Sehwag On Rohit : రోహిత్ శర్మ బౌలర్లతో పోరాడడం లేదు.. అదే అసలు సమస్య
Sehwag On Rohit : ఈసారి ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. రోహిత్ మెరుపులు మెరిపించడంలో విఫలమవడంతో ఆ జట్టు ప్రదర్శన కూడా దెబ్బతింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ.. రోహిత్ శర్మ ఎక్కడ తడబడుతున్నాడో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
ఐపీఎల్‌లో రోహిత్ శర్మ(Rohit Sharma) పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో రోహిత్ 18.39 సగటుతో 184 పరుగులు మాత్రమే చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 126.89 మాత్రమే. ముఖ్యంగా గత రెండు మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ ఖాతా తెరవలేదు.
రోహిత్ ప్రదర్శనపై వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) మాట్లాడుతూ.. 'రోహిత్ శర్మ బౌలర్లతో పోరాడడం లేదు.. తనతో తానే పోరాడుతున్నాడు.. అతని బ్యాటింగ్‌లో ఎలాంటి సమస్య లేదు. కానీ అతని మనస్సులో కొంత గందరగోళం ఉంది. రోహిత్ దాని నుండి బయటికి వచ్చిన రోజు, మునుపటిలా ఆడగలుగుతాడు.' అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు.
ఈ టోర్నీలో ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్టు ఆశించిన ప్రదర్శన చేయడంలో విఫలమైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతోంది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ ఐదు గెలిచి ఐదు ఓడిపోయి 10 పాయింట్లతో ఉంది. నెట్‌రన్‌రేట్‌లో వెనుకబడి ఉన్నందున టేబుల్ లో ఏడో స్థానంలో కొనసాగుతోంది.
ఈ ఐపీఎల్ సీజన్‌లో ఘోరంగా విఫలమవుతున్నాడు. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో పదే పదే తడబడుతున్న హిట్ మ్యాన్ అభిమానులకు నిరాశ కలగజేస్తున్నాడు. తన పేరిట ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు రోహిత్. ఐపీఎల్ టోర్నీలో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. రోహిత్ శర్మ(Rohit Sharma) ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 16 సార్లు డకౌట్ అయ్యాడు.
ఇక ఐపీఎల్(IPL)లో మంగళవారం ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది. ముంబై ఇండియన్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లకు చాలా కీలకం. గెలిచిన జట్టు ప్లేఆఫ్ పోటీలో ముందంజలో ఉంటే.. ఓడిన జట్టుకు ప్లేఆఫ్ మార్గం అగమ్యగోచరమవుతుంది.
ఇరు జట్లు ఓడిపోయి ఓటమి చేదును అధిగమించేందుకు ప్రయత్నిస్తాయి. గత మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ ఘోర పరాజయాన్ని చవిచూడగా, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడిపోయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ టోర్నీ తొలి రౌండ్‌లో ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది.