Most Expensive web series in India: ఇండియాలో టాప్ 5 భారీ బడ్జెట్ వెబ్ సిరీస్‌లు ఇవే.. ఆ రెండు ఓటీటీలే ఎక్కువ
Most Expensive web series in India: ఇండియాలో వెబ్ సిరీస్ రూపొందించడం మొదలు పెట్టి సుమారు 8 ఏళ్లు కావస్తోంది. ఇప్పటి వరకూ భారీ బడ్జెట్ సిరీస్ లు ఎన్నో రూపొందాయి. అందులో టాప్ 5 వెబ్ సిరీస్ ఏవో చూడండి.
Most Expensive web series in India: ఓటీటీల్లో సినిమాలకు పోటీగా అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ లు రూపొందడం సాధారణమైపోయింది. గత ఏడెనిమిదేళ్లుగా ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లాంటి ఓటీటీలు ఇలాంటి ఎన్నో సిరీస్ లను తెరకెక్కించాయి. మరి అందులో టాప్ 5లో ఉన్న వెబ్ సిరీస్ ఏవో ఇక్కడ చూడండి.
ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ఇవే
హీరామండి - నెట్‌ఫ్లిక్స్
ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ లలో తొలి స్థానంలో నిలిచేది హీరామండి. ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ సిరీస్ కు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించాడు. రూ.200 కోట్లకుపైగా బడ్జెట్ తో ఈ వెబ్ సిరీస్ రూపొందించినట్లు అంచనా వేస్తున్నారు.
అందులో డైరెక్టర్ భన్సాలీ రెమ్యునరేషనే రూ.65 కోట్ల వరకూ ఉండటం విశేషం. ఈ సిరీస్ కు మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ వెబ్ సిరీస్ లలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది.
రుద్ర - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నటించిన వెబ్ సిరీస్ ఇది. హీరామండి రాక ముందు వరకూ ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ఇదే. ఈ సిరీస్ ను కూడా సుమారు రూ.200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఒక్కో ఎపిసోడ్ ను సుమారు రూ.21 కోట్ల బడ్జెట్ తో రూపొందించడం విశేషం. ఇది ఏ భారీ బడ్జెట్ సినిమాకు తక్కువ కాదు.
సేక్రెడ్ గేమ్స్ - నెట్‌ఫ్లిక్స్
ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన తొలి వెబ్ సిరీస్ గా ఈ సేక్రెడ్ గేమ్స్ కు పేరుంది. ఈ సిరీస్ రెండు సీజన్లు వచ్చాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇందులో నటించారు. ఈ సిరీస్ రెండు సీజన్లు కలిపి రూ.100 కోట్ల వరకూ ఖర్చు చేశారు. ఇక సిరీస్ కు పాజిటివ్ రివ్యూలు రావడంతో ఇప్పటికీ బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లలో ఒకటిగా ఉంది.
మేడిన్ హెవెన్ - ప్రైమ్ వీడియో
అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియాలో రూపొందించిన తొలి వెబ్ సిరీస్ ఇది. ఇద్దరు వెడ్డింగ్ ప్లానర్స్, వాళ్ల వ్యక్తిగత జీవితాల చుట్టూ తిరిగే ఈ సిరీస్ రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ సిరీస్ ను కూడా రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించడం విశేషం. ఇందులో శోభితా దూళిపాళ్ల, అర్జున్ మాథుర్ నటించారు.
ది ఫ్యామిలీ మ్యాన్ - ప్రైమ్ వీడియో
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు కదా. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. మూడో సీజన్ షూటింగ్ ఈ మధ్యే ప్రారంభమైంది. అయితే ఇప్పటికే ఈ సిరీస్ ను రూపొందించడానికి మేకర్స్ రూ.60 కోట్లు ఖర్చు చేశారు. మనోజ్ బాజ్‌పాయీ, ప్రియమణిలాంటి వాళ్లు ఇందులో నటించారు.