Brahmamudi August 15th Episode: కావ్య కోసం రాజ్‌ను ఎదురించిన అప‌ర్ణ - ధాన్య‌ల‌క్ష్మి పంచాయితీ - దుగ్గిరాల ఆస్తి ముక్క‌లు-brahmamudi august 15th episode aparna supports kaavya on kalyan issue brahmamudi serial today episode star maa ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi August 15th Episode: కావ్య కోసం రాజ్‌ను ఎదురించిన అప‌ర్ణ - ధాన్య‌ల‌క్ష్మి పంచాయితీ - దుగ్గిరాల ఆస్తి ముక్క‌లు

Brahmamudi August 15th Episode: కావ్య కోసం రాజ్‌ను ఎదురించిన అప‌ర్ణ - ధాన్య‌ల‌క్ష్మి పంచాయితీ - దుగ్గిరాల ఆస్తి ముక్క‌లు

Nelki Naresh Kumar HT Telugu
Aug 15, 2024 07:51 AM IST

Brahmamudi August 15th Episode: బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ఆగ‌స్ట్ 15 ఎపిసోడ్‌లో క‌ళ్యాణ్, అప్పు తిరిగి ఇంటికి రావ‌డానికి ఒప్పుకోక‌పోవ‌డంతో ధాన్య‌ల‌క్ష్మి ర‌చ్చ ర‌చ్చ చేస్తుంది. ఆస్తిని ముక్క‌లు చేయాల్సిందేన‌ని ప‌ట్టుప‌డుతుంది.

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ఆగ‌స్ట్ 15 ఎపిసోడ్‌
బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ఆగ‌స్ట్ 15 ఎపిసోడ్‌

Brahmamudi August 15th Episode: త‌ల‌దాచుకునేందుకు స‌రైన షెల్ట‌ర్ లేకుండా ఇబ్బంది ప‌డుతోన్న క‌ళ్యాణ్, అప్పుల‌కు బంటి రూమ్‌లో ఆశ్ర‌యం క‌ల్పిస్తుంది కావ్య‌. తానే ఈ ప్లాన్ చేసిన విష‌యాన్ని వారికి తెలియ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతుంది. మ‌రోవైపు అప్పు, క‌ళ్యాణ్ ఇంట్లో అడుగుపెట్ట‌డానికి వీలు లేద‌న్న ధాన్య‌ల‌క్ష్మి...రుద్రాణి ఇచ్చిన ఐడియాతో స‌డెన్‌గా త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంటుంది.

అప్పు, క‌ళ్యాణ్‌ల‌ను ఇంటికి తీసుకుర‌మ్మ‌ని రాజ్‌ను కోరుతుంది ధాన్య‌ల‌క్ష్మి. క‌ళ్యాణ్ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డానికి సిద్ధ‌మైన రాజ్‌...కావ్య‌ను కూడా ర‌మ్మ‌ని పిలుస్తాడు. కానీ కావ్య రాన‌ని స‌మాధాన‌మిస్తుంది. ఆమె స‌మాధానంతో అంద‌రూ షాక‌వుతారు.

స్వ‌ప్న స‌పోర్ట్‌...

అప్పు తిరిగి ఇంట్లో అడుగుపెట్టిన త‌ర్వాత ఏ స‌మ‌స్య వ‌చ్చినా కావ్య‌నే తీసుకొచ్చింద‌ని అంద‌రూ త‌న‌ను త‌ప్పుప‌డ‌తార‌ని, అందుకే కావ్య ...రాజ్ వెంట వెళ్ల‌న‌ని చెబుతోంద‌ని చెల్లెలికి స‌పోర్ట్‌గా స్వ‌ప్న మాట్లాడుతుంది. క‌ళ్యాణ్‌తో పాటు అప్పు క‌ష్టాలు ప‌డుతోంద‌ని, ఇంటికి వ‌స్తే సంతోషంగా ఉంటారు క‌దా అని భార్య‌ను క‌న్వీన్స్ చేయ‌బోతాడు రాజ్‌.

ధాన్య‌ల‌క్ష్మి త‌న నిర్ణ‌యం మార్చుకోవ‌డం వెనుక ఏదో గూడుపుఠానీ త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని కావ్య అనుమాన‌ప‌డుతుంది. తాళి చేతికి ఇచ్చి క‌ళ్యాణ్‌ను ఏ ధైర్యంతో క‌ట్ట‌మ‌న్నావో అదే ధైర్యంతో అత‌డిని ఇంటికి ర‌మ్మ‌న‌మ‌ని అడుగు...అంతేకానీ రాన‌న్న వాళ్ల‌ను ఎందుకు బ‌తిమిలాడుతావు అని కావ్య‌పై సెటైర్లు వేస్తుంది ధాన్య‌ల‌క్ష్మి.

