Brahmamudi March 13th Episode: బ్రహ్మముడి సీరియల్ - విడాకుల పేపర్స్‌పై కావ్య సంతకం - కనకంతో ధాన్యలక్ష్మి గొడవ
Brahmamudi March 13th Episode: కావ్య చేత విడాకుల పేపర్స్‌పై బలవంతంగా సంతకం పెట్టిస్తుంది ఇందిరాదేవి. ఆ పేపర్స్‌ను రాజ్ దగ్గరకు కావ్య తీసుకుళెతుంది. తనకు విడాకుల కావాలని రాజ్‌తో అంటుంది కావ్య. ఆ తర్వాత నేటి బ్రహ్మముడి సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Brahmamudi March 13th Episode: రాజ్‌లో మార్పు తీసుకొచ్చి, అతడి మనసులో తన పట్ల ఉన్న ప్రేమను బయటపెట్టేందుకు కావ్య వేసిన ప్లాన్ రివర్స్ అవుతుంది. బావతో సంతోషంగా అమెరికా వెళ్లిపోయి కొత్త జీవితాన్ని మొదలుపెట్టమని కావ్యకు పాస్‌పోర్ట్ ఇస్తాడు రాజ్. అతడి ట్విస్ట్‌కు కావ్య షాకవుతుంది. రాజ్‌ను దారిలోకి తీసుకురావడానికి చివరి అస్త్రం విడాకులను ప్రయోగించాలని ఇందిరాదేవి ఫిక్సవుతుంది.
అంతరాత్మ కన్నీళ్లు...
కావ్యను అమెరికా పంపించాలని రాజ్ నిర్ణయం తీసుకోవడంతో అతడి అంతరాత్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నాశనం అయిపోతావని రాజ్‌పై శాపాలు పెడుతుంది. జీవితంలో కోరుకున్నవి అన్ని జరగవు. జరిగేవన్నీ కోరుకున్నవి కావు. నేను కోరుకోనిది నాకేందుకు అంటూ అంతరాత్మతో ఫిలాసఫీ మాట్లాడుతాడు రాజ్.
అతడి ఫిలాసఫీలను అంతరాత్మ తట్టుకోలేకపోతుంది. జీవితాంతం ఆడగాలి లేకుండా నీ శరీరంలో బంధీగా బతకడం తన వల్ల కాదని అంతరాత్మ మొర పెట్టుకంటుంది. అందమైన పెళ్లాన్ని అమెరికా పంపించి నువ్వు ఏం పీకుతావని నిలదీస్తుంది. అంతరాత్మకు సమాధానం చెప్పకుండా రాజ్ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ధాన్యలక్ష్మి మాటల యుద్ధం...
కనకం ఇంటికి కోపంగా వస్తుంది ధాన్యలక్ష్మి. మీరు ఆడపిల్లలను కన్నది మా ఇంటి మగ పిల్లలను వలలో వేసుకోవడానికా అంటూ వచ్చి రావడంతోనే కనకం, కృష్ణమూర్తిలపై ఫైర్ అవుతుంది. మేము ఏం తప్పు చేశామని ధాన్యలక్ష్మిని అడుగుతాడు కృష్ణమూర్తి. ఒక్కసారి బయటకు వచ్చి చూస్తే మీ చిన్న కూతురు ఆడే బాగోతం కనిపిస్తుందని కోపంగా ధాన్యలక్ష్మి బదులిస్తుంది.
మా అప్పు అంత పొరపాటు ఏం చేసింది ధాన్యలక్ష్మితో అంటాడు కృష్ణమూర్తి. ఏం చేస్తుందో మీకు తెలియదా...మీకు తెలియకుండానే ఇదంతా జరుగుతుందా అంటూ నానా మాటలు అంటుంది ధాన్యలక్ష్మి. మానం, మర్యాదలేని మీ ఇంటికి రావాల్సిన ఖర్మ పట్టిందని అవమానిస్తుంది.
కళ్యాణ్‌కు దగ్గరైన అప్పు...
