వస్తాడు. అరుంధతి కూడా పిలల్ని వెతుక్కుంటూ వస్తుంది. నావల్లే అమ్ము ప్రమాదంలో పడింది.. గుప్తగారు నిజమే చెప్పారా? లేకపోతే నన్ను భయపెట్టేందుకు చెప్పారా? అని ఆలోచిస్తూ ఉంటుంది.
భయపడిన అరుంధతి
మనోహరి అమ్ముని ఏదో చేయబోతుందని ఇంట్లో అందరి దగ్గరకు వెళ్లి చెప్పేందుకు ప్రయత్నిస్తుంది. మనోహరి దగ్గరకు వెళ్లి అమ్ముని ఏం చేయొద్దు అని బతిమిలాడుతుంది. కానీ ఎవరికీ అరుంధతి మాటలు వినపడకపోవడంతో తన ప్రయత్నం వ్యర్థం అని అర్థం చేసుకుంటుంది. ఫోన్ కోసం వేచి చూస్తున్న మనోహరిని చూసి ఏదో జరగబోతుందని భయపడుతుంది అరుంధతి.
మిస్సమ్మకు ఫోన్ చేసి పిల్లలు ఎలా ఉన్నారో కనుక్కోమని శివరామ్‌కి చెబుతుంది అరుంధతి. నిర్మలను ఫోన్ ఇమ్మని చెప్పి మిస్సమ్మతో మాట్లాడుతాడు శివరామ్. మిస్సమ్మ ఫోన్ తీసి అంతా బానే ఉందని చెప్పడంతో సరేనని పెట్టేస్తాడు. పిల్లలు ఐస్‌క్రీమ్ తింటున్నారట. కాసేపట్లో వచ్చేస్తారట అని చెప్పడంతో హమ్మయ్య.. అనుకుంటుంది అరుంధతి.