Turbo Review: టర్బో రివ్యూ - మమ్ముట్టి మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Mammootty Turbo Review: మమ్ముట్టి హీరోగా వైశాఖ్ దర్శకత్వంలో రూపొందిన మలయాళం మూవీ టర్బో ఇటీవల థియేటర్లలో రిలీజైంది. మాస్ యాక్షన్ కథాంశంతో రూపొందిన ఈ మూవీతో మమ్ముట్టి హిట్టు కొట్టాడా? లేదా? అంటే?
Mammootty Turbo Review: మమ్ముట్టి హీరోగా నటించిన మలయాళ చిత్రం టర్బో ఇటీవల థియేటర్లలో విడుదలైంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కన్నడ నటుడు రాజ్ బీ శెట్టి విలన్‌గా నటించాడు. తెలుగు కమెడియన్ సునీల్ టర్బో మూవీతోనే మలయాళంలోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. వైశాఖ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎలా ఉందంటే...
టర్బో జోస్ యాక్షన్...
టర్బో జోస్ (మమ్ముట్టి) ఓ జీప్ డ్రైవర్. క్రిస్మస్ వేడుకల కోసం సొంత ఊరు ఇడుక్కివస్తాడు. ఆ వేడుకల్లో జోస్ స్నేహితుడు జెర్రీ (శబరీష్ వర్మ)పై కొందరు రౌడీలు ఎటాక్ చేస్తారు. ఆ రౌడీల బారి నుంచి జెర్రీని జోస్ కాపాడుతాడు. ఇందులేఖ (అంజనా జయప్రకాష్) అనే అమ్మాయిని జెర్రీ ప్రేమిస్తాడు. కూతురు ప్రేమవ్యవహారం నచ్చక ఇందులేఖ తల్లిదండ్రులు జెర్రీపై రౌడీలతో ఎటాక్ చేయించారనే నిజం జోస్‌కు తెలుస్తుంది.
జెర్రీ, ఇందులేఖలను కలపాలని ఫిక్సవుతాడు. ఇందులేఖ కుటుంబాన్ని ఎదురించి ఆమెను జెర్రీ దగ్గరకు తీసుకొస్తాడు. కానీ ఇందులేఖ ఎవరో తనకు తెలియదని జెర్రీ అబద్దం చెబుతాడు. ఇందులేఖను కిడ్నాప్ చేసినందుకు జోస్‌పై పోలీస్ కేసు అవుతుంది. పోలీసులకు దొరక్కుండా ఉండటానికి చెన్నై పారిపోతాడు. వెట్రివేల్ షణ్ముగ సుందరం (రాజ్ బీ శెట్టి) ఓ గ్యాంగ్‌స్టర్. తన మనుషులతో చెన్నైని ఏలుతుంటాడు. షణ్ముగ సుందరం ఓ బ్యాక్ స్కామ్ చేస్తాడు.
అందులో తనకు తెలియకుండానే జెర్రీ కూడా భాగమవుతాడు. ఆ స్కామ్‌కు సంబంధించిన అన్ని రహస్యాలను జెర్రీ సేకరిస్తాడు. ఈ విషయం ఇందులేఖకుకు చెప్పేలోపు అతడిని జోస్ అపార్ట్‌మెంట్‌లోనే షణ్ముగ సుందరం మనుషులు చంపేస్తారు. ఆ తర్వాత ఇందులేఖను కూడా చంపాలని ప్రయత్నిస్తాడు.
షణ్ముగ సుందరం బారి నుంచి ఇందులేఖను జోస్ ఎలా కాపాడాడు? ఇందులేఖ తనకు తెలియదని జెర్రీ ఎందుకు అబద్ధం ఆడాడు? షణ్ముగ సుందరం చేసిన బ్యాంకు స్కామ్ ఏమిటి? ఎమ్మెల్యేలను కొనడానికి వందల కోట్ల డబ్బు ను షణ్ముగ సుందరం ఎందుకు కూడబెట్టాడు? అతడి ప్లాన్‌ను జోస్ ఎలా తిప్పికొట్టాడు? అన్నదే టర్బో మూవీ కథ.
మమ్ముట్టి మాస్ క్యారెక్టర్...
మమ్ముట్టి సినిమా అంటే కథ, క్యారెక్టర్స్ పరంగా కొత్తదనాన్ని ప్రేక్షకులు ఆశిస్తుంటారు. కానీ టర్బో మూవీలో ఆ కొత్తదనం ఛాయలు మచ్చుకు కూడా కనిపించవు. మమ్ముట్టి మాస్ సినిమా చేసి చాలా కాలమైంది. ఫక్తు కమర్షియల్ మాస్ క్యారెక్టర్‌లో తనను తాను చూడాలనే కోరికతో కథ గురించి ఏ మాత్రం ఆలోచించకుండా మమ్ముట్టి టర్బో మూవీని చేసిన ఫీలింగ్ కలుగుతుంది.
లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్ కథల కంటే హీరోయిజం, ఎలివేషన్స్‌తో పాటు స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌లతో బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేశారు. ఈ దర్శకుల స్ఫూర్తితో దక్షిణాదిలో చాలా సినిమాలొచ్చాయి.
లోకేష్ కనగరాజ్ ఫార్ములా...
టర్బో మూవీతో దర్శకుడు వైశాఖ్ కూడా లోకేష్ కనకరాజ్, ప్రశాంత్ నీల్ ఫార్ములాను ఫాలో అయ్యాడు. సిల్వర్ స్క్రీన్‌పై అనేక సార్లు తీసి తీసి అరిగిపోయిన ఓ పాత కథకు మమ్ముట్టికి ఉన్న ఇమేజ్, యాక్షన్ అంశాలను జోడించి ఈ సినిమాను తెరకెక్కించాడు. కథ విషయంలో పెద్దగా ఆలోచించని దర్శకుడు విలన్‌తో పాటు ప్రధాన పాత్రధారుల ఎంపికలో మాత్రం డిఫరెంట్ ఆలోచించాడు.
రాజ్ బీ శెట్టి విలనిజం...
కన్నడ నటుడు రాజ్ బీ శెట్టి విలన్ పాత్రలో అదరగొట్టాడు. మమ్ముట్టికి ధీటుగా విలనిజాన్ని పండించాడు. కన్నడంలో ఎక్కువగా సాఫ్ట్ రోల్స్ చేసిన నెగెటివ్ షేడ్ రోల్‌లో చూడటం కొత్తగా అనిపించింది.
రేసీ స్క్రీన్‌ప్లే ఉండాల్సింది కానీ...
ఓ ప్రేమ జంటకు సహాయం చేసే ఓ సాధారణ జీప్ డ్రైవర్ కథ ఇది. అనుకోకుండా పెద్ద బ్యాంక్ స్కామ్‌ను బయటపెట్టి చిక్కుల్లో పడ్డ ప్రేమ జంటను హీరో ఎలా కాపాడాడు? అన్నదే ఈ సినిమా కథ. ఈ సింపుల్ స్టోరీని రేసీ స్క్రీన్‌ప్లేతో నడిపించేలా సీన్స్ రాసుకుంటే బాగుండేది.
కానీ ఆ విషయంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. అసలు కథలోకి వెళ్లడానికే దర్శకుడు చాలా టైమ్ తీసుకున్నాడు. ప్రేమ జంట లవ్ స్టోరీ టీవీ సీరియల్ ఎపిసోడ్‌ను తలపిస్తుంది. హీరో...విలన్ ఒకరిపై మరొకరు వేసే ఎత్తులు, పై ఎత్తులలో క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రమే వర్కవుట్ అయ్యింది. . బలమైన కథ లేకపోవడం, కథనం కూడా ల్యాగ్ కావడంతో సినిమా నీరసంగా సాగుతుంది.ఔ
సీక్వెల్‌పై హింట్…
మమ్ముట్టి చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు బాగున్నా...వాటి కోసం ఎదురుచూపులే ఎక్కువగా ఉన్నాయి. ఓపెన్ ఎండెడ్ క్లైమాక్స్‌తో సీక్వెల్ ఉంటుందని ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చాడు.
72 ఏళ్ల వయసులో…
టర్బో జోస్ పాత్రలో మమ్ముట్టి ఇరగదీశాడు. వయసు 72 ఏళ్లు అంటే నమ్మశక్యంగా లేనట్లుగా యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్మురేపాడు. మమ్ముట్టి కామెడీ టైమింగ్ బాగుంది. రాజ్ బీ శెట్టి విలనిజం, అతడి ఎలివేషన్ సీన్స్‌ను దర్శకుడు రాసుకున్న తీరు ఆకట్టుకుంటుంది. కామెడీ విలన్‌గా సునీల్ నవ్వించాడు. అతడు కనిపించిన సీన్స్ మెప్పిస్తాయి. ఇందులేఖగా అంజనా జయప్రకాష్, జెర్రీగా శబరీష్ వర్మ యాక్టింగ్ పర్వాలేదనిపిస్తుంది.
మమ్ముట్టి ఫ్యాన్స్‌కు మాత్రమే...
టర్బో రొటీన్ యాక్షన్ మూవీ. మమ్ముట్టి ఫ్యాన్స్‌ను మాత్రామే ఈ మూవీ మెప్పిస్తుంది. మమ్ముట్టిపై నమ్మకంతో కొత్త తరహా కథ, కథనాల్ని చూడాలని థియేటర్‌లో అడుగుపెడితే మాత్రం డిసపాయింట్ అవుతారు.