Amitabh Bachchan on Kalki 2898 AD: ప్రభాస్‌కు రూ.1000 కోట్ల సినిమాలు రొటీనే.. కానీ నాకు మాత్రం..: అమితాబ్ బచ్చన్
Amitabh Bachchan on Kalki 2898 AD: ప్రభాస్ కు రూ.1000 కోట్ల సినిమాలు ఇవ్వడం రొటీన్ అయిపోయిందని, కానీ తనకు మాత్రం ఈ కల్కి 2898 ఏడీ చాలా ప్రత్యేకమని బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ అన్నాడు.
Amitabh Bachchan on Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ మూవీ సక్సెస్ పై బాలీవుడ్ నటుడు, ఈ మూవీలో అశ్వత్థామ పాత్ర పోషించిన అమితాబ్ బచ్చన్ స్పందించాడు. బుధవారం (జులై 17) అతడు ప్రత్యేకంగా వీడియో రిలీజ్ చేశాడు. ప్రభాస్ కు ఇలా రూ.1000 కోట్ల సినిమాలు అందించడం రొటీన్ గా మారిపోయినా.. తనకు మాత్రం ఇది చాలా ప్రత్యేకమైందని అనడం విశేషం.
కల్కి 2898 ఏడీ సక్సెస్‌పై బిగ్ బీ ఏమన్నాడంటే..
కల్కి 2898 ఏడీ మూవీ ఈ మధ్యే రూ.1000 కోట్ల కలెక్షన్ల అరుదైన మార్క్ అందుకోవడంపై ఈ మూవీలో నటించిన స్టార్లందరూ వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ కూడా మేకర్స్ కు థ్యాంక్స్ చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇంతటి పెద్ద సినిమాలో భాగం కావడం తనకు చాలా ప్రత్యేకమైందని ఈ సందర్భంగా అతడు అన్నాడు.
"ఈ మధ్యే రిలీజైన కల్కి 2898 ఏడీ మూవీ చేయడంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ సినిమా సక్సెస్ మామూలు విషయం కాదు. ప్రభాస్ కు ఇది రొటీనే కావచ్చు. ఎందుకంటే అతని సినిమాలు రూ.1000 కోట్ల మార్క్ అందుకున్నాయి. కానీ నాకు మాత్రం ఈ కల్కి అనే ఓ భారీ ప్రాజెక్టులో భాగమైనందుకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమాను ఇప్పటికే నాలుగుసార్లు చూశాను. ప్రతిసారీ ఏదో ఓ కొత్త విషయం ఈ సినిమాలో నేను కొనుగొన్నాను" అని అమితాబ్ అన్నాడు.
కల్కి 2898 ఏడీ మూవీలో అశ్వత్థామ పాత్రలో అమితాబ్ అదరగొట్టాడు. ఈ సినిమాలో ప్రభాస్ తో అతడు చేసిన ఫైట్స్ హైలైట్ గా నిలిచాయి. నిజానికి ప్రభాస్ కంటే బిగ్ బీకే ఈ సినిమా ద్వారా ఎక్కువ పేరు వచ్చినట్లు కూడా పలువురు కామెంట్స్ చేశారు. ఇక ఇప్పుడు తాను రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు కూడా అమితాబ్ చెప్పాడు.
కల్కి 2898 ఏడీ ఓటీటీ
ఇక కల్కి 2898 ఏడీ మూవీ 20 రోజులైనా కూడా బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తూనే ఉంది. దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఇప్పట్లో ఉండబోదని మేకర్స్ స్పష్టం చేశారు. రిలీజ్ డేట్ నుంచి పది వారాల తర్వాతే ఈ మూవీ ఓటీటీలో అడుగుపెట్టనుంది. ఆ లెక్కన సెప్టెంబర్ తొలి వారం లేదా ఆ తర్వాతే రావచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే డొమెస్టిక్ వసూళ్లలో యానిమల్ రికార్డును బ్రేక్ చేసిన ఈ సినిమా.. షారుక్ జవాన్ పై కన్నేసింది.
బాక్సాఫీస్ దగ్గర ఇటు తెలుగులో, అటు హిందీ, తమిళంలలోనూ ఈ మూవీకి పెద్దగా పోటీ లేకపోవడం కూడా కలిసి వస్తోంది. ఈ మధ్యే రిలీజైన ఇండియన్ 2, సర్ఫిరాలాంటి సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో ఇప్పటికే కల్కి 2898 ఏడీ మూవీ వసూళ్లు బాగానే ఉన్నాయి.