Mahesh Babu, Rajamouli: సిరాజ్ మియా, టీమిండియాపై మహేష్, రాజమౌళి ప్రశంసల వర్షం-mahesh babu and rajamouli full of praise on siraj and team india ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu, Rajamouli: సిరాజ్ మియా, టీమిండియాపై మహేష్, రాజమౌళి ప్రశంసల వర్షం

Mahesh Babu, Rajamouli: సిరాజ్ మియా, టీమిండియాపై మహేష్, రాజమౌళి ప్రశంసల వర్షం

Hari Prasad S HT Telugu
Sep 18, 2023 10:44 AM IST

Mahesh Babu, Rajamouli: సిరాజ్ మియా, టీమిండియాపై మహేష్, రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. ఆదివారం (సెప్టెంబర్ 17) జరిగిన ఆసియా కప్ ఫైనల్లో గెలిచిన తర్వాత వీళ్లు చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.

టీమిండియాపై మహేష్ బాబు ప్రశంసలు
టీమిండియాపై మహేష్ బాబు ప్రశంసలు

Mahesh Babu, Rajamouli: ఆసియా కప్ 2023ను ఇండియా చాలా ఘనంగా గెలిచింది. ఎంత ఘనంగా అంటే.. ఇంతకంటే గొప్పగా గెలవడం ఉంటుందా అన్న రీతిలో. ఫైనల్లో లంకను కేవలం 50 అంటే 50 పరుగులకే కట్టడి చేసి.. తర్వాత టార్గెట్ ను 6.1 ఓవర్లలోనే చేజ్ చేసి 8వ ఆసియా కప్ టైటిల్ గెలిచింది. ఇంతటి ఘన విజయానికి కారణమైన సిరాజ్ ను, టీమిండియాను ఆకాశానికెత్తారు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి.

ఫైనల్ ముగిసిన తర్వాత ఈ ఇద్దరూ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ఇండియన్ టీమ్ పై ప్రశంసలు కురిపించారు. రాజమౌళి స్పందిస్తూ.. సిరాజ్ బౌలింగ్ చేసిన తీరును ప్రశంసించాడు. "సిరాజ్ మియా (సర్), మన టోలీచౌకీ కుర్రాడు ఆరు వికెట్లతో ఆసియా కప్ ఫైనల్లో మెరిశాడు. అతనిది గొప్ప మనసు కూడా. తన బౌలింగ్ లో బౌండరీ ఆపడానికి బౌండరీ వరకూ పరుగెత్తాడు" అని రాజమౌళి ట్వీట్ చేశాడు.

ఇక మహేష్ బాబు కూడా ఎక్స్ ద్వారా స్పందించాడు. "అద్భుతం.. ఆసియా కప్ 2023లో మీరు సాధించిన సంచలన విజయానికి శుభాకాంక్షలు. ఛాంపియన్స్ తమ అత్యుత్తమ ఆట ఆడారు" అని మహేష్ ట్వీట్ చేయడం విశేషం. ఇక పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా టీమిండియా విజయంపై స్పందించారు.

విరాట్ కోహ్లి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందిస్తూ.. "క్యా బాత్ హై మియా.. మ్యాజిక్" అంటూ ఆమె రాయడం విశేషం. అద్భుతమైన స్పెల్ అంటూ నటుడు విక్కీ కౌశల్ కూడా ఇన్‌స్టా స్టోరీలో రాసుకున్నాడు. టీమిండియా తన బౌలింగ్ పవరేంటో ఇవాళ చూపించింది అని మరో నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా అన్నాడు.

పూర్తి ఏకపక్షంగా జరిగిన ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను 10 వికెట్లతో టీమిండియా చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలోనే 50 పరుగులకు చాప చుట్టేసింది. సిరాజ్ 7 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ఒకే ఓవర్లో 4 వికెట్లు తీయడంతో శ్రీలంక కోలుకోలేకపోయింది.