Tollywood: ఈ వారం మూడు సినిమాలు.. మూడు డిఫరెంట్ జానర్లు-gaami bhimaa premalu telugu movies to release this week in theatres and these three from different genres ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Gaami Bhimaa Premalu Telugu Movies To Release This Week In Theatres And These Three From Different Genres

Tollywood: ఈ వారం మూడు సినిమాలు.. మూడు డిఫరెంట్ జానర్లు

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 04, 2024 02:09 PM IST

Movie Releases This week: ఈ వారం థియేటర్లలోకి ఇంట్రెస్టింగ్ సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ మూడు డిఫరెంట్ జానర్లతో ఉండటంతో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ చిత్రాలపై భారీ అంచనాలు ఉన్నాయి.

Movie Releases: ఈ వారం మూడు సినిమాలు.. మూడు డిఫరెంట్ జానర్లు
Movie Releases: ఈ వారం మూడు సినిమాలు.. మూడు డిఫరెంట్ జానర్లు

Movie Releases: సినీ ప్రేమికుల కోసం ఈ వారం విభిన్నమైన జానర్ల సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి. అవే గామి, భీమా, ప్రేమలు సినిమాలు. ఈ మూడు చిత్రాలు మార్చి 8వ తేదీన తెలుగులో రిలీజ్ కానున్నాయి. ఇవి మూడు ఒకదానితో పోలిస్తే మరొకటి విభిన్నమైన జానర్లుగా ఉన్నాయి. విశ్వక్‍సేన్ హీరోగా నటించిన గామి చిత్రంపై అమితమైన ఆసక్తి నెలకొని ఉంది. ట్రైలర్ ఆకట్టుకోవటంతో గోపీచంద్ ‘భీమా’ మంచి ఎక్స్‌పెర్టేషన్లతో వస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమలు తెలుగు వెర్షన్‍లోనూ సత్తాచాటుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాల వివరాలివే..

గామి

విశ్వక్‍సేన్ ప్రధాన పాత్ర పోషించిన ‘గామి’ ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ జానర్ మూవీగా ఉంది. మానవుల స్పర్శతో తనకు ఉన్న సమస్యను పరిష్కరించుకునేందుకు ఓ వ్యక్తి చేసే సాహసోపేత ప్రయాణం చుట్టూ ఈ చిత్రం కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ మూవీలో అఘోరగా విశ్వక్ నటించారు. గామి ట్రైలర్ విజువల్ వండర్‌గా అందరినీ ఆకట్టుకుంది. లోకేషన్లు, వీఎఫ్‍ఎక్స్ సహా ట్రైలర్ ఆసాంతం అద్భుతంగా ఉండడంతో ఈ చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా తారస్థాయికి చేరాయి. ఈ చిత్రం మార్చి 8న థియేటర్లలో రిలీజ్ కానుండగా.. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‍లకు భారీ స్పందన వస్తోంది.

గామి చిత్రానికి విద్యాధర్ కగిట దర్శకత్వం వహించారు. సుమారు ఆరేళ్ల పాటు ఈ చిత్రం కోసం మూవీ టీమ్ శ్రమించింది. ఈ చిత్రంలో విశ్వక్‍తో పాటు చాందినీ చౌదరి, అభినయ, హారిక పెద్ద, దయానంద్ రెడ్డి కీలకపాత్రలు పోషించారు. నరేశ్ కుమారన్ సంగీతం అందించారు. గామి సినిమా మంచి విజయం సాధించడంతో పాటు టెక్నికల్‍గా అత్యున్నతంగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.

భీమా

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన ‘భీమా’ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందింది. చాలా ఏళ్లుగా సరైన హిట్ కోసం చూస్తున్న గోపీచంద్‍ ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. మార్చి 8న థియేటర్లలోకి ఈ చిత్రం రానుంది. ఏ.హర్ష ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఇటీవల వచ్చిన భీమా మూవీ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. క్యూరియాసిటీని కలిగించేలా ఈ ట్రైలర్ సాగింది. విజువల్స్ కూడా రిచ్‍గా ఆకట్టుకోగా.. గోపీచంద్ యాక్షన్ కూడా మెప్పించింది. కరుణే చూపని బ్రహ్మరాక్షసుడంటూ ఈ క్యారెక్టర్‌కు మంచి హైప్ తెచ్చింది మూవీ టీమ్. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా గోపీచంద్ కనిపించనున్నారు. కేజీఎఫ్, సలార్ చిత్రాలకు పని చేసిన రవిబస్రూర్.. భీమాకు సంగీతం అందించారు.

ప్రేమలు

లవ్ రొమాంటిక్ కామెడీ మూవీగా వచ్చిన ప్రేమలు సినిమా మలయాళంలో భారీ కలెక్షన్లతో సెన్సేషన్ హిట్ అయింది. ఇంకా వసూళ్ల జోరు కొనసాగిస్తోంది. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు దర్శక ధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ. హైదరాబాద్ బ్యాక్‍డ్రాప్‍లో తెరకెక్కడంతో తెలుగులోనూ ప్రేమలు సినిమాకు మంచి బజ్ ఉంది. ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ఈ చిత్రానికి తెలుగులోనూ మంచి ఆదరణ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మార్చి 8న ప్రేమలు తెలుగు వెర్షన్ రిలీజ్ అవుతోంది.

ప్రేమలు చిత్రానికి గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించగా.. నెల్సెన్ కే గఫూర్, మమితా బైజూ హీరోహీరోయిన్లుగా నటించారు. ఫీల్ గుడ్ కామెడీ, లవ్ స్టోరీతో ఈ చిత్రం ఉండనుంది.

మొత్తంగా ఈ వారం థియేటర్లలో మూడు డిఫరెంట్ జానర్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. గామి, భీమా, ప్రేమలు.. ఈ మూడు చిత్రాలపై మంచి ఆసక్తి ఉంది. మరి ఏ సినిమాలు అంచనాలను నిలబెట్టుకుంటాయో చూడాలి.

WhatsApp channel