కొడుకుకు అప‌ర్ణ క్లాస్‌...

ఎందుకు నా వెంట రావో ఇప్పుడే చెప్పాల‌ని కావ్య‌ను ప‌ట్టుప‌డ‌తాడు రాజ్‌. కోడ‌లికి అప‌ర్ణ అండ‌గా మాట్లాడుతుంది. ఇష్టం లేద‌ని చెప్పిన ఎందుకుకావ్య‌ను బ‌ల‌వంతం చేస్తావు...త‌న నిర్ణ‌యాలు తాను తీసుకునే స్వేచ్ఛ‌కూడా ఆమెకు లేదా...రాన‌ని చెప్పిన ఎందుకు గుచ్చిగుచ్చి అడుగుతున్నావ‌ని కొడుకుకు క్లాస్ ఇస్తుంది అప‌ర్ణ‌. నిన్ను మాత్ర‌మే క‌ళ్యాణ్ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌మ‌ని పిన్ని చెప్పింద‌ని, కావ్య‌ను వ‌దిలిపెట్టి నువ్వే ఒక్క‌డికే వెళ్ల‌మ‌ని అప‌ర్ణ అంటుంది. కావ్య‌ను విల‌న్ చేయాల‌నే త‌న ప్లాన్ వ‌ర్క‌వుట్ కావ‌డంతో ధాన్య‌ల‌క్ష్మి సంతోష‌ప‌డుతుంది.

క‌ళ్యాణ్ క‌ష్టం...

బంటి రూమ్ ఏ మాత్రం క్లీన్ లేక‌పోవ‌డంతో అత‌డిని ఏడిపిస్తుంది అప్పు. నువ్వు ఎప్పుడైనా ఇంట్లో ఒక్క ప‌నైనా చేశావా? మొత్తం ప‌నుల‌న్నీ మేమే చేసేవాళ్లం క‌దా అని బంటి స‌మాధాన‌మిస్తాడు. ఇంటి ప‌నుల‌న్నీ నేనే చేసేదానిని అని అప్పు చెప్పింది క‌దా అని క‌ళ్యాణ్ అనుమానంగా అడుగుతాడు. అక్క బ‌య‌టి ప‌నులు మాత్ర‌మే చూసుకుంటుంది...ఇంటి ప‌నులు కాద‌ని బంటి అంటాడు.

క‌ళ్యాణ్, అప్పు క‌లిసి రూమ్ మొత్తం క్లీన్ చేస్తారు. నువ్వు ఏ క‌ష్టం ఎర‌గ‌కుండా రాకుమారిడిలా పెరిగావ‌ని, నువ్వు ఈ ప‌నులు చేయ‌లేవ‌ని అప్పు చెప్పిన విన‌కుండా రూమ్‌ను స‌ర్ధే ప‌నుల్లో అప్పుకు సాయ‌ప‌డ‌తాడు క‌ళ్యాణ్.

అప‌ర్ణ ఆలోచ‌న‌లు...

కిచెన్‌లో పాలు పొంగిపోతున్న ప‌ట్టించుకోకుండా దీర్ఘ ఆలోచ‌న‌ల్లో మునిగిపోతుంది అప‌ర్ణ‌. ఇందిరాదేవి పిలుపుతో ఆలోచ‌న‌ల నుంచి తేరుకుంటుంది. క‌ళ్యాణ్ విష‌యంలో కావ్య ప్ర‌వ‌ర్త‌న అంతుప‌ట్ట‌డం లేద‌ని ఇందిరాదేవితో అంటుంది అప‌ర్ణ‌. ఇదివ‌ర‌కు క‌ళ్యాణ్‌ను ఎవ‌రైనా ఏమైనా ఒక్క మాట అన్న ప‌డ‌నిచ్చేది కాదు. మ‌రిది గొప్ప‌వాడంటూ చెప్పేది. కానీ అప్పును పెళ్లి చేసుకున్న త‌ర్వాత క‌ళ్యాణ్‌ను ఎందుకు దూరం పెడుతుందో అర్థం కావ‌డం లేద‌ని ఇందిరాదేవితో చెబుతుంది అప‌ర్ణ‌.

