Chiranjeevi on Oscars: చరణ్ ఒక్కడికే ఈ విజయాన్ని కట్టబెట్టకండి: చిరంజీవి
Chiranjeevi on Oscars: చరణ్ ఒక్కడికే ఈ విజయాన్ని కట్టబెట్టకండి అని అన్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ లభించిన విషయం తెలిసిందే.
Chiranjeevi on Oscars: ఆస్కార్స్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు సాధించిన తొలి ఇండియన్ సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచిన విషయం తెలుసు కదా. దీంతో ఆ మూవీ టీమ్ పై ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సహా ప్రముఖులంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వీళ్లలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నాడు.
తన కొడుకు రామ్ చరణ్ కూడా ఈ టీమ్ లో సభ్యుడు కావడంతో చిరు పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నాడు. అయితే ఈ విజయాన్ని కేవలం చరణ్ ఒక్కడికే కట్టబెట్టడం కూడా సరికాదని అతడు అనడం విశేషం. మొత్తం ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పాడు.
"తన విజన్ తో మనకు గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఎస్ఎస్ రాజమౌళికి అభినందనలు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా భాగం కావడం చాలా సంతోషంగా ఉంది" అని చిరంజీవి అన్నాడు. నాటు నాటు పాట విజయంలో రాజమౌళి సహా కీరవాణి, చంద్రబోస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ కీలకపాత్ర పోషించారు.
అయితే ఆస్కార్స్ కు రెండు వారాల ముందే అమెరికా వెళ్లి ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న రామ్ చరణ్ ను అభినందిస్తూ ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు చిరంజీవి స్పందిస్తూ.. ఇది అతనొక్కడి విజయం కాదని అన్నాడు. "ఇది కేవలం రామ్ చరణ్ కు కట్టబెట్టే విజయం కాదు. రాజమౌళి, కీరవాణి, తారక్, చరణ్ అందరూ కష్టపడి దీనిని ఆస్కార్స్ స్థాయికి తీసుకెళ్లారు. అందుకే ఇవాళ మనకు అవార్డు వచ్చింది" అని చిరు అభిప్రాయపడ్డాడు.
"గోల్డెన్ గ్లోబ్స్, హెచ్‌సీఏ అవార్డులు వచ్చిన తర్వాత నాటు నాటుకు ఆస్కార్స్ కూడా కచ్చితంగా వస్తుందని నేను నమ్మకంగా ఉన్నాను. ఇదొక చారిత్రక విజయం. ఎప్పటికీ గొప్ప గౌరవంగా నిలవనుంది" అని చిరంజీవి అన్నాడు.
సంబంధిత కథనం