Bharat Ratna PV Narasimha Rao : ప్రధాని పీఠంపై తొలి దక్షిణాది - పీవీ ప్రస్థానంలోని ముఖ్య విషయాలివే
Bharat Ratna PV Narasimha Rao: మాజీ ప్రధానమంత్రి పీవీకి భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. భారత ప్రధానిగా పదవి చేపట్టిన తొలి దక్షిణాదిగానే కాదు ఏకైక తెలుగు వ్యక్తిగా ఆయనకు పేరుంది. నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు కాకుండా కాంగ్రెస్ నుంచి ప్రధానిగా ఎన్నికైన తొలి వ్యక్తి కూడా పీవీనే కావడం మరో విశేషం.
Bharat Ratna PV Narasimha Rao: పీవీ నరసింహరావు… పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో జన్మించిన ఆయన… దేశ ప్రధానిగా సేవలందించారు. ఈ దేశ ముఖచిత్రంపై తనదైన ముద్రను వేశారు. ఆర్థిక రంగం నుంచి అణుశక్తి కార్యక్రమం వరకు, దేశ భద్రత నుంచి విదేశాంగ విధానం వరకు అన్నింటిలోనూ తన ముద్రను వేశారు. పాలన దక్షతతో ప్రతి ఒక్కర్ని మెప్పించి నేతగా పీవీకి పేరుంది. అయితే ఆయనకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే విషయంపై అసెంబ్లీలో తీర్మానం చేసి… కేంద్రానికి కూడా పంపింది. అయితే ఎట్టకేలకు పీవీకి భారత రత్న పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
పీవీ ప్రస్థానం….
పీవీ నరసింహారావు(Pamulaparthi Venkata Narasimha Rao) జూన్ 28 1921లో వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో జన్మించారు.
ఉస్మానియా యూనివర్సిటీ, బాంబే, నాగ్‌పుర్ వర్శిటీల్లో విద్యాభాస్యాన్ని పూర్తి చేశారు. న్యాయవాదిగా కూడా పని చేశారు.
వందేమాతరం, స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.
ఆ తర్వాత గాంధీ భావజాలం నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
1957లో తొలిసారి ఎమ్మెల్యేగా(మంథని నియోజకవర్గం) ఎన్నికయ్యారు.
1971 వరకు రాష్ట్ర ప్రభుత్వంలో అనేక మంత్రి పదవులు చేపట్టారు.
1971లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ ప్రాంతంలో అనేక భూసంస్కరణలకు చర్యలు తీసుకున్నారు. ఈ సమయంలో పీవీపై అనేక విమర్శలు వచ్చాయి.
అనంతర కాలంలో ఇందిరాగాంధీ విధేయుడిగా పేరుపొందారు పీవీ.
1969లో కాంగ్రెస్ రెండు ముక్కలుగా చీలిపోయినప్పుడు ఇందిరాగాంధీ వైపున నిలిచారు పీవీ.
కేంద్రంలో మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ ప్రభుత్వాల్లో పనిచేశారు.
హోం, రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు.
దేశానికి 9వ ప్రధానమంత్రిగా 1991- 1996 సమయంలో సేవలందించారు.
ఆ పదవి చేపట్టిన తొలి దక్షిణాది, ఏకైక తెలుగు వ్యక్తిగా పీవీ ఘనత సాధించారు.
నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు కాకుండా కాంగ్రెస్ నుంచి ప్రధానిగా ఎన్నికైన తొలి వ్యక్తి కూడా ఈయనే కావడం విశేషం.
1991లో నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు పీవీ. 5లక్షల మెజార్టీతో విజయం సాధించారు.
ప్రధాని హోదాలో ఆయన అనేక సంప్రదాయాలను ఉల్లంఘించిన నేతగా పీవీని చెబుతుంటారు.
ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్‌ను తన కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా నియమించారు. వీరంతా కలిసి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు.
ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడంలో పీవీ కీలక పాత్ర పోషించారు.
బహు భాషా కోవిదుడిగానూ పీవీ నరసింహారావుకు గుర్తింపు ఉంది
తెలుగులో సుప్రసిద్ధ నవల ‘వేయిపడగల’ను ఆయన ‘సహస్రఫణ్’ పేరుతో హిందీలోకి అనువదించారు పీవీ నర్సింహ్మారావు.
పీవీకి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ఇందులోని ఒకరైన వాణిదేవి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు.ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.
సంబంధిత కథనం