Anasuya Song With Pawan Kalyan: ప్రస్తుతం ఏపీ రాజకీయాలతో బిజీగా ఉన్నారు డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్. మరోవైపు సినిమాలను కూడా త్వరతగిన పూర్తి చేయాలని చూస్తున్నారు. పవన్ కల్యాణ్ చేతిలో ప్రస్తుతం రెండు మూడు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్న విషయం తెలిసిందే. వీటిలోని ఓ సినిమాలో యాంకర్ అనసూయ భరద్వాజ్ ఓ స్పెషల్ సాంగ్ చేసిందట.
జూనియర్ ఎన్టీఆర్ నాగ సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించిన బ్యూటిఫుల్ అనసూయ భరద్వాజ్ ఆ తర్వాత యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ కామెడీ షోతో యాంకర్‌గా తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ అయింది. ఓ వైపు యాంకర్‌గా చేస్తూనే సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ నటిగా సైతం క్రేజ్ తెచ్చుకుంది. అనంతరం కొంతకాలానికి యాంకర్‌కు స్వస్థి పలికి నటిగా కొనసాగుతోంది.
రంగస్థలం, పుష్ప, ఖిలాడీ, రజాకార్ తదితర సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించిన రంగమ్మత్త అనసూయ ప్రస్తుతం ఓ టీవీ షోకి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. అదే స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్. ఈ షోలోనే తాను పవన్ కల్యాణ్‌తో ఓ బ్యూటిఫుల్ డ్యాన్స్ నెంబర్ అంటే స్పెషల్ సాంగ్ చేసినట్లు అనసూయ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో అనసూయ చెప్పిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో పవన్ కల్యాణ్ చిన్నప్పటి ఫొటో చూపించి ఎవరో గెస్ చేయమని అడిగారు. అప్పుడు అందరూ పవన్ కల్యాణ్ అని చెప్పారు. ఆ తర్వాత అనసూయ భరద్వాజ్ అసలు విషయం చెప్పింది. దానికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది
ఆ వీడియోలో.. "నేను ఇప్పటివరకు ఏ టీవీ షోలో చెప్పలేదు. తొలిసారి ఓ టెలివిజన్ షోలో ఈ విషయం చెబుతున్నాను. నేను పవన్ కల్యాణ్ గారితో ఒక బ్యూటిఫుల్ డ్యాన్స్ నెంబర్ చేశాను అని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. మన టెలివిజన్‌లో మోత మోగిపోద్ది ఆ పాట మాత్రం" అని యాంకర్ అనసూయ భరద్వాజ్ చాలా సంతోషంగా చెప్పింది.
అనసూయ చెప్పడంతో యాంకర్ శ్రీముఖి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ అంతా సంతోషంతో ఆశ్చర్యపోయారు. కేకలు వేస్తూ సంతోషాన్ని తెలిపారు. ఇప్పుడు ఈ విషయంపైనే నెట్టింట్లో చర్చ జరుగుతోంది. అనసూయ భరద్వాజ్ డ్యాన్స్ నెంబర్ అని చెప్పిందంటే కచ్చితంగా అది ఐటమ్ సాంగే అని నెటిజన్స్ కన్ఫర్మ్ చేసుకున్నారు.
కాగా పవన్ కల్యాణ్ ప్రస్తుతం హర హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు. వీటిలో ఏ సినిమాలో అనసూయ ఐటమ్ సాంగ్ చేసి ఉంటుందని వాళ్లలో వాళ్లే ప్రశ్నించుకుంటున్నారు. అయితే, ఎక్కువగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో అనసూయ ఐటమ్ సాంగ్ చేసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు నెటిజన్స్.