Saripodhaa Sanivaaram Review: స‌రిపోదా శ‌నివారం రివ్యూ - హీరో నాని మాస్ యాక్ష‌న్ మూవీ హిట్టా? ఫ‌ట్టా?-nani sj surya saripodhaa sanivaaram movie review and rating priyanka mohan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Saripodhaa Sanivaaram Review: స‌రిపోదా శ‌నివారం రివ్యూ - హీరో నాని మాస్ యాక్ష‌న్ మూవీ హిట్టా? ఫ‌ట్టా?

Saripodhaa Sanivaaram Review: స‌రిపోదా శ‌నివారం రివ్యూ - హీరో నాని మాస్ యాక్ష‌న్ మూవీ హిట్టా? ఫ‌ట్టా?

Nelki Naresh Kumar HT Telugu
Aug 29, 2024 01:59 PM IST

Saripodhaa Sanivaaram Review: అంటే సుంద‌రానికి త‌ర్వాత నాని, డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ కాంబోలో రూపొందిన స‌రిపోదా శ‌నివారం గురువారం థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ మాస్ యాక్ష‌న్ మూవీ ఎలా ఉందంటే?

స‌రిపోదా శ‌నివారం రివ్యూ
స‌రిపోదా శ‌నివారం రివ్యూ

Saripodhaa Sanivaaram Review: త‌న పంథాకు భిన్నంగా చాలా రోజుల త‌ర్వాత మాస్ క‌థ‌ను ఎంచుకొని నాని చేసిన మూవీ స‌రిపోదా శ‌నివారం. యాక్ష‌న్ డ్రామా క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీకి వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప్రియాంక మోహ‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో ఎస్‌జే సూర్య విల‌న్‌గా క‌నిపించాడు. గురువారం థియేట‌ర్ల‌లో ఈ మూవీ రిలీజైంది. స‌రిపోదా శ‌నివారం ఎలా ఉంది? అంటే సుంద‌రానికితో నాని హిట్టివ్వ‌లేక‌పోయి వివేక్ ఆత్రేయ ఈ సినిమాతో ఆ లోటును భ‌ర్తీ చేశాడా? లేదా అంటే?

శ‌నివారం మాత్ర‌మే కోపం...

సూర్య‌కు (నాని) కోపం ఎక్కువ‌. త‌న కోపాన్ని అయిన వాళ్ల కోసం అవ‌స‌రాన్ని బ‌ట్టి అది కూడా శ‌నివారం మాత్ర‌మే చూపించాల‌ని చ‌నిపోతూ కొడుకు ద‌గ్గ‌ర మాట తీసుకుంటుంది సూర్య త‌ల్లి(అభిరామి). మిగిలిన ఆరు రోజులు వ‌చ్చిన కోపం మొత్తాన్ని శ‌నివారం రోజు చూపిస్తుంటాడు.

సోకులపాలెం సీఐ ద‌యానంద్‌ (ఎస్‌జే సూర్య‌) జాలి, ద‌యాలాంటి గుణాలేవి లేనీ శాడిస్ట్ పోలీస్ ఆఫీస‌ర్‌. ఎమ్మెల్యే అయినా అన్న‌య్య కూర్మాచ‌లం (మురళీశర్మ) కార‌ణంగా త‌న‌కు రావాల్సిన 45 కోట్ల ఆస్తి చేజారిపోయింద‌నే కోపంతో ఎప్పుడూ ర‌గిపోతుంటాడు. త‌ప్పొప్పుల‌తో సంబంధం లేకుండా అన్న‌పై ఉన్న‌కోపాన్ని సోకుల‌పాలెం ప్ర‌జ‌ల‌పై చూపిస్తుంటాడు ద‌యానంద్‌.

సూర్య‌కు ద‌యానంద్ టార్గెట్‌గా మారుతాడు. ద‌యానంద్‌ను కొట్ట‌కుండా సూర్య త‌న రివేంజ్‌ను తీర్చుకోవాల‌ని ఫిక్స‌వుతాడు. అందుకోసం ఎమ్మెల్యే కూర్మాచ‌లంలో ద‌యానంద్‌కు ఉన్న గొడ‌వ‌ల‌కు సూర్య త‌న‌కు అనుకూలంగా వాడుకుంటాడు. సూర్య ప్లాన్ ఫ‌లించిందా?

సోకుల పాలెం ప్ర‌జ‌ల కోసం సూర్య ఏం చేశాడు? ఈ పోరాటంలో అత‌డికి అండ‌గా నిల‌బ‌డిన చారుల‌త (ప్రియాంక మోహన్) ఎవ‌రు? ఆమెకు సూర్య‌కు ఉన్న రిలేష‌న్ ఏమిటి? సైకో పోలీస్ ఆఫీస‌ర్‌తో పోరాటంలో సూర్య ఎలాంటి అడ్డంకుల‌ను ఎదుర్కొన్నాడు అన్న‌దే స‌రిపోదా శ‌నివారం మూవీ క‌థ‌.

క‌మ‌ర్షియ‌ల్ సినిమా...

అనగనగా ఓ ఊరు…ప్ర‌జ‌ల్ని హింసించే శాడిస్ట్‌ విల‌న్‌...అత‌డికి బుద్దిచెప్పే హీరో... దాదాపు క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ల‌న్నీ ఇదే ఫార్మెట్‌లో సాగుతుంటాయి. పాయింట్ ఒక‌టే అయినా ఒక్కో ద‌ర్శ‌కుడు ఒక్కోలా ఈ కాన్సెప్ట్‌ను టాలీవుడ్ స్క్రీన్‌పై చూపిస్తూ వ‌చ్చారు. ఇలాంటి క‌థ‌ల్లో హీరో పాత్ర‌ల‌కు ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వు.

