Vivek Agnihotri on Prakash Raj: ప్రకాశ్ రాజ్ ఓ అర్బన్ నక్సల్.. కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ సీరియస్ కామెంట్స్
Vivek Agnihotri on Prakash Raj: ప్రకాశ్ రాజ్ ఓ అర్బన్ నక్సల్ అంటూ కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సీరియస్ కామెంట్స్ చేశాడు. తన మూవీకి భాస్కర అవార్డు కూడా రాదంటూ ప్రకాశ్ రాజ్ చేసిన కామెంట్స్ పై అతడిలా స్పందించాడు.
Vivek Agnihotri on Prakash Raj: కశ్మీర్ ఫైల్స్ సినిమా చుట్టూ మరోసారి వివాదం నడుస్తోంది. ఈ సినిమాకు ఆస్కార్ కాదు కదా కనీసం భాస్కర్ అవార్డు కూడా రాదంటూ నటుడు ప్రకాశ్ రాజ్ అనడంపై ఆ మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఘాటుగా స్పందించాడు. అతడో అర్బన్ నక్సల్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఎందుకు జరుగుతోందో ఓసారి చూద్దాం.
ఈ మధ్య కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశ్ రాజ్ పఠాన్, కశ్మీర్ ఫైల్స్ సినిమాలపై స్పందించాడు. పఠాన్ సినిమా రూ.700 కోట్లకుపైగా వసూలు చేసింది.. అలాంటి సినిమాను బ్యాన్ చేయాలని పిలుపునిచ్చారు ఈ ఇడియట్స్.. వాళ్లు కేవలం మొరుగుతారు.. కరవరు అని అన్నాడు. అదే కార్యక్రమంలో కశ్మీర్ ఫైల్స్ మూవీ గురించి ప్రస్తావన వచ్చింది.
ఈ సమయంలో ప్రకాశ్ రాజ్ ఇంకా ఘాటుగా స్పందించాడు. "కశ్మీర్ ఫైల్స్ ఓ నాన్సెన్స్ ఫిల్మ్. కానీ ఈ సినిమాను ఎవరు ప్రొడ్యూస్ చేశారో మనకు తెలుసు. ఇంటర్నేషనల్ జ్యూరీ వాళ్లపై ఉమ్మింది. అయినా వాళ్లు సిగ్గు రాదు. ఆ సినిమా డైరెక్టర్ తనకు ఆస్కార్ ఎందుకు రాదు అని అడుగుతున్నాడు. ఆస్కార్ కాదు కదా ఆ సినిమాకు భాస్కర్ కూడా రాదు. ఇలాంటి సినిమాలను ప్రొడ్యూస్ చేయడానికే వాళ్లు సుమారు రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారట" అంటూ ప్రకాశ్ రాజ్ అన్నాడు.
అతని కామెంట్స్ పై తీవ్రంగా మండిపడిన కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.. గురువారం (ఫిబ్రవరి 9) ఓ ట్వీట్ చేశాడు. అందులో ప్రకాశ్ రాజ్ ను అర్బన్ నక్సల్స్ లో ఒకడిగా ప్రస్తావించాడు. "ఓ చిన్న, ప్రజల సినిమా అయిన ది కశ్మీర్ ఫైల్స్ అర్బన్ నక్సల్స్ కు నిద్రలేని రాత్రులను మిగిల్చింది.
వాళ్లలో ఒకడైన వ్యక్తిని ఏడాది తర్వాత కూడా ఆ సినిమా వేధిస్తోంది. ఆ సినిమాను చూసిన వాళ్లను మొరిగే కుక్కలని అంటున్నాడు. మిస్టర్ అంధకార్ రాజ్ నాకు భాస్కర్ ఎలా దక్కుతుంది. అదెవరో ఎప్పటికే మీ సొంతమే" అని వివేక్ ట్వీట్ చేశాడు.
1990ల్లో కశ్మీర్ లో జరిగిన ఊచకోతపై వివేక్ అగ్నిహోత్రి కశ్మీర్ ఫైల్స్ సినిమా తీశాడు. ఇందులో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు నటించారు. గతేడాది రిలీజైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ దగ్గర భారీగా వసూలు చేసింది.
సంబంధిత కథనం
టాపిక్