కావ్య ఏం చేస్తుందో అర్థం కాన‌ప్పుడు ఆమెకు ఎలా స‌పోర్ట్ చేశావు...కొడుకును ఎందుకు ఎదురించావ‌ని అప‌ర్ణ‌ను అడుగుతుంది ఇందిరాదేవి. కావ్య ఏం చేసిన ఇంటి మంచి కోస‌మే చేస్తుంద‌ని స‌మ‌ర్థించాన‌ని అప‌ర్ణ బ‌దులిస్తుంది. . కావ్య అకార‌ణంగా ఎవ‌రిని ద్వేషించ‌ద‌ని, కావ్య ప్ర‌వ‌ర్త‌న వెనుక ఏదో బ‌ల‌మైన కార‌ణం ఉండి ఉంటుంద‌ని ఇందిరాదేవి కూడా అంటుంది. కోడ‌లికి నువ్వు అండ‌గా నిల‌వ‌డం బాగుంద‌ని అప‌ర్ణ‌ను ప్ర‌శంసిస్తుంది.

అప్పు జాబ్‌...

ఇళ్లు గ‌డ‌వ‌డానికి అప్పు మ‌ళ్లీ పిజ్జా డెలివ‌రీ ఉద్యోగానికి వెళ్ల‌డానికి సిద్ధ‌ప‌డుతుంది. కానీ క‌ళ్యాణ్ వ‌ద్ద‌ని అంటాడు. తాను జాబ్ చేసి అప్పును పోషిస్తాన‌ని అంటాడు. అప్పుడే అప్పు ఫ్రెండ్స్ ఇంటికి కావాల్సిన స‌రుకుల‌ను తీసుకొని వ‌స్తారు. త‌మ శ‌క్తికి మించి స్నేహితులు ఇచ్చిన వ‌స్తువులు చూసి అప్పు, క‌ళ్యాణ్ సంతోష‌ప‌డ‌తారు.

రాజ్ ఎంట్రీ...

అప్పుడే రాజ్ అక్క‌డికి వ‌స్తాడు. రాజ్‌ను బిందెపై కూర్చొమ‌ని క‌ళ్యాణ్ అంటాడు. కానీ కూర్చోవ‌డం రాక రాజ్ కింద‌ప‌డ‌బోతాడు. చిన్న రూమ్‌లో క‌ష్టాలు ప‌డుతూ ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని, మీరు ఇంటికి తిరిగి రావ‌డానికి పిన్ని ఒప్పుకుంద‌ని, ఇప్పుడే బ‌య‌లుదేరుదామ‌ని క‌ళ్యాణ్‌తో రాజ్ అంటాడు.

కానీ క‌ళ్యాణ్ మాత్రం రాజ్ మాట‌ను కాద‌ని అంటాడు. ఇంటికి రాన‌ని అంటాడు. మా అమ్మ నా మీద ప్రేమ‌తో నా కోసం అప్పును ఇంటికి రావ‌డానికి ఒప్పుకొని ఉంటుంద‌ని రాజ్‌తో చెబుతాడు క‌ళ్యాణ్. ముందు న‌న్ను ఒక్క‌డినే తీసుకుర‌మ్మ‌ని చెప్పి ఉంటుంది...మీరంతా కుద‌ర‌ద‌ని చెప్పేస‌రికి దిగొచ్చి...ఇద్ద‌రిని తీసుకుర‌మ్మ‌ని అని ఉంటుంద‌ని ఇంట్లో ఏం జ‌రిగిందో క‌ళ్యాణ్ క‌రెక్ట్‌గా ఊహించి చెబుతాడు.

ఎప్ప‌టికీ కోడ‌లిగా ఒప్పుకోదు...

మా అమ్మ అప్పును ఎప్ప‌టికీ కోడ‌లిగా ఒప్పుకోద‌ని, ఆమెకు మొద‌టి నుంచి అప్పు అంటే ఇష్టం లేద‌ని రాజ్‌తో అంటాడు క‌ళ్యాణ్‌. అయినా విన‌కుండా ఇవ‌న్నీ తాత్కాలికం అంటూ క‌ళ్యాణ్‌కు రాజ్ స‌ర్ధిచెప్ప‌బోతాడు. ఇష్టం లేని కోడ‌లు ఇంట్లో అడుగుపెడితే ఎలాంటి మ‌ర్యాద‌లు ఉంటాయో తాను క‌ళ్లారా చూశాన‌ని క‌ళ్యాణ్ అంటాడు. కావ్య వ‌దిన‌, స్వ‌ప్న ఎన్ని క‌ష్టాలు ప‌డ్డారో నాకు తెలుసున‌ని రాజ్‌కు చెబుతాడు క‌ళ్యాణ్.

