Jofra Archer Tweet: సిగ్గుండాలి.. రిపోర్టర్‌పై ముంబై ఇండియన్స్ బౌలర్ సీరియస్
Jofra Archer Tweet: సిగ్గుండాలి అంటూ రిపోర్టర్‌పై ముంబై ఇండియన్స్ బౌలర్ సీరియస్ అయ్యాడు. తనకు గాయమైందంటూ వచ్చిన వార్తపై జోఫ్రా ఆర్చర్ తీవ్రంగా మండిపడ్డాడు.
Jofra Archer Tweet: ఇంగ్లండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్.. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ కు ఆడుతున్న విషయం తెలుసు కదా. గతేడాది గాయం కారణంగా మొత్తం సీజన్ కు అందుబాటులో ఉండడని తెలిసినా కూడా.. ముంబై ఫ్రాంఛైజీ అతన్ని ఏకంగా రూ.8 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఈ సీజన్ లో అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.
అయితే ఆర్చర్ మాత్రం పూర్తిగా కోలుకోలేదు. ఈ సీజన్ లో కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. అయితే అతని మోచేతికి గాయమైందని, అందుకే ఆడటం లేదని ఓ బ్రిటన్ పత్రిక కథనం రాసింది. ఐపీఎల్ జరుగుతుండగానే అతడు స్పెషలిస్టును కలవడానికి బెల్జియం వెళ్లినట్లు కూడా చెప్పింది. ఈ వార్తలపై ఆర్చర్ తీవ్రంగా మండిపడ్డాడు.
సిగ్గుండాలి అంటూ ఆ వార్త రాసిన రిపోర్టర్ పై ఆర్చర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పటికే పూర్తి కోలుకోలేని పరిస్థితుల్లో ముంబై తరఫున ఆడలేకపోతున్న ఆర్చర్.. ఇలా కొత్త గాయం అంటూ వచ్చిన వార్తలు చూసి మరింత కలత చెందాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్ ఆడిన అతడు.. తర్వాత ఐదు మ్యాచ్ లకు దూరమయ్యాడు. ఆర్చర్ పూర్తి ఫిట్ గా లేడని ముంబై ఇండియన్స్ కోచ్ మార్క్ బౌచర్ చెప్పాడు.
పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ ఆడిన అతడు.. మళ్లీ మంగళవారం (ఏప్రిల్ 25) గుజరాత్ టైటన్స్ మ్యాచ్ ఆడలేదు. అయితే తనకు మోచేతి గాయమైందన్న ఆ రిపోర్ట్ పై అతడు ట్వీట్ చేశాడు. "నిజాలు తెలుసుకోకుండా, నా అనుమతి లేకుండా ఇలాంటి ఆర్టికల్ రాయడం వెర్రితనం. రిపోర్టర్ ఎవరైనా సరే నీకు సిగ్గుండాలి. ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న ప్లేయర్ పై నీ వ్యక్తిగత ప్రయోజనం కోసం ఇలాంటి వార్తలు రాయడం సరి కాదు. నీలాంటి వాళ్లతోనే అసలు సమస్య" అని ఆర్చర్ తీవ్రంగా స్పందించాడు.
గత రెండేళ్లుగా ఒకటి కంటే ఎక్కువ సర్జరీలు చేయించుకున్న ఆర్చర్.. చాలా కాలం తర్వాత ఈ ఏడాది జనవరిలో సౌతాఫ్రికాలో సిరీస్ తో ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టాడు. ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ అతనిపై భారీ ఆశలే పెట్టుకున్నా.. అతడు పూర్తి ఫిట్ గా లేకపోవడంతో నిరాశ తప్పడం లేదు. అయితే ఆదివారం (ఏప్రిల్ 30) రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ సమయానికి ఆర్చర్ తిరిగి వస్తాడని ముంబై టీమ్ భావిస్తోంది.
సంబంధిత కథనం