Boinapally Vinod Kumar : అన్న కూతురికి విద్యుత్ శాఖలో ఉద్యోగం, ఫేక్ ప్రచారం చేస్తున్నారని బోయినపల్లి వినోద్ ఫైర్-karimnagar news in telugu ex mp boinapally vinod kumar fires on bjp congress spreading fake news ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Boinapally Vinod Kumar : అన్న కూతురికి విద్యుత్ శాఖలో ఉద్యోగం, ఫేక్ ప్రచారం చేస్తున్నారని బోయినపల్లి వినోద్ ఫైర్

Boinapally Vinod Kumar : అన్న కూతురికి విద్యుత్ శాఖలో ఉద్యోగం, ఫేక్ ప్రచారం చేస్తున్నారని బోయినపల్లి వినోద్ ఫైర్

Boinapally Vinod Kumar : తన అన్న కూతురికి విద్యుత్ శాఖ ఉద్యోగం ఇప్పించానని వస్తున్న వార్తల్లో వాస్తవంలేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయిని ఆరోపించారు.

బోయినపల్లి వినోద్ కుమార్

Boinapally Vinod Kumar : ఫేక్ వార్తలతో బీజేపీ, కాంగ్రెస్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన...తనపై క్యూ న్యూస్ లో తీన్మార్ మల్లన్న అవాస్తవ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన అన్న కూతురు బోయినపల్లి సరితకు అర్హత లేకపోయినా విద్యుత్ శాఖలో ఉద్యోగం ఇచ్చారని వార్త ప్రసారం చేశారన్నారు. అసలు తనకు అన్నే లేరని, ఆ సరిత ఎవరో తెలియదన్నారు. ఇంటి పేరు కలిస్తే తనకు ముడిపెట్టడం సరికాదన్నారు. ఈ ఫేక్ వార్తను బీజేపీ, కాంగ్రెస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అసలు తనకు అన్న అంటూ ఎవరు లేరన్నారు. క్రాస్ చెక్ చేసుకోకుండా వార్త ఎలా ప్రసారం చేస్తారని వినోద్ కుమార్ ప్రశ్నించారు. బ్యాంకులను మోసం చేసి పరారైన నీరవ్ మోదీ ఇంటి పేరు మోదీ ఉంటే ప్రధాని మోదీకి సంబంధం ఉన్నట్లా అని ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల్లో లబ్ది కోసం బీజేపీ ఎంపీ బండి సంజయ్ దుష్ప్రచారం చేయించడం సరికాదన్నారు.

ఇంటి పేరు కలిస్తే బంధుత్వం అంటగడతారా?

బోయినపల్లి అని ఇంటి పేరు ఉన్నంత మాత్రాన బంధుత్వం ఎలా అంటగడుతారని వినోద్ కుమార్ ప్రశ్నించారు. తాను ఎంపీగా, ప్లానింగ్ బోర్డ్ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో ఏ అధికారి పైన ఒత్తిడి చేశానో చెప్పాలని బీజేపీ, కాంగ్రెస్ నేతలను డిమాండ్ చేశారు. తనను రాజకీయంగా బద్నాం చేసేందుకే ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ పోరాటం ఉండాలి కానీ తప్పుడు ప్రచారం చేయడం ఏమిటని మండిపడ్డారు. బోయినపల్లి స్వప్నకు నాకు సంబంధం ఏంటో నిరూపించగలరా? అని డిమాండ్ చేశారు.

రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూడొద్దు

"విద్యుత్ శాఖలో సీఎండీ ప్రభాకర్ రావు ఓ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చారు. ఆమె జీతభత్యాలు తీసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. ఆమె పేరు బోయినపల్లి సరిత. ఆమెకు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఉద్యోగం ఇప్పించారని తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ లో మాట్లాడారంట. దీన్ని బీజేపీ, కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వీడియో ప్రపంచం మొత్తం తిరిగి వచ్చింది. వినోద్ నీకు అన్న లేడు కదా? అన్న బిడ్డకు ఉద్యోగం ఏంటిని నా బంధువులు అడిగారు. ఇదంతా రాజకీయంగా దుష్ప్రచారమని నేను వాళ్లకు చెప్పాను. ధీరూభాయి అంబానీ ఇంటి పేరు ఉన్న వాళ్లు గుజరాత్ లో అడుక్కు తినేవాళ్లు కూడా ఉన్నారు. ఎవరి అదృష్టం వాళ్లది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగుతారు. ఇంటి పేరుతో ఇలా బంధుత్వం కలపొచ్చా? నీరవ్ మోదీ బ్యాంకులను ముంచి లండన్ లో దాక్కున్నాడు. మోదీ ఇంటి పేరు కలిసిందని విమర్శలు చేస్తామా? ఎన్నికలు రానివ్వండి ఎవరు ఏంచేశారో? చూద్దాం. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూడొద్దు. ప్రజలకు నచ్చకపోతే మార్చేస్తారు. మమల్ని మార్చినట్లే రేపు మిమల్ని మారుస్తారు." - బోయినపల్లి వినోద్ కుమార్