Supreme Court Stay: సిట్ ఏర్పాటుపై ఏపీ హైకోర్టు ఉత్తర్వుల్ని కొట్టేసిన సుప్రీం కోర్టు
Supreme Court Stay: రాజధాని భూముల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. రాజధాని భూసేకరణ వ్యవహారంలో విచారణ జరిపాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టేసింది.
Supreme Court Stay: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. రాజధాని భూముల వ్యవహారంపై 2020 ఫిబ్రవరిలో సిట్‌నున ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సిట్ నియామకంపై హైకోర్టు విధించిన స్టేను సుప్రీం కోర్టు కొట్టేసింది. జస్టిస్ ఎమ్మార్ షా నేతృత్వంలోని ధర్మాసనం ఏపీ హైకోర్టు తీర్పును కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.
ఆ తర్వాత వర్ల రామయ్య హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు స్టే విధించింది. దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎలాంటి విచారణ జరగకుండా స్టే విధించడాన్ని తప్పు పట్టింది. విచారణ చేయకుండానే స్టే విధించడాన్ని తప్పు పడుతూ హైకోర్టు ఉత్తర్వులను కొట్టేసింది. దీంతో రాజధాని భూముల సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణపై ఆటంకాలు తొలగిపోయాయి.
2014 డిసెంబర్ నుంచి రాజధాని నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం 29 గ్రామాల్లో భూముల్ని సేకరించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. రాజధాని ప్రకటనకు ముందే టీడీపీ నాయకులతో పాటు పలువురు భూములు కొనుగోలు చేశారనే అభియోగాలపై విచారణ జరపాలి ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాలపై దర్యాప్తు చేయడానికి సిట్‌ను ఏర్పాటు చేసింది. హైకోర్టు ఉత్తర్వులతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. తాజాగా సుప్రీంకోర్టు స్టే రద్దు చేయడంతో విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లైంది.
అమరావతి భూ కుంభకోణం సహా కీలక ప్రాజెక్టులకు విధి విధానాలను రూపొందించడంలో జరిగిన అవినీతిపై దర్యాప్తుకు ఆటంకాలు తొలగిపోయినట్లైంది. గత ప్రభుత్వ విధాన నిర్ణయాలలో ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని, కుట్ర పూరితంగా పేదల నుంచి భూములు లాక్కున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వ దురుద్దేశాలపై దర్యాప్తు చేస్తే తప్పేంటని సుప్రీం కోర్టు దర్మాసనం ప్రశ్నించింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరపొద్దు అంటే వంద శాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్టు కాదా అని సుప్రీం వ్యాఖ్యానించింది. ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సమంజసం కాదన్న ఏపీ ప్రభుత్వ వాదనలతో అమోదం తెలిపిన సుప్రీం కోర్టు హైకోర్టు గతంలో ఇచ్చిన స్టేను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.