నా మొగుడితో నీ కూతురు ఎందుకు తిరుగుతుంది కనకం, కృష్ణమూర్తిలను ప్రశ్నిస్తుంది అనామిక. కళ్యాణ్ మంచితనాన్ని ఆసరాగా చేసుకొని అతడికి అప్పు మళ్లీ దగ్గరైందని, నా మీద నుంచి కళ్యాణ్ మనసు మళ్లించి తన వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నిస్తుందని నిందలు వేస్తుంది.
అలాంటి ఆలోచన అప్పుకు ఉంటే మీ పెళ్లి జరిగేది కాదని అనామికతో అంటాడు కృష్ణమూర్తి. అప్పు మీ అబ్బాయితో కనబడటానికి, కలిసి తిరగడానికి తేడా ఉందని గ్రహిస్తే చాలని ధాన్యలక్ష్మికి అర్థం అయ్యేలా చెప్పాలని చూస్తుంది కనకం.
కానీ ధాన్యలక్ష్మి ఆమె మాటలను అపార్థం చేసుకుంటుంది. ముసుగు వేసి ఒకదానిని, ముసుగు తీసి మరోదానిని మా ఇంటి కోడళ్లుగా పంపించావు. ఇప్పుడు నా కొడుకును అమాయకుడిని మూడో కూతురిని మా ఇంటికి పంపించి అతడి కాపురం కూల్చాలని చూస్తున్నావా అంటూ కోపంగా మాట్లాడుతుంది. ఆమె మాటలను కనకం సహించలేకపోతుంది. నా కూతురిని అవమానించడం ఆపేస్తే మంచిదని బదులిస్తుంది. కానీ వాళ్ల మాటలను అనామిక, ధాన్యలక్ష్మి పట్టించుకోరు.
కళ్యాణ్‌ను పెళ్లి చేసుకోవాలని అప్పు ఆశ...
కళ్యాణ్‌ను పెళ్లి చేసుకోవాలని అప్పు ఆశపడుతుందని, అది ఈ జన్మలో జరగదని అనామిక అంటుంది. ఇక నుంచి కల్యాణ్‌తో అప్పు కనిపిస్తే వీధిలోకి వచ్చి గొడవ చేస్తానని కనకం, కృష్ణమూర్తిలకు వార్నింగ్ ఇస్తుంది ధాన్యలక్ష్మి. మీది ఒక బతుకు అని మీరు అనుకుంటే చాలదు. అందరు అనుకోవాలని హెచ్చరిస్తుంది. మీరు మీ కొడుకు బుద్ది చెప్పండి. సంస్కారం లేని మనుషులం మనం, సంస్కారం ఉన్న వాళ్లతో తిరగొద్దని చెప్పండని ధాన్యలక్ష్మికి ధీటుగా సమాధానం ఇస్తుంది కనకం.
కనకం రివర్స్ ఎటాక్...
ఇంకోసారి మా ఇంటికి వచ్చి గొడవ చేస్తే నేను మీ ఇంటికి వచ్చి మీ అత్తగారిని, మామగారిని నిలదీస్తానని ధాన్యలక్ష్మిని బెదిరిస్తుంది కనకం. నీ కూతురును అదుపులోకి పెట్టుకోకపోతే నీ కుటుంబాన్ని వీధిలోకి లాగుతానని ధాన్యలక్ష్మి అంటుంది. వీధిలో ఎవరూ నా ముందు మాట్లాడతారో మాట్లాడమను... నేను ఒక్కదాన్ని చాలు తేల్చుకోవడానికి కనకం పంచ్ ఇస్తుంది. కనకం ధాటికి బయపడి ఇద్దరు ధాన్యలక్ష్మి, అనామిక అక్కడి నుంచి వెళ్లిపోతారు.
కావ్య కన్నీళ్లు...
కావ్యకు విడాకుల పత్రాలు తెచ్చి ఇస్తుంది ఇందిరాదేవి. ఆ పేపర్స్ చూసి కావ్య షాకవుతుంది. నిన్ను, రాజ్‌ను కలపడానికే విడాకుల పాత్రలు నీకు ఇస్తున్నానని కావ్యతో అంటుంది ఇందిరాదేవి. వాటిపై సంతకం చేయమని చెబుతుంది. కలపడానికి ఈ విడిపోయే పత్రాలు ఎందుకు అని కావ్య అడుగుతుంది. కలిసి ఉన్నప్పుడు తెలియని విలువ విడిపోతున్నామని తెలిసినప్పుడు అర్థమవుతుందని, ఈ చివరి అస్త్రం రాజ్‌లో తప్పకుండా మార్పు తీసుకొస్తుందని ఇందిరాదేవి అంటుంది.
