Saripodhaa Sanivaaram OTT Release: మరో రెండు రోజుల్లో ఓటీటీలోకి సరిపోదా శనివారం సినిమా.. ఎక్కడ చూడొచ్చు?-nani action thriller movie saripodhaa sanivaaram movie will be streaming in netflix ott this week release date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Saripodhaa Sanivaaram Ott Release: మరో రెండు రోజుల్లో ఓటీటీలోకి సరిపోదా శనివారం సినిమా.. ఎక్కడ చూడొచ్చు?

Saripodhaa Sanivaaram OTT Release: మరో రెండు రోజుల్లో ఓటీటీలోకి సరిపోదా శనివారం సినిమా.. ఎక్కడ చూడొచ్చు?

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 24, 2024 08:07 PM IST

Saripodhaa Sanivaaram OTT: సరిపోదా శనివారం ఓటీటీలోకి వచ్చేస్తోంది. స్ట్రీమింగ్ డేట్ సమీపిస్తోంది. నాని హీరోగా నటించిన ఈ చిత్రం ఐదు భాషల్లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

Saripodhaa Sanivaaram OTT: ఓటీటీలోకి మరో రెండు రోజుల్లో సరిపోదా శనివారం చిత్రం.. హాయ్ నాన్న మ్యాజిక్ రిపీట్ చేస్తుందా?
Saripodhaa Sanivaaram OTT: ఓటీటీలోకి మరో రెండు రోజుల్లో సరిపోదా శనివారం చిత్రం.. హాయ్ నాన్న మ్యాజిక్ రిపీట్ చేస్తుందా?

సరిపోదా శనివారం చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ అయినా నెలలోపే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ మూవీ ఆగస్టు 29న థియేటర్లలో రిలీజ్ అయింది. సుమారు రూ.100కోట్ల గ్రాస్ కలెక్షన్లతో దుమ్మురేపింది. నానికి హ్యాట్రిక్ బ్లాక్‍బస్టర్ దక్కింది. ఈ సూపర్ హిట్ సరిపోదా శనివారం చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‍కు సమయం సమీపించింది.

స్ట్రీమింగ్ వివరాలివే..

సరిపోదా శనివారం సినిమా మరో రెండు రోజుల్లో అంటే సెప్టెంబర్ 26వ తేదీనే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ప్రేక్షకులను ఎక్కువగా వెయిట్ చేయించకుండానే అప్పుడే ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఇంకా కాస్త థియేట్రికల్ రన్ ఉన్నా స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది.

ఈ గురువారం సెప్టెంబర్ 26న తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలోనూ సరిపోదా శనివారం స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‍ను గుర్తు చేస్తూ నేడు (సెప్టెంబర్ 24) ఓ ట్రైలర్ కూడా తీసుకొచ్చింది నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ. “సోకులపాలెం వాళ్ల జీవితాలు మార్చడానికి ఒక్క శనివారం సరిపోదా? సెప్టెంబర్ 26న సరిపోదా శనివారం నెట్‍‍ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తోంది” అని సోషల్ మీడియాలో నెట్‍‍ఫ్లిక్స్ పోస్ట్ చేసింది.

ముందు చేసుకున్న డీల్ ప్రకారమే

సరిపోదా శనివారం సినిమా ఓటీటీ డీల్‍ను రిలీజ్‍కు ముందే మేకర్స్‌తో నెట్‍ఫ్లిక్స్ కుదుర్చుకుంది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్‍కు తెచ్చేలా పక్కాగా ఒప్పందం చేసుకుంది. దీంతో మూవీ బ్లాక్‍బస్టర్ అయినా నెల ముగియకుండానే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

హాయ్ నాన్న మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

నాని హీరోగా నటించిన హాయ్ నాన్న చిత్రం గతేడాది డిసెంబర్‌లో థియేటర్లలోకి వచ్చి హిట్ అయింది. ఆ తర్వాత ఈ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో పెద్ద సక్సెస్ అయింది. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ భారీ వ్యూస్ దక్కించుకుంది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో హాయ్ నాన్న మూవీ తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ వ్యూస్ దక్కించుకుంది. చాలా వారాలు ట్రెండింగ్‍లో కొనసాగింది.

తమ ప్లాట్‍ఫామ్‍లో హాయ్ నాన్న ఫుల్ సక్సెస్ కావటంతో సరిపోదా శనివారం స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఏకంగా రూ.45కోట్ల భారీ మొత్తంతో తీసుకుందని తెలుస్తోంది. థియేటర్లలో పాజిటివ్ టాక్ రావటంతో సరిపోదా శనివారం ఓటీటీలోనూ దుమ్మురేపుతుందనే అంచనాలు ఉన్నాయి. తెలుగుతో పాటు హిందీలోనూ భారీ వ్యూస్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి హాయ్ నాన్న రేంజ్‍లో ఓటీటీలో సరిపోదా శనివారం సక్సెస్ అవుతుందేమో చూడాలి.

సరిపోదా శనివారం మూవీలో నానికి జోడీగా ప్రియాంక మోహన్ నటించారు. ఎస్‍జే సూర్య నెగెటివ్ రోల్ పోషించారు. సోకులపాలెం జనాల కోసం సీఐ దయానంద్ (ఎస్‍జే సూర్య)తో సూర్య (నాని) తలపడటం చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. శనివారం మాత్రమే కోపం తెచ్చుకొని గొడవ పడే విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించి సక్సెస్ అయ్యారు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. ఈ చిత్రానికి జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్ నిర్మించింది.

Whats_app_banner