Rajamouli on Natu Natu: ఆస్కార్స్‌లో నాటు నాటు.. పాట విశేషాలు పంచుకున్న రాజమౌళి-rajamouli on natu natu as he discussed about it in detail ahead of oscars 2023 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajamouli On Natu Natu: ఆస్కార్స్‌లో నాటు నాటు.. పాట విశేషాలు పంచుకున్న రాజమౌళి

Rajamouli on Natu Natu: ఆస్కార్స్‌లో నాటు నాటు.. పాట విశేషాలు పంచుకున్న రాజమౌళి

Hari Prasad S HT Telugu
Mar 07, 2023 02:56 PM IST

Rajamouli on Natu Natu: ఆస్కార్స్‌లో నాటు నాటు లైవ్ పర్ఫార్మెన్స్ కోసం భారీగా ప్లాన్ చేస్తున్నాడు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల్లో నాటు నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పోటీ పడుతున్న విషయం తెలిసిందే.

నాటు నాటు సాంగ్ పై చరణ్, తారక్ స్టెప్పులు
నాటు నాటు సాంగ్ పై చరణ్, తారక్ స్టెప్పులు

Rajamouli on Natu Natu: ఆస్కార్స్ 2023కు టైమ్ దగ్గరపడుతోంది. ప్రపంచమంతా ఈ ప్రతిష్టాత్మక అవార్డుల సెర్మనీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే మన తెలుగు ప్రేక్షకుల్లో ఈసారి ఈ ఆసక్తి మరింత ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఈసారి నాటు నాటు సాంగ్ ఆస్కార్స్ కోసం పోటీ పడుతోంది.

అంతేకాదు ఈ ఆస్కార్స్ వేదికపైనే ఈ నాటు నాటు లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఉండబోతోంది. ఈ పాటకు మ్యూజిక్ అందించిన కీరవాణి, పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఆస్కార్స్ వేదికపై పర్ఫామ్ చేయనున్నారు. ఈ సందర్భంగా నాటు నాటు గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు డైరెక్టర్ రాజమౌళి. ఈ పాటను ఉక్రెయిన్ లోని కీవ్ లో చిత్రీకరించారు.

నిజానికి ఈ పాటను ఇండియాలోనే షూట్ చేయాలనుకున్నాడట రాజమౌళి. కానీ చివరికి అది సాధ్యం కాలేదని చెప్పాడు. పాట మరింత లైవ్లీగా అనిపించేందుకు అసలైన డ్యాన్సర్లు, మ్యూజీషియన్లు బ్యాక్‌గ్రౌండ్ లో ఉండేలా చూసుకున్నట్లు కూడా తెలిపాడు. ఈ పాటలో స్టెప్స్ కూడా చాలా పాపులర్ అయిన సంగతి తెలుసు కదా. దీనికి ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించాడు.

రాజమౌళి ఏమన్నాడంటే..

ఈ పాట గురించి వానిటీ ఫెయిర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి స్పందించాడు. "ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు ప్రేమ్ ఎప్పటికీ గుర్తుండిపోయే స్టెప్స్ ఇచ్చాడు. వాళ్ల స్టైల్, బాడీ లాంగ్వేజ్ అతనికి బాగా తెలుసు. వాళ్ల ఫ్యాన్స్ ఏం ఆశిస్తారో కూడా తెలుసు.

అయితే ఈ పాటకు డ్యాన్స్ కూర్పు చాలా కష్టం. దీనిపై ఇద్దరు స్టార్లు కలిసి డ్యాన్స్ చేస్తారు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కానీ ఇద్దరికీ సూటయ్యే స్టైల్ లో కొరియోగ్రఫీ ఉండాలి. అంతేకాదు మరీ క్లిష్టమైన స్టెప్స్ కాకుండా అభిమానులు కూడా వాటిని వేసేలా సింపుల్ గా ఉండాలనీ నేను చెప్పాను" అని రాజమౌళి చెప్పాడు.

ఇక ఈ పాటకు హీరోలు వేసుకున్న కాస్ట్యూమ్స్ పై కూడా తన భార్య, కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజమౌళితో కలిసి ప్రత్యేకంగా రూపొందించినట్లు రాజమౌళి వెల్లడించాడు.

దుమ్ము ధూళిలో డ్యాన్స్ చేయాల్సి రావడంతో ప్రతి డ్యాన్సర్ కోసం రెండు, మూడు జతల డ్రెస్సులు సిద్ధంగా ఉంచారట. ఈ పాటలో డ్యాన్సే కాదు.. ఇద్దరు హీరోల మధ్య ఫైట్ కూడా ఉండటంతో అందుకు తగినట్లు స్టెప్పులను రూపొందించాల్సిందిగా ప్రేమ్ కు రాజమౌళి సూచించాడట.

"నిజానికి నాటు నాటు పాట అంత పెద్ద హిట్ కావడానికి కేవలం డ్యాన్స్, మ్యూజిక్ కారణం కాదు. ఆ పాటలోనే అందమైన స్టోరీ ఉంది. మొత్తం ఆర్ఆర్ఆర్ స్టోరీ అంతా ఆ పది నిమిషాల్లోనే ఉంది. అమెరికాతోపాటు ఇతర ప్రపంచానికి ఆ పాటలోని అర్థం తెలియదు. ఈ పాట క్రెడిట్ అంతా గేయ రచయిత చంద్రబోస్ కు ఇవ్వాల్సిందే" అని రాజమౌళి స్పష్టం చేశాడు.

IPL_Entry_Point