Dil Raju: రామ్‍చరణ్ అభిమానులను నిరాశ పరిచిన నిర్మాత దిల్‍రాజు!-dil raju not reveal any update about ram charan game changer update at love me movie title launch event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dil Raju: రామ్‍చరణ్ అభిమానులను నిరాశ పరిచిన నిర్మాత దిల్‍రాజు!

Dil Raju: రామ్‍చరణ్ అభిమానులను నిరాశ పరిచిన నిర్మాత దిల్‍రాజు!

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 27, 2024 05:44 PM IST

Dil Raju - Game Changer: గేమ్ ఛేంజర్ సినిమా గురించి అప్‍డేట్ తెలుస్తుందని ఎదురుచూసిన గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ అభిమానులకు నిరాశ ఎదురైంది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న దిల్‍రాజు.. ఈ చిత్రం గురించి అప్‍డేట్ వెల్లడించలేదు.

దిల్‍రాజు
దిల్‍రాజు

Dil Raju: మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా అప్‍డేట్ల కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ అయ్యాక చరణ్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూనే ఉంది. అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా స్పష్టత లేదు. గేమ్ ఛేంజర్ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. దిల్‍రాజు నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమా గురించి చాలాకాలంగా అప్‍డేట్లు లేకపోవడంతో రామ్‍చరణ్ అభిమానులు నిరాశగా ఉన్నారు. నిర్మాత దిల్‍రాజు ఏ ఈవెంట్‍లో పాల్గొన్నా గేమ్ ఛేంజర్ అప్‍డేట్ కోసం ఆశగా చూస్తున్నారు.

yearly horoscope entry point

దిల్‍రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న లవ్‍మీ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ నేడు (ఫిబ్రవరి 27) జరిగింది. ఈ చిత్రాన్ని దిల్‍రాజు నిర్మిస్తున్నారు. టైటిల్ లాంచ్ కార్యక్రమానికి ఆయన కూడా హాజరయ్యారు. అయితే, ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ సినిమా గురించి దిల్‍రాజు ఏదో ఒక అప్‍డేట్ చెబుతారని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, ఆయన ఏ సమాచారం వెల్లడించలేదు.

ఈ ఈవెంట్‍లో తనను లవ్‍మీ సినిమా గురించే అడగాలని, గేమ్ చేంజర్ గురించి అడగొద్దని దిల్‍రాజు స్పష్టంగా చెప్పేశారు. అలాగే, తన స్పీచ్‍లోనూ గేమ్ చేంజర్ గురించి ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. దీంతో రామ్‍చరణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాను సెప్టెంబర్‌లో రిలీజ్ చేస్తామని గతంలో దిల్‍రాజు ఓ హింట్ ఇచ్చారు. అంతకు మించి ఆ తర్వాత గేమ్ చేంజర్ మూవీపై ఎలాంటి క్లారిటీ లేదు.

గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక్క పాట కూడా రిలీజ్ కాలేదు. ‘జరగండి’ అనే పాటను గతేడాది దీపావళికే తీసుకొస్తామని మూవీ టీమ్ బాగా హడావుడిగా చేసింది. అధికారిక ప్రకటనలు కూడా చేసింది. అయితే, అప్పుడు ఆ పాటను రిలీజ్ చేయలేదు. వాయిదా వేస్తున్నట్టు చెప్పింది. అయితే, నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ పాటను తీసుకురాలేదు. మరే అప్‍డేట్ కూడా ఇవ్వలేదు. దీంతో రామ్‍చరణ్ అభిమానులు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

రిలీజ్ డేట్‍పై అప్పుడైనా!

గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ డేట్‍ను రామ్‍చరణ్ పుట్టిన రోజైన మార్చి 27వ తేదీన మూవీ టీమ్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని కూడా రూమర్లు వస్తున్నాయి. అప్పటికల్లా ఓ అంచనాకు వచ్చి విడుదల తేదీని అనౌన్స్ చేయవచ్చని తెలుస్తోంది. మరి అప్పుడైనా స్పష్టత వస్తుందేమో చూడాలి.

గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. దర్శకుడు శంకర్.. ఇండియన్ 2 సినిమా కూడా తెరకెక్కిస్తుండటంతో పాటు మరిన్ని కారణాల వల్ల గేమ్ చేంజర్ ఆలస్యమవుతూ వస్తోంది. షూటింగ్‍కు చాలాసార్లు గ్యాప్స్ వచ్చాయి. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్లో ఈ చిత్రాన్నితీసుకొచ్చే ఛాన్స్ ఉందని కూడా టాక్ వినిపిస్తోంది.

గేమ్ చేంజర్ మూవీలో రామ్‍చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‍గా నటిస్తున్నారు. అంజలి, ఎస్‍జే సూర్య, జయరాం, సునీల్, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని దిల్‍రాజు నిర్మిస్తున్నారు.

Whats_app_banner