Kerala CM Vijayan : కేసీఆర్‌కు అండగా ఉంటామన్న పినరయి విజయన్….
Kerala CM Vijayan కేరళా ప్రభుత్వం, ప్రజానీకం తెలంగాణకు అన్ని వేళల్లో అండగా ఉంటుందని ముఖ్యమంత్రి విజయన్ చెప్పారు. తెలంగాణ అంతటా అన్ని హంగులతో జిల్లా కలెక్టరేట్లను ఏర్పాటు చేయడం, ప్రజలకు పాలనా సదుపాయాలను చేరువ చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఖమ్మంలో జరుగుతున్న బహిరంగ సభతో ప్రజల ఐక్యతను దేశానికి చాటుతున్నామని చెప్పారు.
Kerala CM Vijayan దేశ స్వాతంత్య్ర సంగ్రామంతో ఏ మాత్రం సంబంధం లేని పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందని, ఈ పరిస్థితుల్లో ప్రజల మధ్య ఐక్యత, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక సమతుల్యత, సమానత్వం సాధించాల్సిన అవసరం ఉందని పినరయి విజయన్ చెప్పారు. స్వాతంత్య్ర పోరాట అకాంక్షలకు అనుగుణంగా దేశంలో ప్రస్తుత పాలన జరగడం లేదన్నారు.
దేశ ప్రయోజనాలు, రాజ్యాంగ నిర్మాణ లక్ష్యాలకు విరుద్ధంగా పరిపాలన సాగుతోందని విజయన్ చెప్పారు. రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న అంశాలకు విరుద్దంగా ప్రస్తుత పాలన సాగుతోందని విమర్శించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని హరించేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. సెక్యులర్ భావనకు నష్టం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దేశం అంటే రాష్ట్రాల సమాహారం అనే సంగతి కేంద్రం మరిచిపోయిందని, సమాఖ్య స్ఫూర్తిగా విరుద్ధంగా కేంద్రంలోని ప్రభుత్వం నియంతృత్వ విధానాలను అమలు చేస్తోందని ఆరోపించారు.
రాష్ట్రాల మధ్య సహకారం, పరస్పర అవగాహన అనే అంశాలను మరిచిపోయారని, రాష్ట్రాల భాగస్వామ్యం అనే మాటలకు అర్థం లేకుండా పోయిందని, సమాఖ్య వ్యవస్థలపై రకరకాల దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు రావాల్సిన నిధుల విషయంలో కూడా అన్యాయం జరుగుతోందని, నిధుల కేటాయింపు విషయంలో వివక్ష పాటిస్తున్నారని ఆరోపించారు.
కేరళా వంటి రాష్ట్రాల్లో ఆర్‌ఎస్‌ఎస్, హిందూ మతతత్వ శక్తులు ప్రభుత్వాలపై దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రాల ప్రమేయం లేకుండానే చట్టాలను చేస్తున్నారని, రాష్ట్రాల ప్రమేయం లేకుండా కొత్త చట్టాలను చేయడం వల్ల సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతోందన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా ప్రస్తుతం బుల్‌డోజర్ పాలన సాగుతోందని విజయన్ విమర్శించారు.
ఎలాంటి నైతిక విలువలు పాటించలేదని, రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోసి, బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి కూడా వెనుకాడటం లేదన్నారు. భిన్నత్వంలో ఏకత్వమనే భారతదేశ లక్షణానికి విరుద్ధంగా ప్రస్తుత పాలన జరుగుతోందని, దేశ ప్రయోజనాలకు ఏమాత్రం బీజేపీ విధానాలు మంచివి కాదన్నారు. ప్రాంతీయ భాషల ప్రాధాన్యత తగ్గించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
హిందీని బలవంతంగా రాష్ట్రాలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయల రంగం తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని చెప్పారు. జ్యూడిషియల్ వ్యవస్థలో సైతం జోక్యం చేసుకోడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని, దేశంలో అన్ని వ్యవస్థలను దెబ్బతీసేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని చెప్పారు. దేశంలో రాజ్యాంగ స్వరూపాన్ని సైతం మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఇది దేశ ప్రజల ప్రయోజనాలను నష్టపరుస్తుందన్నారు.
భిన్న భాషలు, విభిన్న సంస్క్రతుల మేళవింపైన దేశంలో సాంస్కృతిక భిన్నత్వాన్ని చెదరగొట్టేలా పాలన ఉందన్నారు. మహాత్మ గాంధీని హతమార్చిన హిందూత్వ శక్తులు ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్నాయని విమర్శించారు. గత ఐదేళ్లలో 12లక్షల కోట్ల రుపాయలు అప్పులు చేసినా దేశానికి కావాల్సిన పురోగతిని మాత్రం సాధించలేకపోయారని విమర్శించారు. జీడీపీ వృద్ధి రేటు డోలాయమన పరిస్థితుల్లో ఉందని , దేశంలో అన్ని రంగాల్లో వృద్ధి రేటు తిరోగమనంలో ఉందని చెప్పారు. పెట్రో ధరల పెంపు భారం దేశ ప్రజానీకాన్ని పీడిస్తోందన్నారు. హంగర్ ఇండెక్స్‌లో ప్రపంచంలో
121 దేశాల్లో 107వ ర్యాంకులో దేశం ఉండటమే ప్రస్తుత పరిస్ధితికి నిదర్శమని చెప్పారు. పేద ప్రజలపై అకృత్యాలు, మైనార్టీలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఆరోపించారు. బీజేపీీ పాలనలో సెక్యులర్ వ్యవస్థల మనుగడ ప్రమాదంలో ఉందని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ప్రజల మధ్య ఐక్యత రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశాన్ని కాపాడుకోడానికి దేశ ప్రజలంతా ఒక్కతాటిపైకి రావాలని అభిప్రాయపడ్డారు.
టాపిక్