Lucky Baskhar Day 1 Box office Collection: లక్కీ భాస్కర్‌కు తొలి రోజే భారీ వసూళ్లు.. తెలుగు, మలయాళంలో మంచి కలెక్షన్స్
Lucky Baskhar Day 1 Box office Collection: దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ మూవీకి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లు వచ్చాయి. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా సుమారు రూ.13 కోట్ల వరకూ వసూలు చేసింది.
Lucky Baskhar Day 1 Box office Collection: లక్కీ భాస్కర్ తెలుగులో దుల్కర్ సల్మాన్ కు మరో బ్లాక్ బస్టర్ కాబోతోంది. దీనికి తొలి రోజే వచ్చిన భారీ వసూళ్లే నిదర్శనం. గతంలో మహానటి, సీతారామం సినిమాలతో సక్సెస్ అందుకున్న అతడు.. ఈ లక్కీ భాస్కర్ తో తెలుగులో హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు. తొలిరోజు లక్కీ భాస్కర్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా రూ.12.7 కోట్లు రావడం విశేషం.
లక్కీ భాస్కర్ తొలి రోజు వసూళ్లు
వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన మూవీ లక్కీ భాస్కర్. గురువారం (అక్టోబర్ 31) దీపావళి సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీల్లోనూ పాన్ ఇండియా మూవీగా రిలీజైంది. అయితే తొలి రోజు తెలుగుతోపాటు మలయాళం, తమిళ మార్కెట్లలో ఈ సినిమాకు ఊహించిన దాని కంటే ఎక్కువ వసూళ్లే వచ్చాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.12.7 కోట్లు వసూలు చేసింది.
అందులో కేవలం తెలుగు మార్కెట్ నుంచే రూ.4.4 కోట్లు వచ్చాయి. ఓ మలయాళ హీరో నటించిన తెలుగు సినిమాకు ఈ స్థాయి ఓపెనింగ్ అంటే మామూలు విషయం కాదు. ఇక తొలి షో నుంచే వచ్చిన పాజిటివ్ రివ్యూలు ఫస్ట్ వీకెండ్ లక్కీ భాస్కర్ వసూళ్లను మరింత భారీగా పెంచనున్నాయి. దీంతో త్వరలోనే తెలుగులో రూ.10 కోట్ల మార్క్ అందుకోనుంది. ఈ సినిమాలో దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి ఫిమేల్ లీడ్ గా నటించింది.
మలయాళం, తమిళంలలోనూ..
లక్కీ భాస్కర్ మూవీకి మలయాళం, తమిళంలలోనూ మంచి ఓపెనింగ్సే వచ్చాయి. కేరళలో స్టార్ స్టేటస్ ఉన్న నటుడు కావడంతో సహజంగానే దుల్కర్ మూవీని అక్కడి ప్రేక్షకులు ఆదరించారు. తెలుగు డబ్బింగ్ అయినా కూడా మలయాళం మార్కెట్ లో తొలి రోజే లక్కీ భాస్కర్ కు రూ.2.05 కోట్లు వచ్చాయి. కేరళలో కేవలం 175 స్క్రీన్లలోనే రిలీజైనా.. ఈ స్థాయి వసూళ్లు రావడం విశేషమే.
తమిళ వెర్షన్ కూడా ఫర్వాలేదనిపించింది. ఈ సినిమా తమిళనాడులో రూ.కోటితో మొదలైంది. నిజానికి ఆ రాష్ట్రంలో పెద్దగా ప్రమోషన్లు కూడా నిర్వహించలేదు. అయినా తొలి రోజు వసూళ్లు ఆశాజనకంగా ఉన్నాయి. ఇవి వీకెండ్ లో మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
లక్కీ భాస్కర్ మూవీ గురించి..
వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన లక్కీ భాస్కర్ మూవీ ఓ పీరియడ్ క్రైమ్ థ్రిల్లర్. ఇందులో ఓ సాధారణ బ్యాంకు ఉద్యోగి పాత్రలో దుల్కర్ నటించాడు. అతనితోపాటు మీనాక్షి చౌదరి, సాయి కుమార్, మానస చౌదరి, హైపర్ ఆది, టిన్నూ ఆనంద్ లాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు.
నాగ వంశీ ప్రొడ్యూస్ చేయగా.. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించాడు. తనకు ప్రమోషన్ రాలేదన్న కారణంగా తాను పని చేస్తున్న బ్యాంకునే దోచుకొని తర్వాత ఆ డబ్బును నేరపూరిత పనుల కోసం, స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసి కోట్లు గడించే ఓ ఉద్యోగి చుట్టూ తిరిగే కథే ఈ లక్కీ భాస్కర్.
టాపిక్