Lok sabha Polls 2024 : మొన్నటి వరకు ఒకే పార్టీ..! నేడు ఢీ అంటే ఢీ అంటున్న ఓరుగల్లు నేతలు-three leaders contesting for warangal mp also belong to brs ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Lok Sabha Polls 2024 : మొన్నటి వరకు ఒకే పార్టీ..! నేడు ఢీ అంటే ఢీ అంటున్న ఓరుగల్లు నేతలు

Lok sabha Polls 2024 : మొన్నటి వరకు ఒకే పార్టీ..! నేడు ఢీ అంటే ఢీ అంటున్న ఓరుగల్లు నేతలు

HT Telugu Desk HT Telugu
Apr 14, 2024 05:35 AM IST

Warangal Lok Sabha Constituency : వరంగల్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారైపోయారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్నవారే కావటంతో ఇక్కడి పోరు ఆసక్తికరంగా మారింది.

వరంగల్ బరిలో పోటీ చేస్తున్న నేతలు
వరంగల్ బరిలో పోటీ చేస్తున్న నేతలు

Warangal Lok Sabha Constituency: ఇన్నిరోజులు ఉత్కంఠ కలిగించిన వరంగల్ లోక్ సభ(Warangal Lok Sabha) స్థానానికి బీఆర్ఎస్ పార్టీ కూడా అభ్యర్థిని ఖరారు చేసింది. మహిళా ఈక్వేషన్ లో కొందరి పేర్లు, ఉద్యమకారుల కోటాలో మరికొందరు పేర్లు వినిపించినప్పటికీ.. చివరకు హనుమకొండ జడ్పీ చైర్మన్ గా పని చేస్తున్న డాక్టర్ మారపెల్లి సుధీర్ కుమార్ కు టికెట్ దక్కింది. దీంతో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కాగా.. పార్టీలు వేరైనా అభ్యర్థులంతా ఒకే పార్టీకి చెందిన వారనే చర్చ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు నిన్నమొన్నటి వరకు ఒకే పార్టీలో కలిసి పని చేసిన వాళ్లుకాగా.. ఇప్పుడు ముగ్గురు ప్రత్యర్థులుగా మారి పోటీలో నిలవడం చర్చనీయాంశమైంది.

కాంగ్రెస్ నుంచి కడియం బిడ్డ కావ్య

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కాగా.. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న కడియం కావ్య(Kadiyam Kavya) బీఆర్ఎస్ మూలాలున్న నాయకురాలే కావడం గమనార్హం. ఆమె తండ్రి కడియం శ్రీహరి స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత తన రాజకీయ వారసురాలిగా తన రెండో కూతురైన కడియం కావ్యను పార్లమెంట్ బరిలో నిలిపేందుకు చాలా కష్టపడ్డారు. మొదట బీఆర్ఎస్ నుంచి టికెట్ సంపాదించడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేశారు. అరూరి రమేశ్, పసునూరి దయాకర్, డాక్టర్ తాటికొండ రాజయ్య లాంటి పోటీ పడుతున్నా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఒప్పించి మరీ వరంగల్ ఎంపీ టికెట్ తన కూతురుకు ఇప్పించుకున్నారు. కానీ పార్టీ టికెట్ కేటాయించిన 15 రోజుల్లోనే కడియం శ్రీహరి, కూతురు కడియం కావ్య ఇద్దరూ నిర్ణయం మార్చుకున్నారు. పార్టీ పరిస్థితుల దృష్ట్యా తాము పోటీ నుంచి తప్పుకుంటున్నామని మార్చి 28న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(ఖణఈ) కు లేఖ రాసి, మీడియాకు విడుదల చేశారు. ఆ తరువాత కాంగ్రెస్ అగ్రనేతలను కలవడం, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇతర నేతలు కడియంను సంప్రదించడం, చివరకు మార్చి 31న కడియం శ్రీహరి, కావ్య ఇద్దరూ హస్తం పార్టీ కండువా కప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. పార్టీలో చేరిన మరునాడే కాంగ్రెస్ అధిష్ఠానం కడియం కావ్యకు ఎంపీ టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిన కడియం కావ్య కాంగ్రెస్ టికెట్ దక్కించుకుని ఎంపీ బరిలో నిలవడం గమనార్హం.

బీజేపీ బరిలో అరూరి రమేశ్

వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్(Aroori Ramesh) అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత ఎంపీ టికెట్ ఆశించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR), వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి కూడా అదే విషయాన్ని తీసుకెళ్లారు. ఇక టికెట్ కన్ఫామ్ చేసే తరుణంలోనే ఆయన ఎంపీ బరిలో నిలిచేందుకు నిరాసక్తత చూపించారు. దీంతో పార్టీ ప్రత్యామ్నాయం ఆలోచనలు చేసి, కడియం కావ్యకు టికెట్ ఇచ్చింది. ఇదిలాఉంటే అరూరి రమేశ్ ఎంపీ టికెట్ వద్దని చెప్పడంతో ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జరిగింది. దీంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఇతర నేతలు బుజ్జగించే ప్రయత్నం చేశారు. చివరకు కేసీఆర్ కూడా నచ్చజెప్పేందుకు చూశారు. అందరి మాటలు విన్న అరూరి చివరకు తనకు నచ్చిందే చేశారు. మార్చి 16న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీ గూటికి చేరారు. అనంతరం బీజేపీ వరంగల్ ఎంపీ టికెట్ ను అరూరి రమేశ్ కే కేటాయిస్తూ జాబితా విడుదల చేసింది. దీంతో బీఆర్ఎస్ నుంచి వెళ్లి బీజేపీలో చేరిన అరూరి ఎంపీ ఎన్నికల్లో విజయంపై దృష్టి పెట్టారు.

పార్టీలు వేరైనా నేతలంతా పాతోళ్లే..

బీఆర్ఎస్ నుంచి డాక్టర్ మారపెల్లి సుధీర్ కుమార్, బీజేపీ నుంచి అరూరి రమేశ్, కాంగ్రెస్ నుంచి కడియం కావ్య పోటీ చేస్తుండగా.. వాళ్లంతా ఒక గూటి పక్షులే కావడం గమనార్హం. పార్టీలు వేరైనా అభ్యర్థులంతా బీఆర్ఎస్ కు చెందిన లీడర్లేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS Party)పట్ల అసంతృప్తి వ్యక్తం చేసి.. సిట్టింగులను ఓడగొట్టిన జనాలకు ఇప్పుడు మళ్లీ అదే పార్టీ నుంచి వచ్చిన నేతలు అన్ని పార్టీల్లో దర్శనిమిస్తుండటంతో ప్రజలంతా ఇప్పుడు ఎటు వైపు మొగ్గు చూపుతారోననే చర్చ నడుస్తోంది. ఉద్యమ పార్టీగా పేరున్న బీఆర్ఎస్ ను ఆదరిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతుండగా.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కూడా గెలుపు ధీమాతోనే ఉన్నారు. మరో నెల రోజుల్లోనే లోక్ సభ ఎన్నికలు జరగనుండగా.. జనాల పల్స్ ఎటు వైపు మళ్లుతుందో తెలియాలంటే మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే.

(రిపోర్టింగ్ - హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

WhatsApp channel