Warangal BRS MP Candidate : ఎంపీటీసీ నుంచి ఎంపీ అభ్యర్థి వరకు..! సుధీర్ కుమార్ నేపథ్యమిదే
Loksabha Polls 2024 : వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ మారపెల్లి సుధీర్ కుమార్ ను ప్రకటించారు కేసీఆర్. ఆయన ప్రస్తుతం హన్మకొండ జిల్లా జెడ్పీ ఛైర్మన్ గా ఉన్నారు. ఎంపీటీసీగా గెలిచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు సుధీర్ కుమార్.
Warangal BRS MP Candidate Sudheer Kumar : కడియం ఫ్యామిలీ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి, కాంగ్రెస్ కండువా కప్పుకున్న అనంతరం గులాబీ పార్టీ బలమైన అభ్యర్థి కోసం బాగానే కసరత్తు చేసింది. వివిధ ఈక్వేషన్ లు పరిగణనలోకి తీసుకుని చివరకు వరంగల్ అర్బన్ జడ్పీ చైర్మన్ గా కొనసాగుతున్న డాక్టర్ మారపెల్లి సుధీర్ కుమార్(Sudheer Kumar) పేరును బీఆర్ఎస్ అధిష్ఠానం ఖరారు చేసింది. దీంతో ఇన్నిరోజులు బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే విషయంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడగా.. హాట్ టాపిక్ గా నిలిచిన వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపికైన వ్యక్తి ఎవరనే చర్చ మొదలైంది. ఇన్నిరోజులు జడ్పీ చైర్మన్ గా తెర వెనుకే ఉండిపోయిన ఆయన.. ఇప్పుడు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చల్లో నిలిచారు. కాగా నమ్మిన పార్టీకి విధేయుడిగా ఉంటూ డాక్టర్ సుధీర్ కుమార్ ఎదిగిన తీరు అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. ఒక చిన్న గ్రామంలో ఎంపీటీసీగా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి.. ఎంపీ క్యాండిడేట్ దాకా ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదు. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా.. చురుకుగా పాల్గొనడమే కాకుండా, అన్నీ తానై ముందుండి నడింపించి సుధీర్ కుమార్ రాజకీయ ప్రస్థానం తెలుసుకుందాం..
ఉన్నత విద్యావంతుడిగా పేరు
డాక్టర్ మారపెల్లి సుధీర్ కుమార్ (Warangal BRS MP Candidate Sudheer Kumar) జన్మస్థలం ప్రస్తుత హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్. వీరిది ఎస్సీ మాదిగ సామాజిక వర్గం. ఆయన తండ్రి జాన్.. తల్లి కిరీటమ్మ. తల్లి డాక్టర్ కాగా ముల్కనూరులో విధులు నిర్వర్తించేది. దీంతో కాలక్రమేణా మారపెల్లి ఫ్యామిలీ అంతా ముల్కనూరులోనే స్థిరపడింది. అక్కడే చదువుకుని ఎదిగిన ఆయన హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివారు. కాకతీయ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పర్తి చేసి, కాకతీయ యూనివర్సిటీలో బీఏఎంఎస్ చేసి, యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఎండీ పట్టా అందుకున్నారు.
ముల్కనూరు ఎంపీటీసీ సభ్యుడిగా మొదలు
ప్రస్తుత హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు నుంచి డాక్టర్ మారపెల్లి సుధీర్ కుమార్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1995లో ముల్కనూరు ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నికైన సుధీర్ కుమార్.. ఆ తరువాత ఎంపీపీ గా ఎన్నికై 1995 నుంచి 2000 వరకు కొనసాగారు. అనంతరం డాక్టర్ సుధీర్ కుమార్ ఎన్నడూ వెనుదిరిగి చూడకుండా రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగారు. ముల్కనూరు గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండగా.. 2001లో జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై, కరీంనగర్ జిల్లా పరిషత్తు వైస్ చైర్మన్ గా ఎంపికయ్యారు. 2001 నుంచి 2006 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ తరువాత జిల్లాలో విభజనలో భాగంగా ముల్కనూరు ప్రస్తుత హనుమకొండ జిల్లా పరిధిలోకి వచ్చింది. దీంతో 2018లో ఎల్కతుర్తి జడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేసి హనుమకొండ జిల్లా(వరంగల్ అర్బన్) జడ్పీ చైర్మన్ గా ఎంపికయ్యారు.
కెప్టెన్ ప్రధాన అనుచరుడు
రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి.లక్ష్మీకాంతారావుకు ప్రధాన అనుచరుడిగా పేరున్న డాక్టర్ మారపెల్లి సుధీర్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ఈ క్రమంలోనే హనుమకొండ జడ్పీ చైర్మన్ గా పని చేస్తున్న క్రమంలోనే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన వర్ధన్నపేట టికెట్ ఆశించారు. ఈ మేరకు తన మనసులోని మాటను కెప్టెన్ లక్ష్మీకాంతారావు ద్వారా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే వర్ధన్నపేట సిట్టింగ్ ఎమ్మెల్యే అరూరి రమేశ్ లీడింగ్ లో ఉండటంతో టికెట్ సుధీర్ కుమార్ కు దక్కలేదు. దీంతో ఆయన నిరాశ చెందకుండా తన ప్రయత్నాలు తాను చేశారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మొదట ప్రకటించిన కడియం కావ్య పార్టీ తప్పుకోవడంతో ఆ టికెట్ ఖాళీ కాగా మాజీ ఎంపీ, ప్రస్తుత కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ద్వారా సుధీర్ కుమార్ టికెట్ ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా సుధీర్ కుమార్ సేవలను గుర్తించి, విధేయతకు పట్టం కట్టారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు.