The Kerala Story and Kashmir Files : ది కేరళ స్టోరీ.. మరో కశ్మీర్ ఫైల్స్ అవుతుందా?
The Kerala Story and Kashmir Files : కొన్ని రోజులుగా ది కేరళ స్టోరీ సినిమా చుట్టూ వివాదం నడుస్తోంది. ఈ సినిమా రాజకీయంగానూ దుమారం రేపింది. సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని సుప్రీం కోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. మరో కశ్మీర్ ఫైల్స్ చిత్రం అవుతుందని విమర్శలు వస్తున్నాయి.
సుదీప్తో సేన్ రాబోయే చిత్రం ది కేరళ స్టోరీ(The Kerala Story). టీజర్ విడుదలైనప్పటి నుండి వివాదాలను రేకెత్తిస్తోంది. అయితే ఈ సినిమా మే 5న విడుదల కానున్న తరుణంలో రాజకీయ దుమారం మరింత పెరుగుతోంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దీనిని ‘సంఘీ ప్రచారం’గా అభివర్ణించారు. ది కేరళ స్టోరీ సినిమా కథ.. టీజర్, ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. కేరళకు చెందిన మహిళలు.. ఇస్లాం మతంలోకి మారడానికి బ్రెయిన్ వాష్ చేయబడి, తర్వాత ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS) లో ఎలా చేరిందని సినిమా కథగా తెలుస్తోంది.
ఈ చిత్రం నిజమైన కథ ఆధారంగా రూపొందించబడింది అని మేకర్స్ గతంలో చెప్పారు. అయితే ఇవన్నీ తప్పుడు వాదనలు అని మరికొందరూ చెబుతున్నారు. ట్రైలర్‌లో తనలాంటి దాదాపు 32,000 మంది మహిళలను ఇస్లాం మతంలోకి మార్చడానికి బ్రెయిన్ వాష్ చేశారని, ఆఫ్ఘనిస్తాన్, యెమెన్, సిరియాలోని ఉగ్రవాద సంస్థలో చేరారని ఫాతిమా బి (అదా శర్మ పోషించిన పాత్ర) చెప్పుకొచ్చింది. కేరళ(Kerala) నుంచి వెళ్లిన మహిళలు.. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో ఈ చిత్రం చెప్పనుంది.
కేరళ సీఎం పినరయి విజయన్(kerala cm pinarayi vijayan) ఇది మత చిచ్చులు పెట్టే ప్రచార చిత్రం అని అన్నారు. కేరళ ఎన్నికల రాజకీయాల్లో సంఘ్‌పరివార్‌కు లాభం చేకూర్చేందుకు ఈ సినిమా తీశారని విమర్శించారు. చెన్నైకి చెందిన అరవిందాక్షన్ బీఆర్ అనే జర్నలిస్ట్ ఈ సినిమాపై నిషేధం విధించాలంటూ దర్శకుడిపై ఫిర్యాదు చేశారు.
సినిమాలో చూపించినది నిజమని రుజువు చేసిన వారికి కోటి రూపాయల బహుమతిని ముస్లిం సంఘం ప్రకటించింది. '32,000 మంది కేరళీయులు మతం మారి సిరియాకు పారిపోయారన్న ఆరోపణలను రుజువు చేయండి.. ఛాలెంజ్‌ని స్వీకరించి సాక్ష్యాలను సమర్పించండి.' అని కమిటీ పేర్కొంది. 32 వేల మంది మహిళలకు ఇలా జరిగిందని నిరూపిస్తే 11 లక్షల రూపాయల బహుమతి ఇస్తామని ముస్లిం న్యాయవాది, నటుడు సి షుకూర్ ప్రకటించారు.
చిత్ర నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా.. వాస్తవాలను చెబుతున్నానని చెప్పారు. 'ఏదైనా నిజం ఎదుర్కోవడం కష్టంగా ఉన్నప్పుడు మాత్రమే విషయాలు రాజకీయంగా మారుతాయని అనుకుంటున్నాను. దీనితో ప్రతిఘటన తప్పదు. ప్రజలు దీనిని చెడ్డ విషయంగా భావించనవసరం లేదు. ప్రజాస్వామ్యానికి మాతో విభేదించే హక్కు ఉంది. సినిమా తీయడానికి మాకు అన్ని హక్కులు ఉన్నాయి.' అని ఆయన అన్నారు.
మరోవైపు సుప్రీం కోర్టు(Supreme Court)లో ఈ సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని పిటిషన్లు వేశారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం అలాంటి పని చేయలేమని స్పష్టం చేసింది. తగిన వేదికను సంప్రదించాలని తెలిపింది.
అయితే ఇప్పుడు ఈ సినిమాను కశ్మీర్ ఫైల్స్(Kashmir Files) సినిమాతో పోలుస్తున్నారు. ఓ పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకే సినిమా తీశారని ఆరోపిస్తున్నారు. 1990 నాటి కాశ్మీరీ పండిట్ల వలస ఆధారంగా తీసిన కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని గుర్తు చేస్తున్నారు. వివేక్ అగ్నిహోత్రి తరహా విమర్శలను ఈ చిత్రం కూడా ఎదుర్కొంటోంది. కశ్మీర్ ఫైల్స్‌ను ప్రచార చిత్రం అని కూడా పిలుస్తారు, అయితే ఇది వాస్తవాల ఆధారంగా మాత్రమే అని నిర్మాతలు చెప్పారు. అనుపమ్ ఖేర్ నటించిన ఈ చిత్రం కూడా రాజకీయ తుపానుకు దారితీసింది. ముస్లిం సంఘాల నుండి విమర్శలు వచ్చాయి. రాజకీయ లబ్ధి కోసమే సినిమాను తీయించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ది కేరళ స్టోరీ(The Kerala Story) సినిమా సైతం.. అదే బాటలో వెళ్తుందని రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఈ చిత్రం మే 5, 2023న విడుదలకు సిద్ధంగా ఉంది.
సంబంధిత కథనం