ఓటీటీలో రానున్న భారతరత్న పీవీ నరసింహారావు బయోపిక్: వివరాలివే-aha ott platform announces biopic of former prime minister bharat ratna pv narasimha rao titled as half lion ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Aha Ott Platform Announces Biopic Of Former Prime Minister Bharat Ratna Pv Narasimha Rao Titled As Half Lion

ఓటీటీలో రానున్న భారతరత్న పీవీ నరసింహారావు బయోపిక్: వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 28, 2024 05:39 PM IST

PV Narasimha Rao Biopic: మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహా రావు జీవితంపై ఓ బయోపిక్‍ను ప్రకటించింది ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్. ఓ బుక్ ఆధారంగా దీన్ని రూపొందించనుంది. వివరాలివే.

OTT: ఓటీటీలో మాజీ ప్రధాని భారతరత్న పీవీ నరసింహారావు బయోపిక్.. ప్రకటించిన ఆహా
OTT: ఓటీటీలో మాజీ ప్రధాని భారతరత్న పీవీ నరసింహారావు బయోపిక్.. ప్రకటించిన ఆహా

PV Narasimha Rao Biopic: మాజీ ప్రధాన మంత్రి దివంగత పీవీ నరసింహా రావు.. భారత దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరు తెచ్చుకున్నారు. దేశం ఆర్థిక పరంగా ఎదిగేందుకు ఆయన అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. అవి సత్ఫలితాలను ఇచ్చాయి. 1991 నుంచి 1996 మధ్య ఆయన భారత ప్రధానిగా పని పని చేశారు. పీవీ నరసింహారావు సేవలకు గుర్తింపుగా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌరపురస్కారం ‘భారతరత్న’ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. తెలుగు వారికి గర్వకారణమైన పీవీ నరసింహా రావు జీవితంపై ఓ బయోపిక్ రానుంది.

మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు జీవితంపై బయోపిక్ తీసుకురానున్నట్టు ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ నేడు (ఫిబ్రవరి 28) వెల్లడించింది. దీనికి ‘హాఫ్ లయన్’ అనే టైటిల్ ప్రకటించింది. ప్రేక్షకుల ముందుకు చరిత్రను తీసుకొచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నామని ట్వీట్ చేసింది.

ఆ బుక్ ఆధారంగా..

రచయిత వినయ్ సేనాపతి రచించిన హాఫ్ లయన్ బుక్ ఆధారంగా పీవీ నరసింహారావు బయోపిక్‍ను ఆహా రూపొందించనుంది. ప్రకాశ్ ఝా ఈ బయోపిక్‍కు క్రియేటర్‌గా ఉన్నారు. అప్లాజ్ ఎంటర్‌టైన్‍మెంట్‍తో కలిసి ఆహా.. ఈ బయోపిక్‍ను సమర్పిస్తోంది. భారత ఆర్థిక విప్లవం వెనుక ఉన్న మహనీయుడు, భారతరత్న పీవీ నరసింహారావుకు గౌరవంగా ఈ బయోపిక్ తీసుకొస్తున్నట్టు ఆహా ట్వీట్ చేసింది. ఆయన స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండడం సంతోషంగా ఉందని పేర్కొంది.

అయితే, ఈ బయోపిక్ స్ట్రీమింగ్ డేట్‍ను ఆహా ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ఈ విషయంపై ప్రకటన చేసే అవకాశం ఉంది. అలాగే.. మరిన్ని వివరాలను కూడా క్రమంగా అనౌన్స్ చేయనుంది.

పీవీ నరసింహా రావుకు ఈనెలలోనే భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. దీనిపట్ల దేశ ప్రజలు.. ముఖ్యంగా తెలుగు వారు హర్షం వ్యక్తం చేశారు. పీవీకి ఎప్పుడో భారతరత్న రావాల్సిందని.. అయితే ఆలస్యమైనా ఇప్పుడు ప్రకటించినందుకు సంతోషంగా ఉందంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ పార్టీలో పీవీ నరసింహారావు అగ్రనేతగా ఎదిగారు. 1962 నుంచి 1973 మధ్య ఆంధ్రప్రదేశ్‍లో వివిధ శాఖల మంత్రిగా పని చేశారు. 1971 నుంచి ఏడాదికిపైగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్లారు. విదేశీ వ్యవహారాల శాఖ, రక్షణ, హోం శాఖ మంత్రిగా సేవలు అందించారు. ఆ తర్వాత 1991 నుంచి 1996 మధ్య ప్రధాన మంత్రిగా పీవీ నరసింహా రావు విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్‍తో కలిసి చాలా ఆర్థిక సంస్కరణలను వీపీ ప్రవేశపెట్టారు. దేశం ఆర్థికంగా ఎదిగేందకు అవి ఎంతో తోడ్పడ్డాయి. 2004 డిసెంబర్‌లో పీవీ నరసింహా రావు కన్నుమూశారు. ఆయన మరణించిన సుమారు ఇరవై సంవత్సరాల తర్వాత ఇటీవలే భారతరత్న పురస్కారాన్ని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

IPL_Entry_Point