Brahmamudi March 26th Episode: రాజ్‌ను వెలివేసిన దుగ్గిరాల ఫ్యామిలీ - కొడుకుపై అపర్ణ ఫైర్ - రుద్రాణికి పంచ్
Brahmamudi March 26th Episode: నేటి బ్రహ్మముడి సీరియల్‌లో రాజ్‌ను దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం వెలివేస్తారు. అతడితో కలిసి భోజనం చేయడానికి అంగీకరించరు. ఆకలితో ఉన్న భర్తకు కావ్య భోజనం తీసుకెళుతుండగా అపర్ణ అడ్డుకుంటుంది.
Brahmamudi March 26th Episode: తనకు కొడుకు ఉన్నాడనే నిజాన్ని దాచిపెట్టిన రాజ్‌పై దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం ఎటాక్ మొదలుపెడతారు. అతడిని వెలివేస్తారు. రాజ్‌తో మాటలు బంద్ చేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిన్నర్ చేయడానికి రెడీ అవుతారు. రాజ్ కూడా డిన్నర్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తోండగా తాను చేస్తోన్న తప్పుల్ని దులిపేసుకొని ఎలా వస్తున్నాడో చూడండి అంటూ సెటైర్స్ వేస్తుంది రుద్రాణి. ఆమె పుల్లవిరుపు మాటలతో అపర్ణ మనసు గాయపడుతుంది.
రుద్రాణి సెటైర్స్...
ఎవరితో ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా భోజనం వడ్డించుకుంటాడు రాజ్. గబా గబా తినేయ్ రాజ్ లేదంటే నీ కొడుకు నిద్రలో నుంచి లేస్తాడు. ఎలాగూ తల్లి లేదు కాబట్టి వాడి ఆలాన పాలన చూడాల్సిందే నువ్వే. సవతి తల్లైనా కావ్య నీ కొడుకు బాధ్యతల్ని ఎలా తీసుకుంటుంది చెప్పు అంటూ తన మాటల ప్రవాహాన్ని కొనసాగిస్తుంది రుద్రాణి.
రాజ్ హర్ట్...
రుద్రాణి మాటలను తట్టుకోలేకపోయిన అపర్ణ భోజనం చేయకుండానే డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేస్తుంది. ఆమెను చేయిపట్టి రాజ్ ఆపబోతాడు. కానీ రుద్రాణి ఆగదు. మన కోపాన్ని భోజనం మీద చూపించకూడదని నువ్వే చెప్పావుగా అని తల్లికి సర్ధిచెప్పబోతాడు. రుద్రాణి మాటలతో నా కడుపు నిండిపోయింది.
నీలాంటి కొడుకును కన్నందుకు ఇంకా ఎన్ని అవమానాలు భరించాల్సివస్తుందోనని కడుపు రగిలిపోయి ఆకలి చచ్చిపోయిందని అపర్ణ అంటుంది. నా వల్ల మీరేందుకు తినడం మానేయాలి. నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతానని రాజ్ అంటాడు. డిన్నర్ చేయకుండానే తన రూమ్‌లోకి వెళ్లిపోతాడు.
భోజనం చేయకుండానే...
రాజ్ వెళ్లిపోయిన తర్వాత డిన్నర్ చేయాలని కూర్చుంటుంది అపర్ణ. కానీ బాధను భరించలేకపోతుంది. కన్నీళ్లు రావడంతో అన్నం తినకుండానే డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి వెళ్లిపోతుంది. అపర్ణ వెళ్లిపోగానే సుభాష్, ఇందిరాదేవి కూడా వెళ్లిపోతారు.
ఆకలి భరించలేక ధాన్యలక్ష్మి, రాహుల్ తినడం మొదలుపెడతారు. ఇంట్లో అందరూ పస్తులతో పడుకుంటే నీకు ఆకలేస్తుందా? నీ కడుపు నిండితే చాలా? నీ కడుపుకు అన్నమేగా తింటున్నావు. ఇలా చేయడానికి సిగ్గు లేదా అని ఇన్‌డైరెక్ట్‌గా రుద్రాణిపై ఫైర్ అవుతాడు ప్రకాశం. అతడి మాటలతో ధాన్యలక్ష్మి, రుద్రాణి, రాహుల్ కూడా భోజనం చేయకుండానే వెళ్లిపోతారు.
అపర్ణ వర్సెస్ కావ్య...
రాజ్ డిన్నర్ చేయకుండా వెళ్లడంతో అతడి కోసం రూమ్‌లోకి భోజనం తీసుకెళ్లాలని కావ్య అనుకుంటుంది. కానీ ఆమెను అపర్ణ అడ్డుకుంటుంది. మా అబ్బాయిపై మాకు ప్రేమ లేదని, నీకు మాత్రమే పట్టింపు ఉందని నిరూపించాలని అనుకుంటున్నావా? వాడి మనసులో గుర్తుండిపోవాలని ఇదంతా చేస్తున్నావా రాజ్ కోసం భోజనం తీసుకెళుతోన్న కావ్యపై ఫైర్ అవుతుంది.
మమ్మల్ని చెడ్డవాళ్లను చేయాలని చూస్తున్నావా? కోప్పడుతుంది. మేమంతా శత్రువులం అని వాడికి రుజువు చేయాలని ఇదంతా చేస్తున్నావా కదా అని ఎగిరిపడుతుంది. అందరం కలిసి రాజ్‌ను వెలివేస్తే రాజ్‌ను నిజానిజాలు అడిగేది ఎవరు? ఎవరిమట్టుకు వాళ్లు నిలదీయకుండా పట్టించుకోకుండా రాజ్ కూడా సైలెంట్‌గా ఉండిపోతాడు. నిజం ఆయన మనసులోనే ఉండిపోతుందని అపర్ణతో అంటుంది కావ్య.
