Siddharth Heeramandi Review: కాబోయే భార్య నటించిన హీరామండిపై సిద్ధార్థ్ రివ్యూ ఇదీ
Siddharth Heeramandi Review: తన కాబోయే భార్య అదితి రావ్ హైదరీ నటించిన హీరామండి వెబ్ సిరీస్ రివ్యూ ఇచ్చాడు సిద్ధార్థ్. ఈ సిరీస్ అద్భుతమని అతడు అన్నాడు.
Siddharth Heeramandi Review: ప్రస్తుతం ఓటీటీలో సంచలనం రేపుతున్న వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. నెట్‌ఫ్లిక్స్ లో బుధవారం (మే 1) నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. తాజాగా ఈ సిరీస్ లో నటించిన అదితి రావ్ హైదరీ కాబోయే భర్త సిద్ధార్థ్ ఈ వెబ్ సిరీస్ రివ్యూ ఇచ్చాడు. అతడు దీనిపై ప్రశంసల వర్షం కురిపించాడు.
సిద్ధార్థ్ హీరామండి రివ్యూ
హీరామండి వెబ్ సిరీస్ లో బిబ్బోజాన్ అనే పాత్రలో నటించింది. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ గా తెరకెక్కిన హీరామండిని తాజాగా చూసిన సిద్ధార్థ్ సోషల్ మీడియా ద్వారా రివ్యూ ఇచ్చాడు. ఈ మధ్యే అదితి, సిద్ధార్థ్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన కాబోయే భార్య నటించిన హీరామండిపై ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సిద్ధార్థ్ రివ్యూ ఇవ్వడం విశేషం.
"యాక్టింగ్, మ్యూజిక్, సౌందర్యం, డ్రామా.. అన్నీ అద్భుతం. మనం కూడా సంజయ్ లీలా భన్సాలీ యుగంలో ఉంటున్నందుకు ఆనందపడాలి. హీరామండి హృదయ సంగీతాన్ని, మనసును కదిలించేలా మంత్రముగ్ధులను చేసే చిత్రాలతో ఆ కాలం పరిమితులకు లోబడి చెప్పిన ఓ ప్రేమ, స్వేచ్ఛకు సంబంధించిన లేఖ. కే ఆసిఫ్ సాబ్ ను గర్వపడేలా చేసే ఓ కళ ఇది. మొత్తం టీమ్ కు శుభాకాంక్షలు. నెట్‌ఫ్లిక్స్ లో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది" అని సిద్ధార్థ్ అన్నాడు.
ఆ మధ్య హీరామండి ట్రైలర్ లాంచ్ నాడే అదితి, సిద్ధార్థ్ నిశ్చితార్థం జరగడం విశేషం. నిజానికి అదే రోజు పెళ్లి చేసుకున్నారని వార్తలు వచ్చినా.. తర్వాత ఈ ఇద్దరూ తమ వేళ్లకు ఉన్న ఉంగరాలను చూపిస్తూ చేసి పోస్ట్ తో ఎంగేజ్‌మెంట్ మాత్రమే జరిగినట్లు స్పష్టమైంది.
హీరామండి వెబ్ సిరీస్
హీరామండి వెబ్ సిరీస్ ను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. దీనికి ప్రొడ్యూసర్ కూడా అతడే. ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ఇదే. ఈ సిరీస్ కు ఊహించినట్లే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సిరీస్ స్వతంత్రానికి ముందు ఇప్పటి పాకిస్థాన్ లోని లాహోర్ లో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వేశ్యల చుట్టూ తిరుగుతుంది.
ఈ సిరీస్ లో అదితితోపాటు మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, ఫర్దీన్ ఖాన్, శేఖర్ సుమన్ లాంటి వాళ్లు నటించారు. ఈ సిరీస్ కు రివ్యూలు కూడా చాలా వరక పాజిటివ్ గానే వస్తున్నాయి. భన్సాలీకి ఇదే తొలి వెబ్ సిరీస్ కావడం విశేషం. ఈ సిరీస్ కోసం అతడు ఏకంగా రూ.65 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
ఇది తన జీవితంలో ఒక మైలురాయి అని భన్సాలీ చెప్పాడు. "ఇది ప్రేమ, శక్తి, స్వేచ్ఛ, అసాధారణ మహిళలు, వాళ్ల కోరికలు, వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులకు సంబంధించిన కథ. నా ప్రయాణంలో ఇదో మైలురాయి. నెట్‌ఫ్లిక్స్ రూపంలో మంచి భాగస్వామి దొరికింది. మా స్టోరీని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైవిధ్యమైన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి తోడ్పడింది" అని భన్సాలీ అన్నాడు.