అప్పును క‌ష్ట‌పెడితే మేము చూస్తూ ఊరుకోమ‌ని రాజ్ అంటాడు. అంద‌రూ పంచాయితీల‌కు హాజ‌రుకావ‌డం త‌ప్ప ఏం చేయ‌లేర‌ని, మా అమ్మ రుద్రాణి అత్త కంటే ఎక్కువ‌గా వాదిస్తుంద‌ని, వ‌దిన‌లా అప్పుకు ఓపిక‌, స‌హ‌నం త‌క్కువ అని, ఆ మాట‌లు ప‌డ‌లేద‌ని రాజ్‌కు బ‌దులిస్తాడు క‌ళ్యాణ్.

అంద‌రికి నిరూపిస్తాం...

ఇప్పుడు నీతో మాత్రం ఇంటికి రాలేమ‌ని రాజ్‌తో అంటాడు క‌ళ్యాణ్. ఎప్ప‌టికైనా వ‌స్తాం...కానీ ఎప్ప‌టికీ ఉండిపోవ‌డానికి మాత్రం రామ‌ని చెబుతాడు. వ‌దిన‌తో స‌హా అంద‌రూ నేను అప్పును పెళ్లి చేసుకోవ‌డం క‌రెక్ట్ కాద‌ని అనుకుంటున్నారు...మేము ఏ త‌ప్పు చేయ‌లేద‌ని అంద‌రికి నిరూపిస్తాం అని క‌ళ్యాణ్ చెబుతాడు. మా కాళ్ల మీద మేము నిల‌బ‌డిన రోజు త‌ప్ప‌కుండా ఇంటికి వ‌స్తామ‌ని క‌ళ్యాణ్ అంటాడు.

కావ్య‌ను త‌ప్పుప‌ట్టిన రాజ్‌...

ఇవ‌న్నీ నీ మాట‌లు కాదు...క‌ళావ‌తి నిన్ను ఇలా మార్చేసింద‌ని కావ్య‌ను త‌ప్పుప‌డ‌తాడు రాజ్‌. ఇందులో కావ్య త‌ప్పేం లేద‌ని, వ‌దిన వ‌ల్లే ప్ర‌పంచం అంటే ఏమిటో తెలిసింద‌ని క‌ళ్యాణ్ అంటాడు. క‌ళ్యాణ్ మాట విన‌క‌పోవ‌డంతో అప్పు ను క‌న్వీన్స్ చేయాల‌ని చూస్తాడు రాజ్‌. పెళ్లి చేసుకున్న త‌ర్వాత భార్య‌భ‌ర్త‌ల‌కు వేర్వేరు నిర్ణ‌యాలు ఉండ‌వ‌ని అప్పు బ‌దులిస్తాడు.

ఒంట‌రిగా రాజ్‌...

క‌ళ్యాణ్, అప్పుల‌ను తీసుకొస్తాన‌ని వెళ్లిన రాజ్ ఒంట‌రిగా తిరిగిరావ‌డం చూసి దుగ్గిరాల ఫ్యామిలీ మెంబ‌ర్స్ షాక‌వుతారు. రాజ్ రాన‌న్నాడా? అప్పు రానివ్వ‌లేదా అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తారు. కేవ‌లం క‌ళ్యాణ్ కోస‌మే నువ్వు అప్పును ఇంట్లోకి రావ‌డానికి ఒప్పుకున్నావ‌ని క‌ళ్యాణ్ అనుకుంటున్నాడ‌ని రాజ్ బ‌దులిస్తాడు.

ఆస్తి ముక్క‌లు...

రాజ్ ఆఫీస్‌కు బ‌య‌లుదేర‌బోతుండ‌గా ధాన్య‌ల‌క్ష్మి అడ్డుకుంటుంది. త‌న కొడుకు తిన‌డానికి తిండ‌లేకుండా అల్లాడుతుంటే రాజ్ మాత్రం రాజ‌భోగాలు అనుభ‌విస్తున్నాడ‌ని గొడ‌వ చేస్తుంది. క‌ళ్యాణ్‌కు న్యాయం జ‌ర‌గాలంటే ఆస్తిని ముక్క‌లు చేయాల‌ని చెబుతుంది. క‌ళ్యాణ్ తిరిగి ఇంటికి వ‌చ్చే వ‌ర‌కు రాజ్ ఆఫీస్ బాధ్య‌త‌ల‌కు దూరంగా ఉండాల‌ని సీతారామ‌య్య తీర్పు ఇస్తాడు. అక్క‌డితో నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ముగిసింది.

Whats_app_banner