Ashwini Dutt on Prabhas: ప్రభాస్‍నే నమ్ముకున్నాం: నిర్మాత అశ్వినీదత్
Ashwini Dutt on Prabhas: కల్కి 2898 ఏడీ సినిమా కోసం భారీగా బడ్జెట్ ఖర్చు పెట్టిన విషయంపై నిర్మాత అశ్వినీదత్ స్పందించారు. ఈ మూవీ విషయంలో తాము ప్రభాస్‍ను నమ్ముకొని ఉన్నామని అన్నారు. మరిన్ని వ్యాఖ్యలు చేశారు.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్స్ క్రియేట్ చేస్తోంది. జూన్ 27న రిలీజైన ఈ చిత్రం ఇప్పటికే రూ.1,000 కోట్ల వసూళ్ల మార్కును దాటేసింది. కల్కి మూవీని సుమారు రూ.600కోట్ల బడ్జెట్‍తో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఇండియాలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా వచ్చింది.
కల్కి 2898 ఏడీ చిత్రానికి ఇంత ఖర్చు పెట్టడంపై రిలీజ్‍కు ముందు ఆశ్చర్యం వ్యక్తమైంది. అయితే, దర్శకుడు నాగ్ అశ్విన్ ఆ బడ్జెట్‍కు పూర్తిగా న్యాయం చేసి అద్భుతమైన ఔట్‍పుట్ ఇచ్చారు. కల్కి చిత్రం భారీ కలెక్షన్లు దక్కించుకోవటంతో నిర్మాతలు ఇప్పటికే లాభాల్లోకి వచ్చేశారని తెలుస్తోంది. అయితే, ఈ మూవీకి ఇంత భారీగా ఖర్చు పెట్టడం గురించి ఎదురైన ప్రశ్నకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు నిర్మాత అశ్వినీదత్. ప్రభాస్‍నే నమ్ముకొనే అంత బడ్జెట్ పెట్టామన్నట్టుగా చెప్పారు.
ప్రభాస్ నడిపిస్తారనే అనుకున్నాం
కల్కి 2898 ఏడీ చిత్రం గురించి ప్రభాస్‍నే నమ్ముకొని ఉన్నామని అనుకున్నామని అశ్వినీదత్ అన్నారు. వైజయంతీ మూవీస్ పతాకానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కల్కి బడ్జెట్‍పై ప్రస్తావన రాగా.. ఆయన ఈ విషయంపై మాట్లాడారు. “ప్రభాస్‍ను నమ్ముకొని ఉన్నాం. ఈ సినిమా అంతా ఆయనే ముందుండి నడిపిస్తాడనుకున్నాం. ఆయన మీదే అప్పజెప్పాం. అలాగే రిజల్ట్స్ కూడా అందుకు అనుగుణంగా వచ్చాయి” అని అశ్వినీదత్ అన్నారు. రూ.1000 కోట్ల క్లబ్‍లోకి వైజయంతీ మూవీస్ అడుగుపెట్టినందుకు అభినందలు అని అన్నారు ఇంటర్వ్యూ హోస్ట్ ఝాన్సీ. కల్కి కోసం మూవీ టీమ్ మూడేళ్ల అవిశ్రాంతంగా కష్టపడిందని అశ్వినీదత్ తెలిపారు.
కల్కి 2898 ఏడీ సినిమా రూ.1,000 కోట్ల మార్క్ దాటడంలో ప్రభాస్ స్టార్ డమ్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ మూవీని నాగ్ అశ్విన్ మెప్పించేలా తెరకెక్కించినా.. కలెక్షన్ల వర్షం కురిసేందుకు ప్రభాస్ స్టామినానే కారణమనేది నిర్వివివాదాంశం. ఆయన మేనియా ఈ చిత్రానికి బాగా కలిసి వచ్చింది. కల్కి 2898 ఏడీ మూవీ తెలుగుతో పాటు హిందీలోనూ భారీ కలెక్షన్లను రాబడుతోంది. నార్త్ ఇండియాలో అంచనాలకు మించి వసూళ్లను దక్కించుకుంటోంది. తమిళం, కన్నడ, మలయాళంలోనూ మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ మూవీ ఇంకా థియేటర్లలో మంచి వసూళ్లను దక్కించుకుంటోంది.
ఆలస్యంగానే ఓటీటీలోకి..
కల్కి 2898 ఏడీ మూవీకి థియేటర్లలో లాంగ్ రన్ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ తరుణంలో మూవీ టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. 10 వారాల తర్వాతే ఈ మూవీ ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వస్తుందని ప్రకటించింది. దీంతో సెప్టెంబర్‌లోనే కల్కి ఓటీటీలోకి వస్తుందని అర్థమవుతోంది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లు దక్కించుకున్నట్టు తెలుస్తోంది.
కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్‍తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. మహాభారతం ఆధారంగా ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. ఈ మూవీకి సీక్వెల్ రానుంది. కల్కి మూవీ క్లైమాక్స్ అద్భుతమైన ట్విస్ట్‌తో ముగియడంతో కల్కి 2పై హైప్ మరింత ఎక్కువగా ఉంది.