Prabhas: అందుకే కల్కి 2898 ఏడీ సినిమాకు అంత ఎక్కువ బడ్జెట్: ప్రభాస్
Kalki 2898 AD Movie - Prabhas: కల్కి 2898 ఏడీ సినిమాకు ఆ స్థాయిలో బడ్జెట్ ఎందుకు పెట్టారో హీరో ప్రభాస్ వెల్లడించారు. హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ ఈ విషయాలను చెప్పారు.
Prabhas on Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ సినిమాపై క్రేజ్ ఫుల్‍గా ఉంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. జూన 27వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. సుమారు రూ.600 కోట్ల బడ్జెట్‍తో ఈ మూవీ రూపొందింది. భారత సినీ ఇండస్ట్రీలోనే ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన మూవీగా కల్కి 2898 ఏడీ నిలిచింది. వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. అయితే, ఈ మూవీకి ఇంత బడ్జెట్ ఎందుకు పెట్టారో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ వెల్లడించారు. హాలీవుడ్ మీడియా డెడ్‍లైన్‍తో ఈ విషయాలు చెప్పారు.
హైబడ్జెట్ ఇందుకే..
కల్కి 2898 ఏడీ చిత్రం మొత్తం ఇంటర్నేషన్ ఆడియన్స్ కోసం రూపొందిందని, అందుకే అంత ఎక్కువ బడ్జెట్‍ను వెచ్చించినట్టు ప్రభాస్ వెల్లడించారు. “ఈ సినిమా ఇంటర్నేషనల్ కోసం తెరకెక్కింది. అందుకే హైయ్యెస్ట్ బడ్జెట్, దేశంలో అత్యుత్తమమైన నటీనటులను తీసుకున్నాం” అని ప్రభాస్ చెప్పారు.
మొత్తంగా గ్లోబల్ రేంజ్‍లో మూవీ ఉండాలన్న ఉద్దేశంతో కల్కి 2898 ఏడీ చిత్రాన్ని అత్యధిక బడ్జెట్‍తో తెరకెక్కించినట్టు ప్రభాస్ చెప్పారు. తొలి పాన్ ఇండియా స్టార్‌గా పేరు గడించడం ఎలా ఉందన్న విషయంపై కూడా ప్రభాస్ స్పందించారు. అలా పిలవడం తనపై పెద్దగా ప్రభావం చూపదని, కానీ దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఇష్టపడుతుండడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని ప్రభాస్ చెప్పారు.
నేనెక్కడున్నా అనుకుంటారు
కల్కి 2898 ఏడీ సినిమా చూసి ప్రేక్షకులు థియేటర్లలో నుంచి బయటికి వచ్చిన తర్వాత భిన్నంగా ఫీల్ అవుతారని తాను అనుకుంటున్నట్టు దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పారు. మళ్లీ ఆ ప్రపంచంలోకి వెళ్లొచ్చా అని అంటారని భావిస్తున్నానని అన్నారు. “కల్కి 2898 ఏడీ సినిమా చూసి థియేటర్ల నుంచి బయటికి వచ్చాక ప్రేక్షకులు విభిన్నంగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నా. నేను ఎక్కడున్నాను.. మళ్లీ ఆ ప్రపంచంలోకి వెళ్లొచ్చా.. అని ప్రేక్షకులు అంటారని భావిస్తున్నా” అని నాగ్ అశ్విన్ చెప్పారు. తాను అవతార్ మూవీ చూసినప్పుడు అలాగే ఫీల్ అయ్యానని ఆయన తెలిపారు.
కల్కి 2898 ఏడీ సినిమాలో పాత్ర పేర్లను ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం అలాగే ఉంచామని, మార్పులు చేయబోమని నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు. జూన్ 27వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు ఇంగ్లిష్ సహా మరికొన్ని విదేశీ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కానుందని తెలుస్తోంది.
కల్కి 2898 ఏడీ సినిమాను వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ప్రభాస్‍తో పాటు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, దిశా పటానీ కీలకపాత్రలు చేశారు.