Heeramandi: ఆ పాకిస్థాన్ నటీనటులతో హీరామండి వెబ్ సిరీస్: సంజయ్ లీలా భన్సాలీ సంచలన కామెంట్స్-sanjay leela bhansali reveals he wanted to do heeramandi web series with pakistan actor fawad khan mahira khan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Heeramandi: ఆ పాకిస్థాన్ నటీనటులతో హీరామండి వెబ్ సిరీస్: సంజయ్ లీలా భన్సాలీ సంచలన కామెంట్స్

Heeramandi: ఆ పాకిస్థాన్ నటీనటులతో హీరామండి వెబ్ సిరీస్: సంజయ్ లీలా భన్సాలీ సంచలన కామెంట్స్

Hari Prasad S HT Telugu
May 01, 2024 03:46 PM IST

Heeramandi: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ హీరామండిని గతంలో తాను పాకిస్థానీ నటీనటులతోనూ చేయాలని భావించినట్లు డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ చెప్పడం విశేషం.

ఆ పాకిస్థాన్ నటీనటులతో హీరామండి వెబ్ సిరీస్: సంజయ్ లీలా భన్సాలీ సంచలన కామెంట్స్
ఆ పాకిస్థాన్ నటీనటులతో హీరామండి వెబ్ సిరీస్: సంజయ్ లీలా భన్సాలీ సంచలన కామెంట్స్

Heeramandi: ఇప్పుడు ఓటీటీలో హాట్ టాపిక్ హీరామండి. దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ వెబ్ సిరీస్ బుధవారం (మే 1) నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే ఈ సిరీస్ లో తాను మొదట పాకిస్థాన్ నటీనటులను అనుకున్నట్లు డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ చెప్పడం గమనార్హం. హీరామండి స్ట్రీమింగ్ నాడే అతడు ఈ కామెంట్స్ చేశాడు.

హీరామండిపై భన్సాలీ

సంజయ్ లీలా భన్సాలీ అంటే సిల్వర్ స్క్రీన్ పై ఓ భారీతనాన్ని ఆవిష్కరించే దర్శకుడు. బాలీవుడ్ లో అతని ప్రతి సినిమా అలాంటి ఓ కళాఖండమే. అలాంటి డైరెక్టర్ తొలిసారి ఓ వెబ్ సిరీస్ తీశాడు. దానిపేరు హీరామండి: ది డైమండ్ బజార్. ఈ సిరీస్ బుధవారం (మే 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ బాలీవుడ్ లోని టాప్ నటీనటులెందరో నటించారు.

అయితే ఒకదశలో తాను పాకిస్థాన్ నటీనటులు ఫవద్ ఖాన్, మహీరా ఖాన్ లను కూడా అనుకున్నట్లు భన్సాలీ చెప్పాడు. "ఇందులో నటింపజేయడానికి ఎంతో మంది పేర్లను అనుకున్నాను. 18 ఏళ్లుగా ఈ హీరామండి తీయాలని చూస్తున్నాను. మొదట రేఖను అనుకున్నాను. తర్వాత కరీనా, ఆ తర్వాత రాణి ముఖర్జీని కూడా అనుకున్నాను.

అప్పట్లో ఇదొక సినిమాగా తీద్దామనుకున్నా. అంతేకాదు పాకిస్థానీ నటి మహీరా ఖాన్, నటులు ఇమ్రాన్ అబ్బాస్, ఫవద్ ఖాన్ లను కూడా నటింపజేయాలని భావించాను. కానీ చివరికి ఇప్పటి నటీనటులతో కానిచ్చేశాను" అని భన్సాలీ చెప్పాడు.

హీరామండి ఒక మైలురాయి

హీరామండి వెబ్ సిరీస్ ను ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ సిరీస్ ఇది. అందుకే ఇది తన జీవితంలో ఒక మైలురాయి అని భన్సాలీ చెప్పాడు. "ఇది ప్రేమ, శక్తి, స్వేచ్ఛ, అసాధారణ మహిళలు, వాళ్ల కోరికలు, వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులకు సంబంధించిన కథ. నా ప్రయాణంలో ఇదో మైలురాయి. నెట్‌ఫ్లిక్స్ రూపంలో మంచి భాగస్వామి దొరికింది. మా స్టోరీని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైవిధ్యమైన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి తోడ్పడింది" అని భన్సాలీ అన్నాడు.

హీరామండి వెబ్ సిరీస్ బుధవారం (మే 1) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ లో బాలీవుడ్ కు చెందిన మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, శేఖర్ సుమన్, ఫర్దీన్ ఖాన్ లాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఇది భారతదేశానికి స్వతంత్ర రాక ముందు ఇప్పటి పాకిస్థాన్ లోని లాహోర్ లో ఉన్న వేశ్యల విలాసవంతమైన జీవితం, స్వతంత్ర పోరాటంలో వాళ్ల పాత్రను కళ్లకు కట్టింది.

ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతోపాటు రివ్యూలు కూడా చాలా వరకూ పాజిటివ్ గానే ఉన్నాయి. భన్సాలీ డైరెక్షన్, అతని కథ చెప్పే విధానం ఈ హీరామండిని ఆకట్టుకునేలా చేశాయి.