నష్టం నాకే ఎక్కువ...
రాజ్ బిడ్డతో తిరిగిరావడం వల్ల అందరి కంటే ఎక్కువగా నష్టం జరిగింది నాకే...భర్త నుంచి నిజం రాబట్టాల్సిన అవసరం నాకే ఉంది. ఇలాంటి పనుల వల్లనైనా రాజ్ నిజం చెప్పే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. దీని వల్ల అతడు మిమ్మల్ని శత్రువులుగా భావిస్తాడని నేను అనుకోవడం లేదని చెబుతుంది. మిమ్మల్ని దోషులను చేయాలనే ఉద్దేశం నాకు లేదని చెప్పి రాజ్ కోసం భోజనం తీసుకొని రూమ్‌లోపలికి వెళుతుంది కావ్య.
రాజ్‌పై సానుభూతి...
భోజనం తీసుకొని కావ్య లోపలికి రాగానే ఎవరికి అని రాజ్ ఆమెను అడుగుతాడు. బాబుకు అంటూ సెటైర్ వేస్తుంది కావ్య. మీకే తెచ్చానని అంటుంది. నాకు ఆకలిగా లేదని రాజ్ అంటాడు. బాబును ఎత్తుకోవాలన్న, ఆడించాలన్న మీకు శక్తి కావాలిగా అని రాజ్‌ను ఆటపట్టిస్తుంది కావ్య. నాకు నీ సానుభూతి అక్కరలేదని రాజ్ కావ్యతో కోపంగా అంటాడు.
ఓ బిడ్డను తీసుకొచ్చి వీడే నా కొడుకు అని చెప్పిన ఏ మగాడిపైనైనా పెళ్లానికి సానుభూతి ఉంటుందా? తప్పు చేసిన మీరే దర్జాగా తిరుగుతున్నారు? వెలగబెట్టిన మగ అహంకారం చాలు. నోరుమూసుకొని భోజనం చేయండి అంటూ రాజ్‌పై సీరియస్ అవుతుంది కావ్య. కావ్య ప్రశ్నలకు ఏం బదులు చెప్పాలో తెలియక రాజ్ సెలైంట్‌గా ఉండిపోతాడు. ఆమె చెప్పినట్లుగానే తినడం మొదలుపెడతాడు.
నిజం ఎప్పుడో చెప్పాను...
భోజనం చేయడం ముగించగానే...ఇంట్లో వాళ్లను ఎందుకు బాధపెడుతున్నారో, నిజాలేమిటో చెప్పమని రాజ్‌ను నిలదీస్తుంది కావ్య. మీ వల్ల ఈ రోజు ఇంట్లో వాళ్లు ఎవరూ భోజనం చేయలేదని కావ్య అంటుంది. నాకు ఇంకో దారి లేదని, నా బాధ్యతల్ని వదిలేసుకోలేనని కావ్యకు బదులిస్తాడు రాజ్.
బాబును ఇంటికి తీసుకొచ్చినప్పుడే నిజం ఏమిటో చెప్పాను. నిజానికి రెండు ముఖాలు ఉండవు అని రాజ్ అంటాడు. పోనీ ఈ బాబుకు తల్లి ఎవరో చెప్పమని రాజ్‌ను గట్టిగా అడుగుతుంది కావ్య. ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నాకు నిద్రోస్తుందని రాజ్ అంటాడు. గుడ్‌బై చెప్పి బెడ్‌పై పడుకుంటాడు. నిజం ఎన్ని రోజులు నిద్రపోతుందో తాను చూస్తానని కావ్య అంటుంది.
రాహుల్‌కు పంచ్...
ఆకలి బాధను తట్టుకోలేకపోతారు రుద్రాణి, ధాన్యలక్ష్మి, అనామిక. వారి కోసం సీక్రెట్‌గా రాహుల్ ఫుడ్ ఆర్డర్ పెడతాడు. ఫుడ్ డెలివరీ బాయ్ ఇంటికి వస్తాడు. ఆ ఫుడ్ తీసుకోవడానికి నలుగురు బయటకు వస్తారు. కానీ ఇంటి బయట ఫోన్ మాట్లాడుతూ ప్రకాశం కనిపిస్తాడు.
ఆ డెలివరీ బాయ్ డైరెక్ట్‌గా ప్రకాశం దగ్గరకు వస్తాడు.దాంతో ధాన్యలక్ష్మి, రుద్రాణి, రాహుల్, అనామిక కంగారు పడతారు. తమను దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ వెలివేయడం ఖాయమని భయపడతారు. రాహుల్ ఫుడ్ ఆర్డర్ చేశాడని ప్రకాశంతో అంటాడు డెలివరీ బాయ్. తన మతిమరుపు కారణంగా రాహుల్ అనే పేరు గల వాళ్లు ఇంట్లో ఎవరూ లేరని ప్రకాశం అంటాడు.
డెలివరీ బాయ్ ఫుడ్ మిస్సయిన ఇంట్లో ఉన్న భోజనం తినాలని ధాన్యలక్ష్మి ప్లాన్ చేస్తుంది. కానీ ఇంట్లోని ఫుడ్ మొత్తం ప్యాక్ చేసి ఆ డెలివరీ బాయ్‌కి ఇస్తాడు ప్రకాశం. అది చూసి నలుగురు షాకవుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.