Mixed Veg Idli: మిక్స్‌డ్ వెజ్ ఇడ్లీ రెసిపీ ఇది ఏ వయసు వారికైనా హెల్తి బ్రేక్ ఫాస్ట్
Mixed Veg Idli: బ్రేక్ ఫాస్ట్‌గా ఇడ్లీ తింటే ఎంతో ఆరోగ్యమని చెబుతారు. ఎప్పుడూ ఒకేలాంటి ఇడ్లీ తినాలనిపించదు. కాబట్టి కొంచెం కొత్తగా మిక్స్డ్ ఇడ్లీ రెసిపీ ప్రయత్నించండి.
బ్రేక్ ఫాస్ట్‌లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటేనే ఆ రోజంతా చురుగ్గా ఉత్సాహంగా పనిచేయగలరు. బ్రేక్ ఫాస్ట్ అనగానే ఎక్కువమంది తినేది ఇడ్లీనే. ఎవరైనా కూడా ఇడ్లీని తినవచ్చు. ఇది ఆరోగ్యానికి అంతా మేలే చేస్తుంది. ఇడ్లీ తినడం వల్ల సైడ్ ఎఫెక్టులు కూడా రావు. అందుకే ఇడ్లీని ఆరోగ్యకరమైనదిగా చెబుతారు. అయితే ప్రతిసారీ ఒకేలా ఇడ్లీ చేసుకుంటే అంతగా నచ్చకపోవచ్చు. కాబట్టి కొత్తగా మిక్స్డ్ ఇడ్లీ ప్రయత్నించండి. ఇది ఏ వయసు వారికైనా ఆరోగ్యాన్ని అందిస్తుంది.
మిక్స్‌డ్ వెజ్ ఇడ్లీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
ఇడ్లీ రవ్వ - ఒక కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
వంట సోడా - చిటికెడు
కొత్తిమీర తురుము - ఒక స్పూను
పసుపు - చిటికెడు
క్యారెట్ తరుగు - ఒక స్పూను
బీన్స్ తరుగు - ఒక స్పూను
అల్లం తరుగు - ఒక స్పూను
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను
కరివేపాకులు - గుప్పెడు
ఇంగువ - చిటికెడు
మినప్పప్పు - ఒక స్పూను
శనగపప్పు - ఒక స్పూను
నూనె - సరిపడినంత
పెరుగు - అరకప్పు
జీలకర్ర - అర స్పూను
మిక్స్డ్ వెజ్ ఇడ్లీ రెసిపీ
1. మిక్స్డ్ వెజ్ ఇడ్లీ స్పెషాలిటీ ఏంటంటే ముందుగానే పప్పులను లేదా పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదు.
2. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
3. ఆ నూనెలో జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకులు, ఇంగువ వేసి కలుపుకోవాలి.
4. ఆ తర్వాత పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు వేసి కలుపుకోవాలి.
5. అందులోనే క్యారెట్, క్యాప్సికం, బీన్స్ తరుగును కూడా వేసి బాగా కలుపుకోవాలి.
6. ఇవి మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి. తర్వాత ఉప్పును, పసుపును కూడా వేసి బాగా కలుపుకోవాలి.
7. మంట చిన్నగా పెట్టి ఇడ్లీ రవ్వను కూడా వేసి బాగా కలపాలి.
8. ఇది మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
9. ఈ మిశ్రమాన్ని చల్లార్చాలి. అది చల్లారాక పెరుగును వేసి ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి.
10. తగిన నీళ్లు వేస్తే ఇది బాగా కలుస్తుంది. ఇందులో కొత్తిమీర తురుమును కూడా వేసి బాగా కలిపి 20 నిమిషాలు పక్కన పెట్టేయాలి.
11. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి లేదా నూనె రాసి ఈ పిండిని వేయాలి.
12. ఇడ్లీ గిన్నెలో పెట్టి ఉడికించుకోవాలి. ఒక పావుగంట తర్వాత టేస్టీ వెజ్ ఇడ్లీలు రెడీ అయిపోతాయి.
13. వీటిని వేడి వేడిగా తింటే రుచి అదిరిపోతుంది. ఇడ్లీలతో పాటు సాంబారు లేదా కొబ్బరి పచ్చడిని ప్రయత్నించండి.
14. మీకు ఖచ్చితంగా ఇది నచ్చుతుంది. అలాగే టమాటో చట్నీ తిన్నా రుచిగా ఉంటుంది.
సాధారణ ఇడ్లీలతో పోలిస్తే దీనిలో పుష్కలంగా కూరగాయలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మంచిది. సాధారణ ఇడ్లీ కన్నా మిక్స్డ్ వెజ్ ఇడ్లీలో మనం వేసిన పదార్థాలు అధికం. కాబట్టి పోషకాలు కూడా అధికంగానే అందుతాయి. ఒక్కసారి దీన్ని ప్రయత్నించి చూడండి. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. దీని రుచి అద్భుతంగా ఉండడం ఖాయం.
సంబంధిత కథనం