Most Expensive Web Series: ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ఇదే.. రాజమౌళి సినిమాలనూ మించిపోయింది
Most Expensive Web Series: వెబ్ సిరీస్ లు కూడా సినిమాల రేంజ్ ను మించిపోతున్న ఈ కాలంలో ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సిరీస్ ఏదో మీకు తెలుసా? ఎస్ఎస్ రాజమౌళి సినిమా బడ్జెట్ కంటే కూడా ఈ వెబ్ సిరీస్ బడ్జెట్ ఎక్కువ కావడం విశేషం.
Most Expensive Web Series: ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమాలకు వెబ్ సిరీస్ లు కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి. పెద్దపెద్ద టాలీవుడ్, బాలీవుడ్ స్టార్లు కూడా సిల్వర్ స్క్రీన్ వదిలి ఈ వెబ్ సిరీస్ లవైపు చూస్తున్నారు. దీంతో సహజంగానే వీటి బడ్జెట్ కూడా చేయి దాటిపోతోంది.
తాజాగా బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న హీరామండి వెబ్ సిరీస్.. ఇండియాలో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న సిరీస్ గా రికార్డు క్రియేట్ చేసింది.
హీరామండి బడ్జెట్ ఎంతంటే?
సంజయ్ లీలా భన్సాలీ సినిమాలన్నీ చాలా గ్రాండ్ గా ఉంటాయి. అందుకు తగినట్లే వాటి బడ్జెట్ కూడా ఉంటుంది. బాలీవుడ్ లో దేవదాస్, బాజీరావ్ మస్తానీ, పద్మావత్, రామ్ లీలాలాంటి సినిమాలను తెరకెక్కించిన భన్సాలీ.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ రూపొందిస్తున్న హీరామండి అనే వెబ్ సిరీస్ ను కూడా డైరెక్ట్ చేస్తున్న విషయం తెలుసు కదా.
ఈ మధ్యే ఈ సిరీస్ ఫస్ట్ లుక్ కూడా బయటకు వచ్చింది. ఊహించినట్లే భన్సాలీ మార్క్ ఇందులో కనిపిస్తోంది. తాజాగా వస్తున్న సమాచారం మేరకు ఈ హీరామండి వెబ్ సిరీస్ ను రూ.200 కోట్లకుపైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇది రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 1, ఈ మధ్యే వచ్చిన యానిమల్ సినిమాల బడ్జెట్ కంటే కూడా ఎక్కువ కావడం విశేషం.
రుద్ర సిరీస్‌ను వెనక్కి నెట్టి..
ఇన్నాళ్లూ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్ నటించిన రుద్ర: ఎడ్జ్ ఆప్ డార్క్‌నెస్ అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సిరీస్ ను రూ.200 కోట్లతో తెరకెక్కించారు. ఇప్పుడీ హీరామండి బడ్జెట్ మాత్రం రూ.200 కోట్లు దాటిపోయినట్లు అంచనా. ఇందులో చాలా వరకూ రెమ్యునరేషన్లకే వెళ్లాయి.
డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీయే రూ.60 కోట్లు తీసుకోవడం గమనార్హం. పైగా ఈ సిరీస్ లో మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దాలాంటి బాలీవుడ్ హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. బాహుబలి మూవీని రూ.180 కోట్లతో తెరకెక్కించగా.. యానిమల్ రూ.100 కోట్లు, డంకీ రూ.120 కోట్లతో తీశారు. ఆ లెక్కన ఈ సూపర్ హిట్ సినిమాల బడ్జెట్ కంటే ఎంతో ఎక్కువ ఖర్చుతో హీరామండి తీస్తున్నారు.
హీరామండి వెబ్ సిరీస్ ఏంటి?
హీరామండి వెబ్ సిరీస్ నుంచి ఈ మధ్యే ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ చేశారు. దేశానికి స్వతంత్రం రాక మునుపు ప్రస్తుతం పాకిస్థాన్ లోని లాహోర్ లో విలాసవంతమైన జీవితాలు గడిపిన వేశ్యల జీవితాలను ఈ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ ఫస్ట్ లుక్ వీడియో చూస్తుంటే భన్సాలీ సినిమాల్లోని రిచ్‌నెస్ ఇందులోనూ స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ హీరామండి వెబ్ సిరీస్ ఈ ఏడాదే నెట్‌ఫ్లిక్స్ లోకి రానుంది. ఈ సిరీస్ తోపాటు ఈ మధ్యే రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ లతో లవ్ అండ్ వార్ అనే మరో సినిమాను కూడా సంజయ్ లీలా భన్సాలీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.