Brahmamudi February 14th Episode: కావ్యను దొంగ అన్నందుకు రాజ్ ఫైర్ - ధాన్యలక్ష్మి రాద్ధాంతం - అపర్ణ మౌనం
Brahmamudi February 14th Episode: నేటి బ్రహ్మముడి సీరియల్‌లో లాకర్‌లోని డబ్బును కావ్య దొంగతనం చేసి తన పుట్టింటికి చేరవేసిందని ధాన్యలక్ష్మి నిందవేస్తుంది. తన భార్యను దొంగ అంటే ఊరుకోనని రాజ్ అంటాడు. కావ్యను అడిగే హక్కు, అధికారం ఈ ఇంట్లో ఎవరికి లేదని చెబుతాడు.
Brahmamudi February 14th Episode: శ్వేతను తాను పెళ్లిచేసుకోబోతున్నట్లు కావ్యతో చెబుతాడు రాజ్. భార్యగా నిన్ను ఎప్పటికీ అంగీకరించనని, నా జీవితంలో నీకు స్థానం లేదని కావ్యతో అంటాడు. రాజ్ మాటలతో కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరోవైపు లాకర్‌లో ఉన్న రెండు లక్షలు కొట్టేసి ఆ దొంగతనాన్ని కావ్యపై నెట్టేయాలని అనుకుంటారు రుద్రాణి, అనామిక. అపర్ణ మాత్రం కోడలికి సపోర్ట్ చేస్తుంది.
కావ్య వచ్చిన తర్వాతే నిజానిజాలు ఏమిటో బయటపడతాయని అంటుంది. ఆఫీస్ నుంచి తిరిగివస్తోండగా కావ్య కారు పాడైపోతుంది. రాజ్ ఆమెకు లిఫ్ట్ ఇస్తాడు. తొలుత రాజ్ కారు ఎక్కనని బెట్టు చేస్తుంది కావ్య. రాజ్‌తో వాదించి చివరకు కారు ఎక్కుతుంది. తాను పుట్టింటికి వెళ్లబోతున్నట్లు చెబుతుంది. ఆమెను పుట్టింటికి తీసుకొస్తాడు రాజ్.
రాజ్‌పై అప్పు సెటైర్స్...
కూతురు, అల్లుడిని చూడగానే కనకం, కృష్ణమూర్తి ఆనందంగా ఫీలవుతారు. రాజ్‌కు గౌరవమర్యాదలు చేస్తారు. ఆయనే కాదు నేను కూడా వచ్చానని కోపంగా తల్లిదండ్రులతో అంటుంది కావ్య. లోపలికి రమ్మని కనకం పిలిచినా తాను రానని అంటాడు రాజ్. తాను వెళ్లాలని చెబుతాడు. ఉండాలి అనుకునేవాళ్లు ఎలా ఉండాలో ఆలోచిస్తారు. వెళ్లిపోవాలని అనుకునేవాళ్లు వెళ్లడానికి సాకులు వెతుకుతారు అని రాజ్‌పై ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్ వేస్తుంది కావ్య.
అర్థం చేసుకునే మనసు లేకపోతే అర్థం అయినా కొందరు అర్థం కానట్లే ఉంటారని కోపంగా చెప్పి ఇంటి లోపలికి వెళుతుంది. మీ మధ్య ఏదైనా గొడవ జరిగిందా అని రాజ్‌ను అడుగుతాడు కృష్ణమూర్తి. మీ అమ్మాయి గొడవ చేయకపోతే ఆశ్చర్యం కానీ చేస్తే ఆశ్చర్యం ఏముందని రాజ్ బదులిస్తాడు. మా అక్క గొడవ చేస్తుంది...కానీ అది ఎదుటివాళ్లు చేసే పనిమీదే ఆధారపడి ఉంటుందని అక్కడే ఉన్న అప్పు రాజ్‌పై పంచ్ వేస్తుంది.
భర్త బాధ్యతే...
