Padma Shri to Keeravani: కీరవాణికి మరో గౌరవం.. పద్మశ్రీ ప్రకటించిన కేంద్రం
Padma Shri to Keeravani: కీరవాణికి మరో గౌరవం దక్కింది. 2023కుగాను కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఈ సంగీత దర్శకుడిని పద్మశ్రీ వరించింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీరవాణి ఇప్పుడీ ప్రతిష్టాత్మన పౌర పురస్కారాన్ని కూడా అందుకోబోతున్నాడు.
Padma Shri to Keeravani: ఎంఎం కీరవాణి.. తన వినసొంపైన బాణీలతో దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న సంగీత దర్శకుడు. కెరీర్లో ఎన్నో వేల పాటలను కంపోజ్ చేశాడు. అయితే గతేడాది ఆర్ఆర్ఆర్ మూవీ మాత్రం కీరవాణిని మరో లెవల్ కు తీసుకెళ్లింది. ఈ సినిమాతో అతడు అంతర్జాతీయ గుర్తింపు అందుకున్నాడు.
తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ శ్రీ అవార్డును అందుకోనున్నాడు. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 12 మందిని ఈసారి పద్మ పురస్కారాలు వరించాయి. అందులో కీరవాణి ఒకరు. కళా రంగం నుంచి ఈ సంగీత దర్శకుడికి నాలుగో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మశ్రీని అందించనున్నారు.
ట్రిపుల్ ఆర్ మూవీలో కీరవాణి కంపోజ్ చేసిన నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్స్ తో పాటు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు కూడా దక్కింది. ప్రతిష్టాత్మక ఆస్కార్స్ కు కూడా నామినేట్ అయింది. అదే సమయంలో ఇప్పుడీ పద్మ శ్రీ అవార్డు కూడా రావడంతో కీరవాణి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఇక ఆస్కార్స్ ను కూడా అతడు అందుకుంటే తెలుగు వారి ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసిన వాడు అవుతాడు. 1990లో తన సినిమా కెరీర్ మొదలుపెట్టిన కీరవాణి ఇప్పటి వరకూ నేషనల్ అవార్డుతోపాటు 8 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 11 నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.
సంబంధిత కథనం
టాపిక్