లార్జ‌న్ దేన్ లైఫ్ త‌ర‌హాలో హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ను డైరెక్ట‌ర్స్ బిల్డ్ చేస్తుంటారు. స‌రిపోదా శ‌నివారం అలాంటి రెగ్యుల‌ర్ మాస్ క‌మ‌ర్షియ‌ల్ సినిమానే అయినా త‌న ట్రీట్‌మెంట్‌, టేకింగ్‌తో కొత్త క‌థ అనే ఫీలింగ్‌ను ఆడియెన్స్‌లో క‌లిగించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ‌. ఇందులో కొంత వ‌ర‌కు మాత్ర‌మే స‌క్సెస్ అయ్యాడు.

హీరోకు ధీటుగా విల‌న్‌...

సరిపోదా శనివారంలో శ‌నివారం మాత్ర‌మే హీరో త‌న కోపాన్ని ప్ర‌ద‌ర్శిస్తాడ‌నే పాయింట్ మాత్ర‌మే కొత్త‌గా ఉంది. మిగిలిన క‌థ మొత్తం పాత వాస‌న‌ల‌తోనే సాగుతుంది. విల‌న్ పాత్ర ఎంత బాగా ఎలివేట్ అయితే హీరో క్యారెక్ట‌ర్ అంత స్క్రీన్‌పై షైన్ అవుతుంద‌నే సూత్రాన్ని ద‌ర్శ‌కుడు బ‌లంగా న‌మ్మాడు. అందుకే సూర్య‌లోని శాడిజాన్ని పీక్స్‌లో చూపించాడు.

అలాంటి విల‌న్‌ను హీరో ఎదుర్కొంటాడ‌నే క్యూరియాసిటీ చివ‌రి వ‌ర‌కు ఆడియెన్స్‌లో క‌లిగిస్తూ కామెడీ, యాక్ష‌న్‌తో పాటు చిన్న ల‌వ్‌స్టోరీతో చివ‌రి వ‌ర‌కు సినిమాను నడిపించాడు.

దాగుడుమూత‌లు...

సూర్య హీరోయిజం మొత్తం శ‌నివారానికి ఎందుకు ప‌రిమిత‌మైంది, సోకుల‌పాలెం ప్ర‌జ‌ల పాటిల ద‌యానంద్ ఎలా విల‌న్‌గా మారాడు అనే అంశాల చుట్టూ ఫ‌స్ట్ హాఫ్‌ను అల్లుకున్నారు. క్యారెక్ట‌ర్స్ బిల్డ్ చేయ‌డానికి ఫ‌స్ట్ హాఫ్ మొత్తం వాడుకున్నాడు. హీరో, విల‌న్ మ‌ధ్య ఓ కాన్‌ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తూ సెకండాఫ్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూసేలా చేశాడు డైరెక్టర్.

విల‌న్ చుట్టూ ప‌క్క‌లే ఉంటూ అత‌డిని హీరో తెలివిగా దెబ్బ‌కొట్ట‌డం అనే సేఫ్‌గేమ్‌తోనే సెకండాఫ్ మొత్తం న‌డిపించాడు డైరెక్ట‌ర్‌. ఈ దాగుడుమూత‌ల సీన్స్‌లో త‌ర్వాత ఏం జ‌రుగుతుందో అనే ఉత్కంఠ ఎక్క‌డ క‌నిపించ‌దు. అయినా డిఫ‌రెంట్ క్యారెక్ట‌రైజేష‌న్స్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్‌తోపాటు క‌థ‌లో అంత‌ర్లీనంగా వ‌చ్చే కామెడీతో ద‌ర్శ‌కుడు మ్యాజిక్ చేశాడు.

ఇద్ద‌రు హీరోలు...

స‌రిపోదా శ‌నివారం సినిమాకు నాని, ఎస్‌జే సూర్య ఇద్ద‌రు హీరోల‌నే చెప్పొచ్చు. చివ‌రి వ‌ర‌కు నువ్వానేనా అన్న‌ట్లుగా ఇద్ద‌రి క్యారెక్ట‌ర్స్ సాగుతాయి. సూర్య పాత్ర‌లో నాని అద‌ర‌గొట్టాడు. త‌న‌దైన శైలి ఎమోష‌న్స్ పండిస్తూనే యాక్ష‌న్స్ ఎపిసోడ్స్‌తో మెరిశాడు. ద‌యానంద్ పాత్రకు ఎస్ జే సూర్య వంద‌శాతం న్యాయం చేశాడు. కొన్ని చోట్ల యాక్టింగ్ విష‌యంలో నానిని డామినేట్ చేశాడు. ఓ వైపు విలనిజాన్ని పండిస్తూనే న‌వ్వించాడు. ప్రియాంక మోహ‌న్ న‌ట‌న ఒకే అనిపిస్తుంది. ముర‌ళీశ‌ర్మ, సాయికుమార్‌, శుభ‌లేఖ సుధాక‌ర్ వంటి సీనియ‌ర్ యాక్ట‌ర్ల అనుభ‌వాన్ని డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ బాగా వాడుకున్నాడు.

యాక్టింగ్ కోసం చూడొచ్చు...

స‌రిపోదా శ‌నివారం క‌మ‌ర్షియ‌ల్ క‌థే అయినా నాని, ఎస్‌జే సూర్య యాక్టింగ్‌తో కొత్త‌ద‌నం తీసుకొచ్చారు డైరెక్టర్. వారిద్ద‌రి నటన కోస‌మైనా థియేట‌ర్ల‌లో చూసే మూవీ ఇది. ఫ్యామిలీ క‌థ‌ల్లో ఎక్కువ‌గా చూసిన నాని మాస్ రోల్‌లో చూడ‌టం బాగుంది.

రేటింగ్: 3/5