కావ్య ఏదైనా తప్పు చేసిందా అని రాజ్‌ను అడుగుతాడు కృష్ణమూర్తి. అదేం లేదని రాజ్ బదులిస్తాడు. కానీ కావ్య ఎందుకు అలా ఉందో తెలియడం లేదని అబద్ధం ఆడుతాడు. మొగుడు మీరే అయినప్పుడు తను అలా ఎందుకు ఉందో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే కదా అని అప్పు కఠినంగా రాజ్‌తో అంటుంది. ఆమె మాటలతో కోపంగా రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
కావ్య ఎమోషనల్...
రాజ్, కావ్య తిక్కతిక్కగా సమాధానాలు చెప్పడంతో అసలు ఏం జరిగిందో తెలియక కనకం, కృష్ణమూర్తి కంగారు పడతారు. కావ్య దగ్గరకు వచ్చి ఏం జరిగిందని అడుగుతారు. తల్లిదండ్రులు ఆ ప్రశ్న అడగ్గానే కన్నీళ్లతో కావ్య కుప్పకూలిపోతుంది. రాజ్ మరో అమ్మాయితో తిరుగుతున్నాడని, ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడనే నిజాన్ని తల్లిదండ్రులతో చెబుతుంది కావ్య.
ఇంట్లో ఏ సమస్య వచ్చినా భర్త తోడు ఉంటాడనే ధైర్యంతో పోరాడాను. కానీ ఈ రోజు భర్త నన్ను వదిలిపెట్టాలని అనుకుంటున్నాడు. మొదటిసారి అత్తారింట్లో ఒంటరిదానిని అయిపోయాను. అక్కడికి వెళ్లలేక పుట్టింటికి వచ్చానని కావ్య కన్నీళ్లతో సమాధానం చెబుతుంది.
అప్పు ఆవేశం...
మొగుడు తప్పుచేస్తే మౌనంగా ఉండేంతా ఓర్పు నీలో ఉందేమో కానీ అక్క మోసం పోతూ ఉంటే చూస్తూ ఉండేంత మంచితనం నాలో లేదని అప్పు ఆవేశపడుతుంది. రాజ్‌ను నిలదీస్తానని ఆవేశంగా దుగ్గిరాల ఇంటికి వెళ్లబోతుంది. ఆమెను కనకం, కృష్ణమూర్తి ఆపుతారు. ఆలోచించి అడుగులు వేస్తే మంచిదని అంటారు. నిలదీయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, అలా కాకుండా అర్థమయ్యేలా చెప్పి రాజ్‌ను మన దారిలోకి తెచ్చుకోవాలని అప్పుతో అంటారు.
తెలియక తప్పు చేసిన వాడిని సరిదిద్దవచ్చు. తెలిసి తప్పు చేసిన చేసిన సరిదిద్దలేమని, రాజ్ చేసిన తప్పును అందరి ముందు బయటపెట్టి అతడిని కోర్టుకు లాగుతానని అంటుంది అప్పు. అవసరమైతే శిక్ష వేయిస్తానని ఆవేశంగా మాట్లాడుతుంది.
అదంతా అబద్దం...
నాకు నీలాగే కోపం వచ్చిందని అప్పుతో అంటుంది కావ్య. కానీ రాజ్ మరో అమ్మాయితో తిరగడం, పెళ్లి చేసుకోవడం అబద్ధమని, నన్ను నమ్మించడానికే ఈ నాటకం ఆడుతున్నాడని మరో బాంబ్ పేలుస్తుంది. నా నుంచి విడిపోవాలని రాజ్ అనుకుంటున్నాడనే నిజాన్ని బయటపెడుతుంది. రాజ్ నాతో కలిసి ఉండాలని ఎప్పుడు అనుకోలేదని, అవకాశం దొరికితే విడిపోవాలని అనుకున్నారని తల్లిదండ్రులతో చెబుతుంది కావ్య. మరి ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటున్నావని కావ్యను అడుగుతారు కనకం, కృష్ణమూర్తి.
ధాన్యలక్ష్మి రచ్చ...
