Mohammed Siraj: క్యాష్ ప్రైజ్‍ను గ్రౌండ్ సిబ్బందికి ఇచ్చిన మహమ్మద్ సిరాజ్.. మనసులను కూడా గెలిచిన హైదరాబాదీ
Mohammed Siraj: ఆసియాకప్ 2023 ఫైనల్‍లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‍ను గెలిచాడు భారత పేసర్ మహమ్మద్ సిరాజ్. అయితే, క్యాష్ ప్రైజ్‍ను గ్రౌండ్ సిబ్బందికి అందించాడు.
Mohammed Siraj: ఆసియాకప్ 2023 ఫైనల్‍లో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ (6/21) అదరగొట్టాడు. ఆరు వికెట్లతో సత్తాచాటి శ్రీలంక బ్యాటింగ్ లైనప్‍ను కుప్పకూల్చాడు. హైదరాబాదీ స్టార్ సిరాజ్ విజృంభణతో లంకలోని కొలంబో వేదికగా జరిగిన నేడు (సెప్టెంబర్ 17) ఆసియాకప్ ఫైనల్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక కేవలం 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌటైంది. భారత్ 6.1 ఓవర్లలోనే టార్గెట్‍ను ఛేదించి 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 8వసారి భారత్ ఆసియాకప్ టైటిల్‍ను దక్కించుకుంది. అత్యధికసార్లు ఆసియా ట్రోఫీ కైవసం చేసుకున్న టీమ్‍గా రికార్డును కొనసాగించింది భారత్. కాగా, అద్భుత బౌలింగ్‍తో టీమిండియా విజయంలో ప్రధాన పాత్ర పోషించిన సిరాజ్‍కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. బౌలింగ్‍తో జట్టును గెలిపించిన సిరాజ్.. తన క్యాష్ ప్రైజ్‍ను కొలంబో ఆర్.ప్రేమదాస గ్రౌండ్ సిబ్బంది కోసం ఇచ్చి మనసులు కూడా గెలిచాడు. వివరాలివే..
ఆసియాకప్ 2023 టోర్నీలో చాలా మ్యాచ్‍లకు అనేక సార్లు వర్షం ఆటంకాలు కలిగించింది. ప్రతీసారి గ్రౌండ్ సిబ్బంది ఎంతో కష్టపడి మైదానాన్ని సిద్ధం చేశారు. అన్ని మ్యాచ్‍ల్లోనూ చాలా కష్టపడ్డారు. కొలంబోలోని ఆర్.ప్రేమదాస మైదానంలో ఈ ఫైనల్‍తో పాటు సూపర్-4 మ్యాచ్‍లు జరిగాయి. వర్షం పడిన ప్రతీసారి గ్రౌండ్ సిబ్బంది కవర్లను తీసుకొచ్చి మైదానాన్ని కాపాడారు. ఎక్కువగా మిషన్లు లేకపోవటంతో గ్రౌండ్ స్టాఫ్ మాన్యువల్‍గా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చాలాసార్లు మైదానం మొత్తం కవర్లను కప్పి.. మళ్లీ తీశారు. మ్యాచ్‍లు జరిగేందుకు శాయశక్తులా కృషి చేశారు. వాన వల్ల ఫైనల్ కూడా ఆలస్యంగా మొదలైంది. దీంతో, ఇంత కష్టపడిన గ్రౌండ్ సిబ్బందికి తన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు క్యాష్ ప్రైజ్‍ను సిరాజ్ అంకితం ఇచ్చాడు. సుమారు రూ.4లక్షలను మైదానం సిబ్బందికి ఇచ్చాడు.
గ్రౌండ్స్ మెన్ లేకపోతే ఈ టోర్నీ జరిగేదే కాదని సిరాజ్ అన్నాడు. అందుకే వారికి ఈ క్యాష్ ప్రైజ్ ఇస్తున్నానని చెప్పాడు.
కాగా, వన్డే క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్‍లో అత్యంత వేగంగా (16 బంతుల్లో) 5 వికెట్లు పడగొట్టిన చమింద వాస్ రికార్డును సిరాజ్ నేడు సమం చేశాడు.
ఏసీసీ కూడా..
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ).. శ్రీలంక స్టేడియం సిబ్బందికి సుమారు రూ.42లక్షలను అందించింది. స్టేడియం స్టాఫ్ కష్టాన్ని గుర్తించిన ఏసీసీ నగదును ప్రోత్సాహకంగా అందజేసింది. ఈ చెక్కును ఏసీసీ ప్రెసిడెంట్, బీసీసీఐ కార్యదర్శి జైషా అందించారు.