Kalki 2898 AD Pre-release Event: అమితాబ్ అలా చేయవద్దని చెప్పారు: ప్రభాస్.. ఆ మాత్రం మాట్లాడడమే గొప్ప అన్న దీపిక
Kalki 2898 AD Pre-release Event: కల్కి 2898 ఏడీ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె సహా మూవీ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.
Kalki 2898 AD Pre-release Event: సినీ ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్న కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్‍కు రెడీ అయింది. భారత పురాణాల స్ఫూర్తితో ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు నాగ్ అశ్విన్. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించారు. గ్లోబల్ రేంజ్‍లో అద్భుతమైన విజువల్స్‌తో ఈ చిత్రం వస్తోంది. కల్కి 2898 ఏడీ సినిమా మరో వారంలో జూన్ 27వ తేదీన రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (జూన్ 19) ముంబైలో జరిగింది.
కల్కి 2898 ఏడీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు ఈ మూవీలో నటించిన హీరో ప్రభాస్, బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్, నిర్మాత అశ్వినీదత్ హాజరయ్యారు. దీపిక ప్రస్తుతం గర్భిణిగా ఉన్నా ఈ ఈవెంట్‍కు వచ్చారు. దర్శకుడు నాగ్ అశ్విన్ కనిపించలేదు. ఈ ఈవెంట్‍కు హోస్ట్ చేశారు హీరో దగ్గుబాటి రానా.
అమితాబ్ అలా చేయవద్దన్నారు
అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి దిగ్గజాలతో కలిసి నటించడం గురించి చెప్పాలని ప్రభాస్‍ను రానా అడిగారు. దీంతో తాను ప్రభాస్ కాళ్లు మొక్కుతానంటూ టీజ్ చేశారు అమితాబ్. ఆ తర్వాత ప్రభాస్ అసలు విషయం చెప్పారు. తాను అమితాబ్‍కు పాదాభివందనం చేశానని.. ఇంకోసారి అలా చేయవద్దని ఆయన తెలిపారు. “నేను తొలిసారి కలిసినప్పుడు అమితాబ్ బచ్చన్ కాళ్లకు నమస్కరించాను. అయితే అలా చేయద్దని అమితాబ్ వారించారు. ఇంకోసారి అలా చేస్తే నేను కూడా అలా చేస్తానని అమితాబ్ అన్నారు. ప్లీజ్ నేను అలా ఆలోచన కూడా చేయలేను” అని ప్రభాస్ చెప్పారు. దక్షిణాదిలోనూ పాపులర్ అయిన తొలి హిందీ నటుడు అమితాబ్ అని ప్రభాస్ అన్నారు. కమల్ హాసన్ సినిమాలు అంటే తనకు ఎంత ఇష్టమో.. చిన్నప్పుడు ఆయనలా కనిపించేందుకు తాను ఇష్టపడేవాడినని ప్రభాస్ చెప్పారు. అమితాబ్, కమల్ లాంటి దిగ్గజాలతో నటించే ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత అశ్వినీదత్‍కు థ్యాంక్స్ చెప్పారు ప్రభాస్.
దీపికను మరిచిన ప్రభాస్
దీపికా పదుకొణ్ గురించి చెప్పకుండానే మైక్ పక్కన పెట్టబోయారు ప్రభాస్. దీంతో పక్కనే ఉన్న లవ్లీ లేడీ గురించి చెప్పాలని గుర్తు చేశారు రానా. దీంతో ‘సారీ’ అంటూ ప్రభాస్ మాట్లాడుతుండగా.. దీపిక కల్పించుకున్నారు. “ప్రభాస్ రెండు వాక్యాలు మాట్లాడడాన్ని మనం సెలెబ్రేట్ చేసుకోవాలి” అని దీపిక అన్నారు. ఇంట్రోవర్ట్‌గా ఉండే ప్రభాస్ ఈ మాత్రం మాట్లాడడమే గొప్ప అని అని ఆమె చెప్పారు. దీపిక సూపర్ స్టార్ అని, గొప్ప నటి అని ప్రభాస్ ప్రశంసించారు. తన బేబీ బంప్‍ను చూపిస్తూ ప్రభాస్ తినిపించిన తిండి వల్లే అంటూ సరదాగా జోక్ వేశారు దీపిక.
కల్కి 2898 ఏడీ సినిమాపై తనకు మొదట ఆసక్తి కలిగిందని, ఆ తర్వాత ఆశ్చర్యం వేసిందని కమల్ హాసన్ అన్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్‍పై ప్రశంసలు కురిపించారు.
కల్కి 2898 ఏడీ చిత్రంలో నటించడం గొప్ప గౌరవం అని అమితాబ్ బచ్చన్ అన్నారు. నిర్మాత అశ్వినీదత్ చాలా వినయంగా ఉంటారంటూ ఆయన కాళ్లకు మొక్కబోయారు బిగ్‍బీ. డైరెక్టర్ నాగ్ అశ్విన్‍ను ప్రశంసించారు.