కావ్య కోసం హాల్‌లోనే అపర్ణ, ధాన్యలక్ష్మి ఎదురుచూస్తుంటారు. రాజ్ ఎదురుపడగానే మీరే వచ్చారు. ఆ మహారాణి ఏది అంటూ కావ్యపై సెటైర్ వేస్తుంది ధాన్యలక్ష్మి. ఈ ఇంటి పెద్ద కోడలు అని మీ అమ్మ కీర్తి కిరీటం పెట్టింది. మన ఇంటి మహాలక్ష్మి అని కావ్య కోసం అత్తయ్య ఓ సింహాసనం వేసింది అంటూ వెటకారం ఆడుతుంది. ఏమైంది నీకు ఎందుకు అలా మాట్లాడుతున్నావని భార్యను అడుగుతాడు ప్రకాశం.
లాకర్‌లో నుంచి కావ్య రెండు లక్షలు తీసుకెళ్లిందని నిందవేస్తుంది ధాన్యలక్ష్మి. కానీ ఆమె మాటలను రాజ్ తో పాటు సుభాష్, ప్రకాశం నమ్మరు. కావ్య దొంగతనం చేసిందనే మాటను ఒప్పుకోరు. కావ్యకు దొంగతనం చేయాల్సిన అవసరం లేదని రాజ్ అంటాడు. ఏ అవసరం లేకుండాతాళం చెవులు చేతిలో పడగానే కావ్య రెండు లక్షలు ఎందుకు తీసుకుంది అని రాజ్‌ను నిలదీస్తుంది ధాన్యలక్ష్మి. నీ బీరువాలో నుంచి నువ్వు డబ్బు తీసుకుంటే దొంగతనం ఎలా అవుతుంది ధాన్యలక్ష్మితో అంటాడు భర్త ప్రకాశం. ఆ రెండు లక్షల కోసం రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని సుభాష్ కూడా సర్ధిచెప్పబోతాడు.
ధాన్యలక్ష్మి అవమానం...
రెండు లక్షలతో ఏ అవసరం వచ్చిందో ఏమో తెలియాలని ధాన్యలక్ష్మి పట్టుపడుతుంది. విచ్చలవిడిగా డబ్బు తీసుకెళితే అదే అందరికి అలవాటు అయిపోతుందని ధాన్యలక్ష్మి కావ్యను నానా మాటలు అంటుంది. కావ్య ఎక్కడికి వెళ్లిందని అడుగుతుంది. కావ్య పుట్టింటికి వెళతానంటే తానే వెళ్లి డ్రాప్ చేశానని రాజ్ అంటాడు. రెండు లక్షలు పేద కుటుంబానికి దోచి పెట్టడానికే వెళ్లి ఉంటుందని ధాన్యలక్ష్మి అంటుంది. గుట్టుచప్పుడు కాకుండా వెళ్లి వాల్ల మొహన కొట్టి ఉంటుందని ధాన్యలక్ష్మి కావ్యను అవమానిస్తుంది. ఆమె మాటలతో రాజ్ ఆవేశానికి లోనవుతాడు.
కావ్యకు హక్కు ఉంది...
పుట్టింటికి అవసరం వస్తే అత్తింటి నుంచి డబ్బు తీసుకోవడం దొంగతనం ఎ లా అవుతుందని రాజ్ అంటాడు. ఎవరికి ఏ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా బెడ్‌రూమ్‌లోనే డబ్బు పెట్టానని, కానీ ఏ రోజు కావ్య ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని రాజ్ అంటాడు. నా భార్యకు దొంగతనం చేయాల్సన అవసరం లేదు. కావ్యకు కావాల్సినంత డబ్బు తీసుకునే హక్కు ఉంది. తీసుకుంది. దాని కోసం ఇంతమందిలో కావ్య పరువు తీయాలా? దొంగ అనే ముద్ర వేయాలా అని ధాన్యలక్ష్మితో అంటాడు రాజ్.
రుద్రాణి జోక్యం...
ఈ రోజు ఎంత మంది ఏమన్నా నేను వెనక్కి తగ్గనని, నిజానిజాలు బయటపడాల్సిందేనని ధాన్యలక్ష్మి పట్టుపడుతుంది. ఇంటి కోడలిని దొంగ అన్నావంటే మర్యాదగా ఉండదని ధాన్యలక్ష్మికి బుద్దిచెప్పడానికి రంగంలోకి దిగుతాడు ప్రకాశం. రోజు నా పర్సులో నుంచి డబ్బు మాయం అవుతుంది.
అలా అయితే నిన్ను దొంగ అనాల్సిందేనని ప్రకాశం అంటాడు. కావ్యను ఇంటి ఇలవేల్పు మీరందరూ వెనకేసుకురావడం కరెక్ట్ కాదని రుద్రాణి గొడవను పెద్దది చేస్తుంది. ఈ రోజు రెండు లక్షలే కదా అని వదిలేస్తే రేపు ఇంకా ఎక్కువ పోవచ్చు. ఎవరిని అడగకుండా కావ్య డబ్బు తీసుకోవడం కరెక్ట్ కాదని రుద్రాణి అంటుంది.
అధికారం వేరు...అనుమానం వేరు...
ఒకప్పుడు కావ్య తన సంపాదనను పుట్టింటికి ఇస్తే తప్పు అని అపర్ణ అన్నది...ఈ రోజు మాత్రం అత్తింటి డబ్బును పుట్టింటికి ఇవ్వడం రాజ్ కరెక్ట్ అని అంటున్నాడు. ఈ రోజు రాజ్ మాట్లాడింది ఒప్పు అయితే ఆ రోజు అపర్ణ మాట్లాడింది తప్పా అని రాజ్ అంటాడు. ధాన్యలక్ష్మి మాటలతో రాజ్ ఆవేశపడతాడు.
నా భార్యను దొంగ అనడం తప్పు. ఆ పేరుతో అవమానించడం తప్పు. కళావతిని అడిగే అధికారం ఈ ఇంట్లో ఎవరికి లేదని అంటాడు. అధికారం వేరు..అనుమానం వేరు. అధికారం అనుమానంగా మారితే మా పెద్దరికం జోక్యం చేసుకోవాల్సివస్తుందని ధాన్యలక్ష్మి మాటలకు సుభాష్ అడ్డుకట్ట వేస్తాడు. కోపంగా ముగ్గరు అక్కడి నుంచి వెళ్లిపోతారు.
బ్రహ్మముడి వేసిన లాభం లేదు...
రాజ్ మనసులోనే తాను లేనప్పుడు బలవంతంగా బ్రహ్మముడి వేసిన లాభం ఉండదని రాజ్‌ను తల్చుకొని కావ్యను కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వు ఏ తప్పు చేయకుండా తలదించుకొని ఉండటం కరెక్ట్ కాదని కావ్యతో అంటుంది అప్పు. హక్కుల కోసం పోరాడటానికి ఇది ఆస్తి తగాదా కాదని కావ్య ఎమోషనల్‌గా చెల్లెలికి సమాధానం చెబుతుంది.
భర్త మనసులో భార్యకు స్థానం లేనప్పుడు ఏ చట్టాలు ప్రేమను పుట్టిస్తాయి. ఏ న్యాయస్థానం మనస్ఫూర్తిగా కాపురం చేసుకోమని తీర్పు ఇస్తుంది. ఎంతమంది సమర్థించిన రాజ్ నిర్ణయం మారదని అర్థమైందని కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. రాజ్ జీవితంలో నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతుంది కావ్య.
ఇందిరాదేవి ఎంట్రీ...
తప్పుకొని తప్పు నీ మీద వేసుకుంటావా అని కావ్యను అడుగుతుంది ఇందిరాదేవి. ఆమెను చూసి కావ్య షాకవుతుంది. వాడికే తెలియకుండా రాజ్ నీ మీద ప్రేమను పెంచుకున్నాడని, రాజ్ గుండెల్లో ఉన్న ప్రేమను వెలికితీయాలని చెబుతుంది. రాజ్ ఓ అమ్మాయిని అడ్డం పెట్టుకొని నాటకం ఆడినట్లే నువ్వు ఓ అబ్బాయితో ప్రేమ నాటకం ఆడి రాజ్‌ను దెబ్బకొట్టాలని కావ్యకు సలహా ఇస్తుంది ఇందిరాదేవి. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.