Game Changer Release: తిట్టుకోకుండ ఓపిక పట్టండి.. అప్పటికల్లా గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతుంది: నిర్మాత దిల్‍రాజు
Game Changer Release - Dil Raju: గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ గురించి నిర్మాత దిల్‍రాజు మరోసారి మాట్లాడారు. మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ పుట్టిన రోజు వేడుకల ఈవెంట్‍లో ఈ విషయంపై స్పందించారు. ఎప్పటికల్లా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నది వెల్లడించారు.
Game Changer Movie: గేమ్ ఛేంజర్ సినిమా కోసం మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ అభిమానులతో పాటు ప్రేక్షకులందరూ ఎంతో వేచిచూస్తున్నారు. గ్లోబల్ రేంజ్ హిట్ అయిన ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్‍చరణ్ చేస్తున్న మూవీ కావడం, పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్‍లో కొన్నిసార్లు బ్రేక్‍ల వల్ల గేమ్ ఛేంజర్ సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ నిరీక్షిస్తున్నారు.
రామ్‍చరణ్ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం (మార్చి 27) మూవీ టీమ్.. గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ‘జరగండి’ అంటూ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసింది. అయితే, ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అవుతుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అయితే, రామ్‍చరణ్ బర్త్ డే ఈవెంట్‍లో గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ గురించి నిర్మాత దిల్‍రాజు మాట్లాడారు.
తిట్టుకోవద్దు.. అప్పటికల్లా రిలీజ్
గేమ్ ఛేంజర్ మూవీని మరో నాలుగైదు నెలల్లో తప్పకుండా రిలీజ్ చేస్తామని దిల్‍రాజు క్లారిటీ ఇచ్చారు. తనను తిట్టుకోకుండా ఓపిక పట్టాలని ప్రేక్షకులను కోరారు. “ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి.. రామ్‍చరణ్ ఇప్పుడు మెగా పవర్ స్టార్ కాదు.. గ్లోబల్ స్టార్ అయ్యారు. ఆ రేంజ్‍కు సినిమా రీచ్ అవ్వాలంటే.. శంకర్ ఒక్కో పాటను.. సీన్‍ను తీర్చిదిద్దుతున్నారు. ఇంకొక్క నాలుగు నెలలు ఓపిక పడితే.. గేమ్ ఛేంజర్ మీ ముందుకు వస్తుంది. నాలుగైదు నెలల్లో రిలీజ్ అవుతుంది. రెండు నెలల్లో షూటింగ్ పూర్తవుతుంది” అని దిల్‍రాజు చెప్పారు.
‘దిల్ మామ’ కామెంట్లపై రియాక్షన్
గేమ్ ఛేంజర్ సినిమా గురించి అప్‍డేట్ ఇవ్వాలని ‘దిల్ మామ’ అంటూ తనకు సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్లు చేస్తున్నారని దిల్‍రాజు చెప్పారు. డైరెక్టర్ శంకర్ చెప్పే వరకు తాను ఎలాంటి అప్‍డేట్లు ఇవ్వలేనని ఆయన స్పష్టం చేశారు. “అరె.. దిల్‍మామ మాకు ఓ అప్‍డేట్ ఇవ్వు అని మీరు చాలా మంది కామెంట్లు పంపిస్తున్నారు. దిల్ మామ అప్‍డేట్ ఇవ్వలేడు. పైన శాటిలైట్ నుంచి శంకర్ ఇది ఇవ్వు అన్నప్పుడే నేను ఇవ్వగలుగుతాను. ఈ సినిమా విషయంలో ముందు ఎలాంటి లీకేజీలు ఇవ్వలేను” అని దిల్‍రాజు చెప్పారు.
దిల్‍రాజు కామెంట్లను బట్టి చూస్తే గేమ్ ఛేంజర్ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ లేకపోతే డిసెంబర్‌లో రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. షూటింగ్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతంగా పూర్తి చేసేలా టీమ్ ప్లాన్ చేసుకుంటోంది. ఇటీవలే విశాఖపట్టణంలో ఈ మూవీ చిత్రీకరణ షెడ్యూల్ జరిగింది.
గేమ్ ఛేంజర్ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. జరగండి పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో రామ్‍చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‍గా నటిస్తున్నారు. అంజలి, ఎస్‍జే సూర్య, జయరాం, శ్రీకాంత్, సముద్రఖనీ కీలకపాత్రలు చేస్తున్నారు. ఈ పొలిటికల్ యాక్షన్ మూవీలో ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నారు రామ్‍చరణ్.