Adhurs 2: ‘అవసరమైతే ఎన్టీఆర్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తా’: కోన వెంకట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Adhurs 2 - Jr NTR: అదుర్స్ సీక్వెల్ గురించి సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. తాను అదుర్స్ 2 చిత్రం చేస్తానని నమ్మకంగా చెప్పారు.
Adhurs 2: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అదుర్స్ సినిమా ఓ క్లాసిక్‍గా నిలిచిపోయింది. 2010లో వచ్చిన ఆ చిత్రానికి వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు. అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేశారు. ఆ చిత్రంలో ఎన్టీఆర్ చేసిన ‘చారి’ క్యారెక్టర్ ఐకానిక్‍గా నిలిచిపోయింది. ఆ పాత్రలో ఆయన పండించిన కామెడీ, మేనరిజమ్స్ ఎప్పటికీ అందరికీ గుర్తుంటాయి. ఎన్టీఆర్, బ్రహ్మానందం కాంబినేషన్‍లో కామెడీ అదుర్స్ సినిమాకు ప్రధాన హైలైట్‍గా నిలిచింది. ఆ చిత్రానికి కోన వెంకట్ రచయితగా వ్యవహరించారు. అయితే, అదుర్స్ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందని సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తునే ఉన్నారు. ఇంత కాలానికి అదుర్స్ 2 గురించి కోన వెంకట్ స్పందించారు.
అంజలి ప్రధాన పాత్ర పోషించిన హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు (ఏప్రిల్ 3) జరిగింది. ఈ చిత్రానికి శివ తుర్లపాటి దర్శకత్వం వహించగా.. కోన వెంకట్ నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 11న రిలీజ్ కానుంది. అయితే, నేడు జరిగిన ఆ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో కోన వెంకట్ మాట్లాడారు. అదుర్స్ 2 గురించి కామెంట్స్ చేశారు.
నిరాహార దీక్ష చేసైనా..
వెంకీకి సీక్వెల్ చేయాలనుకుంటున్నారా అని ఎదురైన ప్రశ్నకు కోన వెంకట్ స్పందించారు. వెంకీ 2 సంగతి తెలియదు కానీ.. అదుర్స్ 2 చేయాలని తాను గట్టిగా నిర్ణయించుకున్నానని ఆయన చెప్పారు. అదుర్స్ 2 చిత్రానికి ఎన్టీఆర్‌ను ఒప్పించేందుకు అవసరమైతే ఆయన ఇంటికి ముందు నిరాహార దీక్ష చేస్తానని అన్నారు. “అదుర్స్ 2 చేయాలని నేను పక్కాగా అనుకుంటున్నా. అవసరమైతే తారక్ (ఎన్టీఆర్) ఇంటికి ముందు టెంట్ వేసి.. పిలక పెట్టుకొని నేను నిరాహార దీక్ష చేసైనా సరే.. అతడితో అదుర్స్ 2 చేయిస్తా” అని కోన వెంకట్ చెప్పారు.
ఎన్టీఆర్ తప్ప దేశంలో ఎవరూ చేయలేరు
అదుర్స్ చిత్రంలో చారి పాత్రను ఎన్టీఆర్ తప్ప దేశంలో మరెవరూ చేయలేరని కోన వెంకట్ అన్నారు. ఎన్టీఆర్ కెరీర్లోనే అది బెస్ట్ అని అన్నారు. “తనను మించి చేసే వాడు లేడు. తెలుగు ఇండస్ట్రీ అని కాదు.. మొత్తం ఇండియన్ ఇండస్ట్రీలో ఎవరూ లేరు. ఆ క్యారెక్టర్, ఆ ఆహార్యం, ఆ మాడ్యులేషన్.. ఆ క్యారెక్టర్‌ను ఎన్టీఆర్‌లాగా చేసే వారు ఇండియాలోనే లేరు” అని కోన వెంకట్ చెప్పారు. అదుర్స్ 2 చిత్రాన్ని దర్శకుడు వీవీ వినాయక్‍తోనే ప్లాన్ చేస్తామని ఆయన తెలిపారు.
గీతాంజలి మళ్లీ వచ్చింది గురించి..
2014లో వచ్చిన హారర్ కామెడీ గీతాంజలి సినిమా మంచి హిట్ అయింది. ఇప్పుడు పదేళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్‍గా గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ వస్తోంది. హీరోయిన్ అంజలి, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేశ్, సత్య, షకలక శంకర్, అలీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. శివ తుర్లపాటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఇక, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం చేస్తున్నారు. అక్టోబర్ 10న ఈ మూవీని రిలీజ్ కానుంది. పాన్ ఇండియా రేంజ్‍లో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.