Vishwak Sen: ఆ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదు: విశ్వక్‍సేన్
Vishwak Sen: విశ్వక్‍సేన్ ప్రధాన పాత్ర పోషించిన గామి సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ట్రైలర్ విజువల్ వండర్‌లా ఉంది. ఈ సినిమా గురించి విశ్వక్ తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ ప్రధాన పాత్రలో అఘోరగా నటిస్తున్న గామి చిత్రంపై విపరీతమైన ఆసక్తి ఉంది. సుమారు ఆరేళ్లుగా ఈ చిత్రం కోసం మూవీ టీమ్ పని చేస్తోంది. ఇటీవలే వచ్చిన గామి ట్రైలర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. అద్భుతమైన విజువల్స్‌తో ఆకట్టుకుంది. ఈ ట్రైలర్‌పై అంతటా ప్రశంసలు వచ్చాయి. దీంతో గామి చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. మార్చి 8వ తేదీన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. కాగా, గామి గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు విశ్వక్.
రెమ్యూనరేషన్ లేకుండా..
గామి సినిమా కోసం తాను ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదని విశ్వక్‍సేన్ వెల్లడించారు. లెక్కలు వేసుకొని చేసే లాంటి సినిమా ఇది కాదని అన్నారు. “నా ఇమేజ్ ఈ చిత్రంపై పడకూడదని మేం అనుకున్నాం. అన్ని లెక్కలను ఆలోచించి చేయాల్సిన మూవీ కాదు ఇది. ఈ సినిమా కోసం నేను ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదు” అని విశ్వక్ సేన్ వెల్లడించారు.
ఆరేళ్లుగా..
గామి సినిమాకు విద్యాధర్ కగిట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ 2018లో మొదలైంది. అప్పటి నుంచి విద్యాధర్ ఈ చిత్రంపైనే పని చేస్తున్నారు. తన ఈ నగరానికి ఏమైంది, ఫలక్‍నుమా దాస్ కంటే ముందు గామి మొదలైందని విశ్వక్‍సేన్ వెల్లడించారు. ఈ సినిమాకు చాలా కాలం పడుతుందని అప్పట్లోనే తనకు అర్థమైందని అన్నారు. ఇలాంటి సినిమా ముందెప్పుడూ రాలేదని విశ్వక్ తెలిపారు.
అలా అయితే రూ.100కోట్లు అయ్యేది
వెళ్లిపోమాకే (2017) సినిమా తర్వాత గామి కథను విద్యాధర్ తనకు చెప్పాడని విశ్వక్ సేన్ వెల్లడించారు. ఈ సినిమాను తక్కువ సమయంలో రూపొందించాలంటే రూ.100కోట్లకు పైగానే బడ్జెట్ కావాల్సి ఉండేదని అన్నారు. “నా తొలి సినిమా రిలీజ్ అయిన తర్వాత విద్యాధర్ నాకు ఈ స్టోరీ చెప్పారు. తక్కువ సమయంలో ఈ మూవీ రూపొందించి ఉంటే బడ్జెట్ రూ.100 కోట్ల కంటే ఎక్కువ అయి ఉండేది. ఎంతకాలమైనా.. ఏమైనా అద్భుతమైన క్వాలిటీతోనే ఈ చిత్రాన్ని తీసుకురావాలని అనుకున్నాం. ఈ చిత్రం సరైన సమయంలోనే వస్తోందని మేం అనుకుంటున్నాం” అని విశ్వక్ చెప్పారు.
గామి సినిమాకు సుమారు రూ.20కోట్ల బడ్జెట్ అయినట్టు అంచనాలు ఉన్నాయి. తొలుత క్రౌడ్ ఫండింగ్‍తో ఈ చిత్రాన్ని టీమ్ మొదలుపెట్టగా.. ఆ తర్వాత వీ సెల్యూలాయిడ్ బ్యానర్ నిర్మించేందుకు ముందుకు వచ్చింది. అయితే, పరిమిత బడ్జెట్‍లో అత్యున్నత క్వాలిటీ సాధించేందుకు మూవీ టీమ్ సమయం తీసుకుంది.
మైనస్ 30 డిగ్రీల చలిలో..
గామి సినిమాను హిమాలయాల్లోనూ షూట్ చేశారు. ఆ సమయంలో మైనస్ 30 డిగ్రీల వాతావణంలో ఈ సినిమా షూటింగ్ జరిగిందని, అప్పుడు కాళ్లు, చేతులు కూడా గడ్డకట్టేసేవని విశ్వక్ వెల్లడించారు. ఈ సినిమా కోసం దర్శకుడు విద్యాధర్ చాలా పరిశోధన చేశారని, అఘోరాలు ఎక్కువగా ఉండే కుంభమేళాలకు కూడా వెళ్లారని విశ్వక్ వెల్లడించారు.
గామి సినిమా ట్రైలర్‌లో విజువల్స్, గ్రాఫిక్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. అద్భుతమైన క్వాలిటీతో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం మార్చి 8న థియేటర్లలో రిలీజ్ కానుంది. అంచనాలు భారీగా ఉండడంతో మంచి ఓపెనింగ్‍ను అందుకునే అవకాశాలు ఉన్నాయి.
విశ్వక్‍సేన్ ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ చేస్తున్నారు. మరో చిత్రం కూడా తన లైనప్‍లో ఉంది.