Chiranjeevi: “తెలుగు వారందరికీ అత్యంత సంతోషకరం”: పీవీ నరసింహా రావుకు భారతరత్నపై చిరంజీవి స్పందన
Chiranjeevi on PV Narasimha Rao Bharat Ratna: మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహా రావుకు భారతరత్న అవార్డు దక్కడం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలకు ఇది అత్యంత సంతోషకరమైన విషయం అని ట్వీట్ చేశారు.
Chiranjeevi: మాజీ ప్రధాని, భారత ఆర్థిక సంస్కరణలకు పితామహుడిగా భావించే పీవీ నరసింహా రావుకు దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పీవీ నరసింహా రావుతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్, మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‍లను కూడా భారతరత్నతో గౌరవించింది. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు (ఫిబ్రవరి 9) ప్రకటించారు. భారతరత్న పురస్కారం దక్కించుకున్న తొలి తెలుగు వ్యక్తిగా పీవీ నరసింహా రావు చరిత్రలో నిలిచారు.
పీవీ నరసింహా రావుకు భారతరత్న పురస్కారం రావడం పట్ల మెగాస్టార్, సినీ హీరో చిరంజీవి స్పందించారు. పీవీకి ఈ గౌరవం ఎప్పుడో దక్కాల్సిందని, ఈ పురస్కారానికి ఆయన పూర్తి అర్హుడని చిరూ పేర్కొన్నారు. ఆయనకు భారతరత్న దక్కడం తెలుగు వారికి అత్యంత సంతోషకరమైన విషయమని నేడు ట్వీట్ చేశారు.
భారత్‍ను ఆర్థిక శక్తిగా మార్చేందుకు పునాది వేసిన పీవీ నరసింహా రావుకు భారతరత్న దక్కడం అందరికీ ఆనందదాయకమని చిరంజీవి పేర్కొన్నారు. “నిజమైన దార్శనికుడు, విద్యావేత్త, బహుభాషావేత్త, గొప్ప రాజనీతిజ్ఞుడు, తెలుగు వారి గర్వకారణం, విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలతో ఆధునిక భారతదేశాన్ని మార్చి వేసి.. భారత్‍ను ఆర్థిక శక్తిగా మార్చాడనికి పునాది వేసిన వ్యక్తి మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు. ఆయనకు భారతరత్నతో సత్కారం దక్కింది. ఇది భారతీయులందరికీ ముఖ్యంగా తెలుగు వారికి మరింత సంతోషకరమైన విషయం” అని చిరంజీవి ట్వీట్ చేశారు. పీవీకి భారతరత్న రావడం ఆలస్యమైందని చిరూ అభిప్రాయపడ్డారు.
ఎంఎస్ స్వామినాథన్, మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‍కు భారతరత్న దక్కడంపై కూడా చిరంజీవి స్పందించారు.“ఇండియాను హరిత విప్లవం, ఆహార భద్రత మార్గంలో నడిపించిన వ్యక్తి, ప్రపంచం చూసిన గొప్ప శాస్త్రవేత్తల్లో ఒకరైన ఎంఎస్ స్వామినాథన్‍కు.. రైతుల సంక్షేమం కోసం అలుపెరుగకుండా కృషి చేసిన గొప్ప నాయకుడు, మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్‍కు కూడా భారతరత్న గౌరవం దక్కింది. గొప్పతనానికి ఎప్పటికైనా గుర్తింపు దక్కుతుందనే నమ్మకాన్ని బలపరిచిన అద్భుతమైన క్షణమిది” అని చిరంజీవి ట్వీట్ చేశారు.
కాగా, మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించింది. దేశ అత్యున్నత రెండో పురస్కారానికి మెగాస్టార్‌ను ఎంపిక చేసింది. దీంతో ఆయనకు కూడా చాలా మంది ప్రముఖులు కొంతకాలంగా శుభాకాంక్షలు చెబుతూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయనను సత్కరించింది.
సినిమాల సంగతికొస్తే..
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నారు. చిరూకి ఇది 156వ సినిమాగా ఉంది. సోషియో ఫ్యాంటసీ మూవీగా భారీ బడ్జెట్‍తో ఇది రూపొందుతోంది. బింబిసార ఫేమ్ వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ విషయంపై మూవీ యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. విశ్వంభర చిత్రాన్ని 2025 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ప్రొడ్యూజ్ చేస్తున్నారు. సుమారు రూ.150కోట్ల బడ్జెట్‍తో ఈ మూవీ తెరకెక్కుతుందని తెలుస్తోంది.