Kannappa Movie: ఒక క్యారెక్టర్ చెబితే ప్రభాస్ మరొకటి చేస్తానన్నారు.. ఆ విషయంలో పుకార్లు వద్దు: మంచు విష్ణు-kannappa movie do not spread rumours about prabhas character says manchu vishnu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kannappa Movie: ఒక క్యారెక్టర్ చెబితే ప్రభాస్ మరొకటి చేస్తానన్నారు.. ఆ విషయంలో పుకార్లు వద్దు: మంచు విష్ణు

Kannappa Movie: ఒక క్యారెక్టర్ చెబితే ప్రభాస్ మరొకటి చేస్తానన్నారు.. ఆ విషయంలో పుకార్లు వద్దు: మంచు విష్ణు

Chatakonda Krishna Prakash HT Telugu
May 11, 2024 07:35 PM IST

Kannappa Movie - Manchu Vishnu: కన్నప్ప సినిమా స్టార్ నటులతో భారీ బడ్జెట్‍తో రూపొందుతోంది. ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఓ కీలకపాత్ర చేస్తున్నారు. అయితే, ఈ మూవీ గురించి హీరో మంచు విష్ణు తాజాగా కొన్ని విషయాలు వెల్లడించారు.

Kannappa Movie: ఒక క్యారెక్టర్ చెబితే ప్రభాస్ మరొకటి చేస్తానన్నారు.. ఆ విషయంలో పుకార్లు వద్దు: మంచు విష్ణు
Kannappa Movie: ఒక క్యారెక్టర్ చెబితే ప్రభాస్ మరొకటి చేస్తానన్నారు.. ఆ విషయంలో పుకార్లు వద్దు: మంచు విష్ణు

Kannappa Movie: మంచు విష్ణు ప్రధాన పాత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘కన్నప్ప’ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీలో వివిధ సినీ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ నటులు కీలకపాత్రలు చేస్తున్నారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, మలయాళ సీనియర్ స్టార్ మోహన్‍లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఈ మూవీలో నటిస్తున్నారు. శివుడి పరమ భక్తుడు కన్నప్ప జీవితంగా ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కన్నప్పగా మంచు విష్ణు నటిస్తున్నారు. అయితే, ఈ మూవీపై తాజాగా కొన్ని విషయాలను విష్ణు వెల్లడించారు.

ప్రభాస్‍కు ఒక క్యారెక్టర్ చెబితే మరొకటి..

కన్నప్ప గురించి వెల్లడిస్తున్న అప్‍డేట్లకు భారీ స్పందన వస్తోందని మంచు విష్ణు నేడు (మే 11) అన్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయని రిలీజ్ చేసిన ఓ వీడియోలో వెల్లడించారు. ప్రభాస్ షూటింగ్‍లో జాయిన్ అయ్యారని ఇటీవల ఇచ్చిన అప్‍డేట్ ఏకంగా 18 గంటలు టాప్‍లో ట్రెండ్ అయిందని, రెస్పాన్స్ పట్ల చాలా సంతోషంగా ఉన్నామని విష్ణు అన్నారు.

కన్నప్ప మూవీ కోసం ప్రభాస్‍కు ముందు ఓ క్యారెక్టర్ చెప్పామని, అయితే ఆయన వేరే పాత్ర ఎంపిక చేసుకున్నారని విష్ణు వెల్లడించారు. “ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్‌కు ఓ విషయం చెప్పాలనుకున్నా. ఈ మూవీలో ఓ క్యారెక్టర్ చేయాలని నేను ప్రభాస్ దగ్గరికి వెళ్లా. అయితే కథంతా చెప్పిన తర్వాత మీరు చెప్పిన క్యారెక్టర్ కంటే వేరే క్యారెక్టర్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉందని, చేయవచ్చా అని ప్రభాస్ అడిగారు. నచ్చిన క్యారెక్టర్ చేస్తే ఇంకా హ్యాపీ కదా.. ఈ క్యారెక్టర్ ఇంకా బాగా డెవలప్ చేస్తానని చెప్పాను. ఆయనకు ఏది నచ్చిందో ప్రభాస్ అదే క్యారెక్టర్ చేస్తున్నారు” అని విష్ణు వెల్లడించారు.

మేం చెప్తాం.. ఊహలు వద్దు

కన్నప్ప సినిమాలో ఎవరు ఏ క్యారెక్టర్లు చేస్తున్నారన్న విషయాలపై వస్తున్న రూమర్లను నమ్మవద్దని మంచు విష్ణు చెప్పారు. త్వరలో తామే ఆ విషయాలను వెల్లడిస్తామని అన్నారు. ఈ విషయంలో ఊహలు వద్దని విష్ణు చెప్పారు.

“కన్నప్ప కథలో చాలా మంది స్టార్ నటులు ఉన్నారు. రెబల్ స్టార్ ఉన్నారు. ఈ కథలో చాలా గొప్ప క్యారెక్టర్లు ఉన్నాయి. ఈ పాత్రలను అద్భుతమైన నటీనటులతో చేస్తే బ్రహ్మాండంగా ఉందని అనుకున్నా. నేను ఒక్కొక్క క్యారెక్టర్‌ను మీ ముందుకు తీసుకొస్తా. అది వచ్చేలోపల ఈ యాక్టర్.. ఈ క్యారెక్టర్ చేస్తున్నారనేది ఊహించొద్దు. ఎవరినీ నమ్మొద్దు. త్వరలోనే అన్ని క్యారెక్టర్లు ఒకదాని తర్వాత ఒకటి రివీల్ చేస్తాం. సోమవారం ఉదయం అందరి కోసం ఓ అద్భుతమైన వార్త ఉంది” అని విష్ణు చెప్పారు.

కన్నప్ప సినిమా షూటింగ్‍లో ప్రభాస్ ఇటీవలే పాల్గొన్నారు. ఈ చిత్రంలో శివుడి పాత్రను ప్రభాస్ చేస్తున్నారని ముందుగా రూమర్లు వచ్చాయి. అయితే, నందీశ్వరుడి క్యారెక్టర్ చేస్తున్నారని తాజాగా ఊహాగానాలు వెల్లడయ్యాయి. అయితే, ఈ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో రూమర్లను నమ్మొద్దని విష్ణు చెప్పారు.

కన్నప్ప చిత్రానికి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని భారీ బడ్జెట్‍తో నిర్మిస్తున్నారు మంచు మోహన్ బాబు. మణిశర్మ, స్టీఫెన్ దేవసీ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగవంతంగా సాగుతోంది.