కావ్య నిరాకరణ...
విడాకుల నాటకం ఆడటానికి కావ్య ఒప్పుకోదు. ఈ ప్రయోగం వికటిస్తే తన కాపురం నిలబెట్టుకోవడానికి ఇంకో అవకాశం కూడా ఉండదని భయపడుతుంది. నువ్వు భయపడొద్దు నేను ఉన్నానని కావ్యకు అభయమిస్తుంది ఇందిరాదేవి.
రెండు మనసులను కలపడానికి పెద్దరికం పనికిరాదని, ఏ బెదిరింపులు మనసులోని ప్రేమను బయటపెట్టలేవని కావ్య అంటుంది. విడాకుల పత్రాలపై రాజ్ సంతకం పెడితే తన జీవితం మొత్తం అల్లకల్లోలం అవుతుందని కావ్య ఎమోషనల్ అవుతుంది. విడిపోతాను, విడాకుల పత్రాలపై సంతకం పెట్టమని భర్తను అడగలేను. అంత ధైర్యం నాకు లేదని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
రాజ్ మనసులో ప్రేమ...
నీ నుంచి విడిపోవాలని అనుకున్న రాజ్ ఏ రోజు ఆ మాట ఎవరితో ఎందుకు చెప్పలేదు. నువ్వు నీ బావ పుట్టింటికి వెళితే రాజ్ మీ వెంట ఎందుకొచ్చాడు. నువ్వు, మీ బావ సంతోషంగా ఉంటే రాజ్ ఎందుకు జెలసీగా ఫీలవుతున్నాడు. అదంతా ప్రేమ. అతడి ప్రేమను ఓ మాయ కమ్మేసిందని, ఆ మాయ తొలగిపోతే రాజ్ అంత గొప్ప ప్రేమికుడు, భర్త ఎవరు ఉండరని ఇందిరాదేవి అంటుంది.
ఇందిరాదేవి ఎంత చెప్పిన కావ్య మాత్రం విడాకుల పేపర్స్‌పై తాను సంతకం చేయలేనని అంటుంది. నిజంగానే మా బావను నేను పెళ్లి చేసుకుంటానని రాజ్ భ్రమపడితే తన వ్యక్తిత్వంపై మచ్చపడుతుందని కావ్య ఎమోషనల్ అవుతుంది. ఇందిరాదేవికి క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
అప్పుకు క్లాస్...
కళ్యాణ్‌ను తీసుకొని అప్పు ఇంటికొస్తుంది. వారిపై కనకం, కృష్ణమూర్తి ఫైర్ అవుతారు. నీకు పెళ్లైంది. అప్పు పెళ్లి కావాల్సింది. ఇప్పుడు కూడా మీరిద్దరు కలిసి తిరిగితే చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారని కనకం చెబుతుంది. మా స్నేహ బంధాన్ని తప్పు పడుతున్న వారు ఎవరు అని కళ్యాణ్ ఎంత అడిగినా కనకం, కృష్ణమూర్తి మాత్రం సమాధానం చెప్పరు. మా స్నేహాన్ని గురించి నీచంగా మాట్లాడింది ఎవరో చెప్పేవరకు ఇక్కడి నుంచి కదలనని కళ్యాణ్ అంటాడు.
విడాకుల పేపర్స్‌పై సంతకం...
ఇందిరాదేవి బలవంతంతో విడాకుల పేపర్స్‌పై కన్నీళ్లతో సంతకం చేస్తుంది కావ్య. ఆ పేపర్స్ తీసుకొని రాజ్ దగ్గరక వెళుతుంది. కావ్య చేతిలోని పేపర్స్ చూసి ఏం కావాలని రాజ్ అడుగుతాడు. విడాకులు అని కావ్య బదులు ఇస్తుంది. ఆమె మాటలతో రాజ్ షాకవుతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.