Nag Ashwin: కల్కి 2898 ఏడీ కథ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన డైరెక్టర్ నాగ్ అశ్విన్: 'అన్నింటికీ క్లైమాక్స్‌లా'
Kalki 2898 AD Director Nag Ashwin: కల్కి 2898 ఏడీ గురించి స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది మూవీ టీమ్. కల్కి కథ గురించి దీంట్లో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు డైరెక్టర్ నాగ్అశ్విన్.
Kalki 2898 AD - Nag Ashwin: కల్కి 2898 ఏడీ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం జూన్ 27వ తేదీన థియేర్లలో విడుదల కానుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ మైథాలజీ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించారు. ట్రైలర్ కూడా అదిరిపోవటంతో కల్కి 2898 ఏడీపై అంచనాలు ఆకాశానికి చేరాయి. ఈ తరుణంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్‍తో ఓ వీడియోను రిలీజ్ చేసింది మూవీ టీమ్. కల్కి 2898 ఏడీ ప్రిల్యూడ్‍లో ఎపిసోడ్-1 అంటూ ఆ వీడియోను నేడు (జూన్ 18) తీసుకొచ్చింది. ఈ సినిమా కథ గురించి ఈ వీడియోలో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు నాగ్ అశ్విన్.
క్లైమాక్స్ లాంటిది
కల్కి 2898 ఏడీ కథ మన పురాణాలు అన్నింటికి క్లైమాక్స్ (ముగింపు) లాగా ఉంటుందని నాగ్ అశ్విన్ చెప్పారు. కలియుగంలో ఎలా, ఏం జరగొచ్చు అనేది ఉంటుందని, ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో ఎవరైనా ఈ స్టోరీని రిలేట్ చేసుకోవచ్చని నాగీ చెప్పారు. కల్కి కథ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. “మన పురాణాల్లో అతిగొప్పది మహాభారతం. చాలా క్యారెక్టర్లు ఉంటాయి. (విష్ణుమూర్తి) అవతారాలు కృష్ణుడితోనే ముగిసింది. అక్కడి నుంచి కలియుగంలోకి వెళ్లినప్పుడు ఈ కథ ఎలా ఉంటుందన్నది పూర్తిగా క్రియేటివ్ ఇమాజినేషన్. కృష్ణుడి అవతారం తర్వాత పదో అవతారం కల్కి. కలియుగంలో ఎలా జరగబోతోంది.. ఎలా జరగొచ్చు. ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా రిలేట్ చేసుకునే స్టోరీ. ఈ కథ అన్నింటికీ క్లైమాక్స్. మనం చదివిన పురాణాలకు, క్యారెక్టర్లకు ఒక క్లైమాక్స్ లాగా చేస్తే ఈ కథ” అని నాగ్ అశ్విన్ చెప్పారు.
“కలి అనే వాడు ప్రతీ యుగంలోనూ ఒక్కో రూపంలో ఉంటాడు. ఒకసారి రావణుడిలా.. ఒకసారి దుర్యోధనుడిలా ఉంటాడనుకుంటే.. చివరగా కలియుగంలో ఫైనల్ రూపం తీసుకుంటే అలాంటప్పుడు ఎలాంటి హీరో వస్తాడనే ఆలోచనతో రాసిన కథ ఇది. చీకటి, వెలుగు.. క్లైమాక్స్ ఏంటని ఐడియా పెట్టుకొని రాసుకుంటే ఈ కథకు ఐదేళ్లు పట్టింది” అని నాగ్ అశ్విన్ చెప్పారు. ఆ ప్రపంచంలోకి వెళ్లి ఈ కొత్త సైన్స్ ఫిక్షన్ మైథాలజీని చూస్తే ప్రేక్షకులు ఎలా స్పందిస్తారనేది చూడాలని ఆసక్తిగా ఉన్నానని నాగీ అన్నారు.
నా ఫేవరెట్ మూవీ అదే
తన ఫేవరెట్ సినిమా పాతాళభైరవి అని నాగ్ అశ్విన్ అన్నారు. “చిన్నప్పటి నుంచి మన పౌరాణిక చిత్రాలు చూశా. నా ఫేవరెట్ మూవీ పాతాళభైరవి. భైరవ ద్వీపం, ఆదిత్య 369, హాలీవుడ్ స్టార్ వార్స్ లాంటి సినిమాలు చూసినప్పుడు కూడా చాలా బాగున్నాయనిపించింది. స్టార్స్ వార్స్ లాంటి సినిమాలు ఇవి మన స్టోరీలు కావా.. ఎప్పుడూ అన్నీ వెస్ట్‌లోనే జరగాలా అని అనిపించేవి” అని నాగ్ అశ్విన్ చెప్పారు. కల్కి కథ రాసేందుకు తనకు ఈ విషయాలే స్ఫూర్తి అన్నట్టుగా మాట్లాడారు.
కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణ్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. సుమారు 6,000 ఏళ్ల మధ్య సాగే కథగా కల్కి ఉంటుందని నాగ్ అశ్విన్ గతంలో కూడా చెప్పారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. జూన్ 27న గ్లోబల్ రేంజ్‍లో భారీ స్థాయిలో కల్కి విడుదల కానుంది.
టాపిక్