Bollywood: విలువైన కార్లను పేల్చేశాం.. ప్రతీ రోజు రూ.కోట్లలో ఖర్చు: బడే మియా చోటే మియా బడ్జెట్ గురించి చెప్పిన దర్శకుడు
Bade Miyan Chote Miya: ‘బడే మియా చోటే మియా’ సినిమా యాక్షన్ సన్నివేశాల కోసం విలువైన కార్లను పేల్చేసినట్టు దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ వెల్లడించారు. ఈ చిత్రానికి భారీ బడ్జెట్ అయిందని చెప్పారు. ఆ వివరాలివే..
Bade Miya Chote Miya: బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, టైగార్ ష్రాఫ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘బడే మియా చోటే మియా’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఏప్రిల్ 10వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‍తో రూపొందించారు. కాగా, బడే మియా చోటే మియా సినిమా ఖర్చు గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు డైరెక్టర్ జాఫర్. కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
రోజుకు రూ.4కోట్ల వరకు ఖర్చు
బడే మియా చోటే మియా సినిమా షూటింగ్‍కు కొన్నిసార్లు ప్రతీ రోజు రూ.3కోట్ల నుంచి రూ.4కోట్ల వరకు ఖర్చు అయిందని దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్.. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ చిత్రాన్ని ఎక్కువగా రియల్ లొకేషన్లలోనే చిత్రీకరించామని, యాక్షన్ సీక్వెన్లుల కోసం ఎంతో శ్రమించామని అన్నారు. స్టంట్‍ల కోసం ఉపయోగించిన బైక్‍లు, కార్లు, హెలికాప్టర్లు, టెక్నిషియన్లు ఇలా అన్నీ చాలా ఖరీదైనవి వెల్లడించారు.
విలువైన కార్లు పేల్చేశాం
బడే మియా చోటే మియా షూటింగ్‍లో యాక్షన్ సీక్వెన్సుల కోసం రూ.30లక్షల నుంచి రూ.40లక్షల విలువైన కార్లను కూడా పేల్చేశామని దర్శకుడు జాఫర్ వెల్లడించారు. “బైక్ స్టంట్ చేయాలంటే.. ఒక్కో బైక్ సుమారు రూ.4లక్షల వరకు ఖరీదు ఉంటుంది. ఒకవేళ స్టంట్ తప్పుపోతే వెంటనే ఆ డబ్బు వృథా అవుతుంది. ఒకవేళ రూ.30 - 40 లక్షల విలువైన కారు పేల్చాలనుకుంటే.. ఆ స్టంట్ అనుకున్న విధంగా రాకపోతే అంత డబ్బు వేస్ట్ అవుతుంది. బడే మియా చోటే మియా సినిమా కోసం రోజుకు రూ.3కోట్ల నుంచి రూ.4కోట్ల వరకు ఖర్చు చేసిన సందర్భాలు ఉన్నాయి. వినియోగించిన వాహనాలు, పరికరాలు, హెలీకాప్టర్లు, టెక్నిషియన్లు ఇలా అన్నీ చాలా ఖరీదైనవే” అని డైరెక్టర్ జాఫర్ తెలిపారు.
ఈ చిత్రంలో స్పెషల్ ఫోర్సెస్ ఉండాలని అనుకున్నామని, అలాగే రియల్ మిలటరీ బేస్‍ల్లో షూటింగ్ చేయాలని భావించామని డైరెక్టర్ జాఫర్ తెలిపారు. అందుకే అందుకు అనుగుణంగా ఉండే సౌదీ అరేబియా, జోర్దాన్‍లో ఈ మూవీ షూటింగ్ చేశామని ఆయన తెలిపారు. ఎక్కువ వీఎఫ్‍ఎక్స్ వాడకుండా.. అధికంగా రియల్ లొకేషన్లలోనూ షూటింగ్ చేశామని కూడా ఆయన తెలిపారు. అధిక బడ్జెట్ అనేది నటులు, ఫిల్మ్ మేకర్లకు ఒత్తిడిగానే ఉంటుందని ఆయన అన్నారు.
మొత్తం బడ్జెట్ ఇదే!
బడే మియా చోటే మియా చిత్రానికి సుమారు రూ.350 కోట్ల వరకు బడ్జెట్ అయినట్టు తెలుస్తోంది. పూజా ఎంటర్‌టైన్‍మెంట్స్, ఏఏజెడ్ ఫిల్మ్స్ పతాకాలపై జాకీ భగ్నానీ, వషు భగ్నానీ, దీప్షికా దేశ్‍ముఖ్, అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు కిషన్ మెహ్రా నిర్మించారు. ఏప్రిల్ 10న హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.
బడే మియా చోటే మియా చిత్రంలో అక్షయ్ కుమార్, టైగర్‌తో పాటు పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ప్రధాన పాత్ర చేశారు. మానుషీ చిల్లర్, సోనాక్షి సిన్హా, అలయా ఎఫ్, రోనిత్ రాయ్ కీలకపాత్రలు చేశారు. ఈ చిత్రానికి జూలియస్ పాకియమ్, విశాల్ మిశ్రా సంగీతం అందించారు.