AR Rahman On Keeravani: కీరవాణి 2015లో సంగీతాన్ని వదిలేద్దామనుకున్నారా? రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
AR Rahman On Keeravani: ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గురించి ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కీరవాణి తన సంగీత కెరీర్‌ను 2015లో వదిలేద్దామనుకున్నారని, కానీ ఆయన కెరీర్ సరిగ్గా అప్పుడే ప్రారంభమైందని తెలిపారు.
AR Rahman On Keeravani: ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్ బరిలో నిలవడంతో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ రాజమౌళి, కీరవాణితో పాటు సదరు చిత్రబృందానికి అభినందులు తెలిపిన విషయం తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట తప్పకుండా ఆస్కార్ గెలుస్తుందని ఆయన ఆకాక్షించారు. తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీరవాణి గురించి రెహమాన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కీరవాణి 2015లోనే సినిమాల నుంచి తప్పుకోవాలని అనుకున్న సంగతిని బయటపెట్టారు.
"ముందుగా కీరవాణి గారు చాలా గొప్ప సంగీత దర్శకులు. ఆయనకు తగినంత ప్రాధాన్యత రాలేదనే చెప్పాలి. ఆయన గొప్ప కేస్ స్టడీ. ఇది నిజమో కాదో నాకు తెలియదు కానీ.. 2015లోనే ఆయన సంగీతాన్ని విడిచిపెట్టి రిటైర్ అవ్వాలనుకున్నారట. కానీ ఆయన కెరీర్ అప్పుడే సరిగ్గా ప్రారంభమైంది. ఆయన ఏంటో ఇప్పుడు మనకు తెలుస్తోంది. కాబట్టి జీవితం ముగిసిపోయిందని భావించే ఎవరైనా, మీరు మీ జీవితాన్ని గడపడం ప్రారంభించాల్సిన అవసరముంది. నేను నా పిల్లలకు ఎప్పుడూ ఇదే విషయాన్ని చెబుతాను. 35 సంవత్సరాలుగా నిరంతరం శ్రమించిన కీరవాణి నిష్క్రమించాలనుకున్నాడు. కానీ ఆయన కెరీర్ నిజానికి ఆ సమయంలోనే ప్రారంభమైంది." అని రెహమాన్ స్పష్టం చేశారు.
కీరవాణి గురించి ఏఆర్ రెహమాన్ మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృంతగా వైరల్ అవుతోంది. చాలా మంది ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జీవితం ముగిసిపోయిందని ఎప్పుడూ అనుకోవద్దని, ప్రేరణగా తీసుకుని ముందుకు వెళ్లాలని నెటిజన్లు స్పందిస్తున్నారు. కీరవాణి అందరికీ ప్రేరణగా నిలిచారని మరొకరు కామెంట్ పెట్టారు.
కీరవాణి 1990లో విడుదలైన కల్కి సినిమాతో స్వరకర్తగా అరంగేట్రం చేశారు. అయితే ఆ సినిమా విడుదల కాలేదు. అదే ఏడాది మనసు మమత అనే సినిమాతో ఆయన తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ క్షణంతో ఆయన కెరీర్ మరింత వేగంగా మలుపు తిరిగింది. మూడేళ్ల తర్వాత 1994లో వచ్చిన క్రిమినల్ సినిమాతో ఆయన బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు.
సంబంధిత కథనం