Nani: ఎవరు.. ఎందుకు మొదలుపెట్టారో.. నాకు సంబంధం లేదు, వదిలేయండి: నాని-i do not know started tiers in industry says nani at saripodhaa sanivaaram success meet ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nani: ఎవరు.. ఎందుకు మొదలుపెట్టారో.. నాకు సంబంధం లేదు, వదిలేయండి: నాని

Nani: ఎవరు.. ఎందుకు మొదలుపెట్టారో.. నాకు సంబంధం లేదు, వదిలేయండి: నాని

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 31, 2024 06:42 PM IST

Nani - Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. దీంతో సక్సెస్ మీట్‍ను నిర్వహించింది మూవీ టీమ్. ఈ సందర్భంగా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు హీరో నాని. హీరోల్లో టైర్స్ గురించి వచ్చిన క్వశ్చన్‍కు కూడా ఆయన రెస్పాండ్ అయ్యారు.

Nani: ఎవరు.. ఎందుకు మొదలుపెట్టారో.. నాకు సంబంధం లేదు, వదిలేయండి: నాని
Nani: ఎవరు.. ఎందుకు మొదలుపెట్టారో.. నాకు సంబంధం లేదు, వదిలేయండి: నాని

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ పాజిటివ్ టాక్‍తో దూసుకెళుతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈ గురువారం (ఆగస్టు 29) రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. నాని, ఎస్‍జే సూర్య యాక్టింగ్‍, వివేక్ టేకింగ్‍ ప్రేక్షకులను మెప్పించాయి. సరిపోదా శనివారం హిట్ ఖాయం కావటంతో నేడు (ఆగస్టు 31) సక్సెస్ మీట్ నిర్వహించింది మూవీ టీమ్.

తెలుగు సినీ ఇండస్ట్రీలో టైర్-1, 2, 3 అంటూ హీరోలను కొందరు పరిగణిస్తుంటారు. సోషల్ మీడియాలో ఈ విషయం చక్కర్లు కొడుతోంది. సరిపోదా శనివారం అదరగొడతుండటంతో టైర్-2లో ఉన్న నాని టైర్-1లోకి వచ్చేశారంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇదే విషయంపై ఈ సక్సెస్ మీట్‍లో నానికి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందించారు.

నాకు సంబంధం లేదు

ఈ మూవీతో టైర్-1 హీరో అయ్యారని అంటున్నారని నానికి క్వశ్చన్ ఎదురైంది. దీనికి ఆయన స్పందించారు. అసలు ఇవి ఎందుకు మొదలుపెట్టారో తెలియదని, ఈ గోల నుంచి తనను వదిలేయాలని చెప్పారు. “దయచేసి అలాంటి పేర్లు పెట్టకండి. ఎవరు మొదలుపెట్టారో తెలియదు. ఎందుకు మెదలుపెట్టారో తెలియదు. నాకు సంబంధం లేని విషయం గురించి నన్ను అడిగితే ఎలా? నన్ను ఈ గోల నుంచి వదిలేయండి” అని నాని అన్నారు.

నాని ఫ్యాన్ వార్స్ ఇలా: వివేక్ ఆత్రేయ

నాని వివరణ ఇస్తున్నా.. ఫ్యాన్స్ కోసం చెప్పాలంటూ ఈ విషయంపైనే ప్రశ్న వస్తుండటంతో దర్శకుడు వివేక్ ఆత్రేయ మైక్ అందుకున్నారు. నాని ఫ్యాన్స్ వార్ వేరుగా ఉంటుందని అన్నారు. నాని సినిమాల మధ్య ఫ్యాన్స్ వార్ జరుగుతుంటుందని కొత్త లాజిక్ చెప్పారు. “నానికి ఎక్కువగా ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి. పిల్ల జమిందార్‌కు ఫ్యాన్స్ ఉన్నారు.. జెర్సీకి కొందరు ఫ్యాన్స్ ఉన్నారు.. శ్యాం సింగరాయ్‍కు ఫ్యాన్స్ ఉన్నారు.. దసరాకు ఫ్యాన్స్ ఉన్నారు.. సరిపోదా శనివారం సినమాకు కూడా ఫ్యాన్స్ ఉంటారు” అని వివేక్ చెప్పారు. ఇలా నాని చిత్రాలకు సపరేట్ ఫ్యాన్స్ సెక్షన్ ఉన్నాయని చెప్పారు. మరిన్ని సినిమాలను కూడా ప్రస్తావించారు.

నా టార్గెట్ ఇదే

తనకు ఏ ఇండస్ట్రీకి, ఎక్కడి వెళ్లాలన్న టార్గెట్ లేదని నాని చెప్పారు. తెలుగు ఇండస్ట్రీలోనే ఉండి మనసుకు నచ్చిన కథలు చేస్తున్నానని అన్నారు. “నా టార్గెట్ అంటే ఇక్కడే ఉండాలని ఉంది. నాకు మనసుకు నచ్చిన టీమ్‍లతో పని చేస్తున్నా.. కథలకు కావాల్సిన బడ్జెట్ ఉంది.. నన్ను ఇంత ప్రేమిస్తున్న ప్రేక్షకులు ఉన్నారు. నేను ఊహించుకున్న బెస్ట్ ప్లేస్‍లో ఉన్నా. నాకు ఇక్కడి నుంచి ఎక్కడికీ వెళ్లాలని లేదు” అని నాని అన్నారు.

సరిపోదా శనివారం సినిమాలో ఎస్‍జే సూర్య పాత్ర హైలైట్ అయిన విషయంపై కూడా నాని స్పందించారు. తనకు ఇది చాలా సంతోషంగా ఉందని నాని చెప్పారు. హీరో సూర్య (నాని) అయినా.. కథ విన్నప్పుడే ఇది దయ (ఎస్‍జే సూర్య) సినిమా అని తనకు అర్థమైందని అన్నారు.

కలెక్షన్లు ఇలా..

సరిపోదా శనివారం సినిమాకు రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.36.03 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. పాజిటివ్ టాక్ ఉండటంతో ఈ వీకెండ్‍లో వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

సరిపోదా శనివారం చిత్రంలో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‍గా చేశారు. ఎస్‍జే సూర్య విలన్ పాత్ర పోషించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మూవీకి జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు.