Box office report: ఆరు నెలల్లో రూ.5 వేల కోట్లు.. టాప్ 10లో తెలుగు, మలయాళం సినిమాల హవా.. తమిళ సినిమాకు గడ్డుకాలం
Box office report: ఇండియన్ సినిమా 2024లో దూసుకెళ్లింది. మొదటి ఆరు నెలల్లోనే బాక్సాఫీస్ వసూళ్లు రూ.5000 కోట్ల మార్క్ దాటగా.. తెలుగు, మలయాళ సినిమాల హవా స్పష్టంగా కనిపించింది.
Box office report: ఇండియన్ సినిమా 2024 ఫస్ట్ హాఫ్ లో మంచి వృద్ధి నమోదు చేసింది. బాక్సాఫీస్ వసూళ్లు భారీగా పెరిగాయి. అయితే ప్రతి ఏటా కనిపించే హిందీ సినిమా హవా ఈసారి పెద్దగా ప్రభావం చూపకపోగా.. తెలుగు, మలయాళం సినిమాలు సత్తా చాటాయి. మొత్తంగా జనవరి నుంచి జూన్ చివరి వరకు ఇండియన్ సినిమాలు అన్ని భాషల్లో కలిపి రూ.5 వేల కోట్లు వసూలు చేయడం విశేషం.
దుమ్ము రేపిన జూన్ కలెక్షన్లు
జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలలు చూసుకుంటే.. ప్రధానంగా జూన్ లో మాత్రం కలెక్షన్ల పంట పండింది. మొత్తం రూ.5 వేల కోట్లలో రూ.1200 కోట్లు ఒక్క జూన్ నెలలోనే రావడం విశేషం. దీనికి ముఖ్య కారణం ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీయే. ఈ కలెక్షన్లలో 60 శాతం ఇదొక్క సినిమాదే. కల్కి కాకుండా హిందీలో ముంజ్యా, తమిళంలో మహారాజా, హిందీలో చందూ ఛాంపియన్ సినిమాలు కూడా మంచి వసూళ్లు సాధించాయి.
ఇవీ బాక్సాఫీస్ లెక్కలు
ఆర్మాక్స్ మీడియా వెల్లడించిన లెక్కల ప్రకారం.. మొత్తంగా జనవరి నుంచి జూన్ వరకు ఇండియన్ సినిమాలు రూ.5015 కోట్లు వసూలు చేశాయి. గతేడాది ఇదే ఆరు నెలల కాలంతో పోలిస్తే ఇది 3 శాతం ఎక్కువ కావడం విశేషం. 2024 ఫస్ట్ హాఫ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కల్కి 2898 ఏడీ నిలిచింది.
ఈ ఏడాది రెండో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఉన్న ఫైటర్ కంటే కూడా మూడు రెట్లు ఎక్కువ వసూళ్లు ఈ సినిమాకు వచ్చాయి. ఇక తొలి ఆరు నెలల వసూళ్లు తీసుకుంటే.. ఒక్క కల్కి 2898 ఏడీ మూవీయే 15 శాతం అందించింది. ఆ సినిమాకు జూన్ లోనే రూ.772 కోట్లు వచ్చాయి.
టాప్ 10 సినిమాలు ఇవే..
2024 ఫస్ట్ హాఫ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో మూడు తెలుగు ఇండస్ట్రీ నుంచి కాగా.. మూడు మలయాళం ఇండస్ట్రీ నుంచి ఉన్నాయి.
తొలి స్థానంలో కల్కి 2898 ఏడీ ఉండగా.. రెండో స్థానంలో ఫైటర్ (రూ.243 కోట్లు), మూడో స్థానంలో హనుమాన్ (రూ.240 కోట్లు), నాలుగో స్థానంలో సైతాన్ (రూ.178 కోట్లు), ఐదో స్థానంలో మంజుమ్మెల్ బాయ్స్ (రూ.170 కోట్లు), ఆరో స్థానంలో గుంటూరు కారం (రూ.142 కోట్లు), ఏడో స్థానంలో గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్ (రూ.136 కోట్లు), ఎనిమిదో స్థానంలో ముంజ్యా (రూ.121 కోట్లు), 9వ స్థానంలో ఆడుజీవితం (రూ.104 కోట్లు), పదో స్థానంలో ఆవేశం (రూ.101 కోట్లు) ఉన్నాయి.
తెలుగు, మలయాళం హవా
ఇక భాషల వారీగా చూసుకుంటే.. అత్యధికంగా హిందీ సినిమా నుంచి 35 శాతం వసూళ్లు వచ్చాయి. అయితే గతేడాదితో పోలిస్తే ఇది రెండు శాతం తక్కువే కావడం గమనార్హం. మలయాళం ఇండస్ట్రీ నుంచి 15 శాతం రాగా.. తెలుగు నుంచి సుమారు 30 శాతం వసూళ్లు వచ్చాయి. గతేడాది మొత్తం కలెక్షన్లతో పోలిస్తే మలయాళం సినిమా ఆరు నెలల్లోనే ఆ మొత్తాన్ని దాటేసింది.
సెకండాఫ్ లోనూ ఇండియన్ సినిమా ముఖ్యంగా తెలుగు సినిమా దుమ్ము రేపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలుగు నుంచి పుష్ప 2, దేవర, గేమ్ ఛేంజర్, ఓజీలాంటి సినిమాలు రాబోతున్నాయి. తమిళంలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీకి కూడా భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. దీంతో ఏడాది మొత్తం వసూళ్లు ఈజీగా రూ.10 వేల కోట్లు దాటేలా కనిపిస్తున్నాయి.